ప్రత్యేక హోదా ఇస్తామంటే రాజీనామాలకు సిద్ధం

Update: 2017-12-11 05:21 GMT
ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌త్యేక హోదా కోసం మ‌రోమారు త‌న గ‌ళం విప్పింది. ఈ ద‌ఫా క్షేత్ర‌స్థాయి పోరాటాల రూపం కాకుండా...రాజ్యంగ‌బ‌ద్ద‌మైన ఒత్తిడికి సిద్ధ‌మ‌యింది. రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలు నెరవేర్చేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు తమ పోరాటం ఆగదని, రాష్ట్రానికి ఇప్పుడే ప్రత్యేక హోదా ఇస్తామంటే వెంటనే తమ ఎంపీలంతా రాజీనామా చేయడానికి సిద్ధమని వైఎస్‌ ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు స్పష్టం చేశారు. ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు ఎండగట్టేందుక - రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు వైకాపా అస్త్రాలు సిద్ధం చేసుకుందన్నారు.

వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర 31వ రోజైన ఆదివారం అనంతపురం జిల్లా కూడేరు మండలంలో కొనసాగింది. రాత్రి జగన్ అధ్యక్షతన వైకాపా పార్లమెంటరీ కమిటీ సమావేశం సుమారు రెండు గంటల పాటు జరిగింది. ఈ సందర్భంగా పార్లమెంట్‌ లో ఎంపీలు వ్యవహరించాల్సిన తీరు - ప్రస్తావించాల్సిన సమస్యలు - విధి విధానాలపై జగన్ చర్చించి దిశానిర్ధేశం చేశారు. అనంతరం ఎంపీలు మేకపాటి రాజమోహన్‌ రెడ్డి - మిథున్‌ రెడ్డి - అవినాష్‌ రెడ్డి - విజయసాయిరెడ్డి - వైవి సుబ్బారెడ్డి - వరప్రసాద్ విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రాజ‌మోహ‌న్ రెడ్డి - మిధున్‌ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత విభజన చట్టంలో చెప్పిన మేరకు ఏ ఒక్క హామీని కేంద్రం నెరవేర్చలేదని మండిపడ్డారు. అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్ ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామంటే వెంకయ్యనాయుడు - అరుణ్‌ జైట్లీ ఆనాడు పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇప్పిస్తామన్నారని, సీఎం చంద్రబాబు సైతం 15 ఏళ్లు కావాలని డిమాండ్ చేశారని గుర్తుచేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌ కు గొప్ప రాజధాని కట్టిస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు - విశాఖ రైల్వే జోన్ - విభజన హామీలు ఏవీ నెరవేరలేదన్నారు. వీటన్నింటిపై తమ అధినేత జగన్ చేసిన దిశానిర్ధేశం మేరకు పార్లమెంట్‌ లో వైకాపా తరఫున తమ వాణి వినిపిస్తామన్నారు.

 ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే రాష్ట్రంలో అనంతపురంతో పాటు వెనుకబడిన అనేక జిల్లాలు బాగుపడేవని వైసీపీ ఎంపీలు గుర్తు చేశారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి వల్ల నేడు అయోమయంలో పడిపోయి ఆందోళనకు గురిచేస్తోందన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామంటే తమ ఎంపీలందరం స్పీకర్ ఫార్మాట్‌ లో ఇప్పుడే రాజీనామా చేస్తామన్నారు. ఏ హామీ ఇవ్వకుండా రాజీనామా చేస్తే పార్లమెంట్‌ లో ఇక మాట్లాడే వారే ఉండరన్నారు. పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరిన నలుగురు ఎంపీలు - 23 ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించే దమ్ము సీఎం చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. వారితో రాజీనామాలు చేయిం చి ఎన్నికలు నిర్వహించాలని - పోలవరం ప్రాజెక్టును కేంద్రమే చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆనాడు సీఎం చంద్రబాబు చేపట్టకపోయి ఉంటే ఇప్పుడీ దుస్థితి ఉండేది కాదన్నారు. ప్రత్యేక హోదాతో పాటు పోలవరం నిర్మాణం బాధ్యత ప్రధాని మోడీపై ఉందన్నారు. ఏపీలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు - ఎంపీలపై వేటు వేసి లోక్‌ సభ - అసెంబ్లీ స్పీకర్లు తమ చిత్తశుద్ధిని చాటుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో టీడీపీ పార్లమెంట్‌ లో మాట్లాడితే వైకాపా మద్దతు ఉంటుందన్నారు. 2018 జూన్ నాటికి పోలవరాన్ని పూర్తి చేయాలన్నారు. చంద్రబాబు నిజాయితీపరుడైతే పోలవరంపై ఇప్పటి వరకూ చేసిన ఖర్చుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడదల చేయాలని డిమాండ్ చేశారు.

చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని, ఆయన నోరు తెరిస్తే అబద్ధాలు చెబుతున్నారని వైసీపీ విమర్శించారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగే పని కాదని, అయితే చంద్రబాబు కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలకు సీట్లు కేటాయించేందుకే పునర్విభజన డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు చెప్పిన విధంగా జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధిపై సీఎం చంద్రబాబు కుంటిసాకులు చెబుతూ తప్పించుకుంటున్నారని ధ్వజమెత్తారు. కేంద్రం ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న 10 పథకాలకు వాడుతూ దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు పోలవరం సమస్యపై కేంద్రం, టీడీపీ వేర్వేరు అనే భావనను ప్రజల్లో కలిగించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
Tags:    

Similar News