అఖిల‌ప‌క్షానికి రేణుక‌..మండిప‌డ్డ విజ‌య సాయి!

Update: 2018-07-17 10:59 GMT
రేప‌టి నుంచి పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు మొద‌లు కాబోతోన్న నేప‌థ్యంలో ఢిల్లీలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా వేడెక్కింది. రేప‌టి స‌మావేశాల‌ను పుర‌స్క‌రించుకొని నేడు అన్ని  పార్టీల వారితో ప్ర‌ధాని మోదీ అఖిల‌ప‌క్ష స‌మావేశం నిర్వ‌హించారు. అయితే, వైసీపీ త‌ర‌ఫున లోక్ స‌భ నుంచి ఎంపీ బుట్టా రేణుకను అఖిల ప‌క్ష స‌మావేశానికి పిలిచారు. దీంతో, ఏ ప్రాతిప‌దిక‌న ఆమెను ఆహ్వానించార‌ని వైసీపీ ఎంపీ విజ‌య సాయి రెడ్డి ప్ర‌శ్నించారు. పార్టీ ఫిరాయించిన బుట్టా రేణుకను అఖిలపక్షానికి ఎలా ఆహ్వానిస్తారంటూ మండిపడ్డారు. త‌మ పార్టీ నుంచి అధీకృత లేఖ లేకుండా రేణుకను పిలిచార‌ని - ఆమె పై అన‌ర్హ‌త పిటిషన్‌ పెండింగ్ లో ఉన్నా....పార్టీ తరఫున ఎలా పిలుస్తారని కేంద్రమంత్రి అనంతకుమార్‌ ను విజ‌య‌సాయి రెడ్డి ప్ర‌శ్నించారు.  బుట్టా రేణుక విషయంపై నేరుగా ప్రధానికి విజ‌య‌సాయి రెడ్డి ఫిర్యాదు చేశారు.

విజయసాయిరెడ్డికి విపక్షాలు మద్దతు తెలిపాయి. రేణుక‌ను పిల‌వ‌డం రూల్స్‌కు విరుద్ధమ‌ని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. దీంతో, రేణుక అనర్హత విషయంలో స్పీకర్‌ నిర్ణయం తీసుకోలేదని అనంతకుమార్ వివర‌ణ ఇచ్చారు. బీజేపీ-టీడీపీలు క‌లిసి కుమ్మ‌క్కు రాజ‌కీయాలు చేస్తున్నాయ‌ని అన్నారు. రాష్ట్రప్రయోజనాలను టీడీపీ ఎంపీలు గాలికొదిలేశార‌ని, సభా సజావుగా జ‌ర‌గాల‌నే ఉద్దేశం టీడీపీ ఎంపీలకు లేదన్నారు. ప్ర‌జా ప్రయోజనాలను టీడీపీ ఎంపీలు కాపాడలేర‌ని, హోదాపై వారికి చిత్త శుద్ధి లేదు గ‌న‌కే ప్రత్యేక ప్యాకేజికి ఒప్పుకుని ఏపీకి అన్యాయం చేశారని మండిప‌డ్డారు. ఏపీకి అన్యాయం చేసిన దుర్మాగ్మ‌పు సీఎం చంద్ర‌బాబు ప్యాకేజీకి ఒప్పుకున్నార‌ని మండిప‌డ్డారు. చంద్రబాబుకు ఇంగ్లీష్‌ రాదు.. లోకేష్‌కు కనీసం తెలుగు రాదని ఎద్దేవా చేశారు. తెలుగు దొంగ‌ల పార్టీ ఎంపీలందరూ కలిసి విపక్షాలను కలుస్తున్నారని, సమావేశాల్లో వారేం చేయ‌బోతున్నారో రేపు తెలుస్తుంద‌ని చెప్పారు. మ‌రోవైపు, కేంద్రంపై మ‌రోసారి అవిశ్వాస తీర్మానం నోటీసును టీడీపీ ఎంపీ కేశినేని నాని స్పీక‌ర్ కు స‌మ‌ర్పించారు. రేపు జ‌ర‌గ‌బోయే స‌మావేశాల్లో ఇది చ‌ర్చ‌కు వ‌చ్చే అవ‌కాశ‌ముంది. అయితే, రాబోయే ఎన్నిక‌లల్లో ఓట్ల కోస‌మే తెలుగు దొంగ‌లు ఈ త‌ర‌హా డ్రామాలు ఆడుతున్నార‌ని, వీరు స‌మావేశాలు స‌జావుగా సాగ‌నివ్వ‌ర‌ని విజ‌య‌సాయి రెడ్డి అన్నారు.

Tags:    

Similar News