వైసీపీ సంచ‌ల‌నం!..ఇప్ప‌టికిప్పుడే ఎంపీల రాజీనామా!

Update: 2018-02-01 11:12 GMT

పార్ల‌మెంటు సాక్షిగా న‌రేంద్ర మోదీ ప్ర‌భుత్వం నేటి ఉద‌యం ప్ర‌వేశ‌పెట్టిన కేంద్ర బ‌డ్జెట్‌ ను  అస్త్రంగా చేసుకుని ఏపీలో విప‌క్ష వైసీపీ సంధించిన ఓ ప్ర‌క‌ట‌న‌... ఇప్పుడు ఆ పార్టీకి బ్ర‌హ్మాస్త్రంగానే ప‌రిణ‌మించే అవకాశాలు ఉన్నాయ‌న్న వాద‌న వినిపిస్తోంది. నేటి ఉద‌యం లోక్ స‌భ‌లో 2018-19 వార్షిక బ‌డ్జెట్‌ ను ప్ర‌వేశ‌పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ... ఆ బ‌డ్జెట్ లో తెలుగు నేల‌కు ప్ర‌త్యేకించి ఆర్థిక ఇబ్బందుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న ఏపీని ఏమాత్రం ప‌ట్టించుకున్న‌ట్లుగా క‌నిపించ‌లేదు. మోదీ స‌ర్కారు త‌న ఐదేళ్ల పాల‌న‌లో ప్ర‌వేశ‌పెడుతున్న చివ‌రి బ‌డ్జెట్ ఇదే క‌నుక‌... ఇందులో ఏపీకి ప్ర‌ధాన్యం ల‌భిస్తుంద‌ని అంతా ఆశించారు. అయితే ఈ అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేసేసిన మోదీ స‌ర్కారు... ఏపీకి మ‌రోమారు మొండి చెయ్యే చూపించింది. దీనిపై మిత్ర‌ప‌క్షంగా ఉన్న టీడీపీ కూడా బీజేపీ స‌ర్కారు వ్య‌వ‌హారంపై నిప్పులు చెరిగేందుకు రంగంలోకి దిగ‌గా... ఆ పార్టీతో పాటే క‌ద‌న రంగంలోకి దిగేసిన విప‌క్ష వైసీపీ మాత్రం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసేసింది.

వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి స్వయానా బాబాయిగా ఉన్న ఆ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నోట వినిపించిన ఈ ప్ర‌క‌ట‌న ఏపీ రాజ‌కీయాల్లో ఒక్క‌సారిగా హీట్ పెంచేసింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.  ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం అవ‌స‌ర‌మైతే త‌మ పార్టీ ఎంపీలు రాజీనామాలకు కూడా వెనుకాడ‌ర‌ని ఇదివ‌ర‌కే వైసీపీ అధినేత హోదాలో వైఎస్ జ‌గ‌న్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం తెలిసిందే. అయితే ఏపీ బాగు కోసం ఎంపీల‌తో రాజీనామాలు చేయిస్తాన‌న్న జ‌గ‌న్‌... ఇప్ప‌టిదాకా ఎందుకు చేయించ‌లేద‌ని టీడీపీ ఎప్ప‌టిక‌ప్పుడు సెటైర్లు సంధిస్తూనే ఉంది. అదే స‌మ‌యంలో టీడీపీ సెటైర్ల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు దీటుగానే స‌మాధానం చెబుతూ వ‌స్తున్న వైసీపీ నేత‌లు... స‌రైన స‌మ‌యంలో స‌రైన నిర్ణ‌యం తీసుకుంటామ‌ని, అయినా ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం టీడీపీ ఏం త్యాగాలు చేసిందో చెప్పాల‌ని, అస‌లు ఏపీకి ప్ర‌త్యేక హోదా రాకుండా మోకాలొడ్డింది టీడీపీనేన‌ని కూడా వైసీపీ ఎదురు దాడికి దిగిన విష‌య‌మూ మ‌న‌కు తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో నేటి ఉద‌యం పార్ల‌మెంటులో ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అర‌కొర నిధుల‌ను కేటాయించారు. ఏపీని ప్ర‌త్యేక దృష్టితో చూస్తామ‌ని చెప్పి కూడా జైట్లీ చేతులెత్తేశారు. హామీలు ఇచ్చిన ఏపీకి మొండి  చేయి చూని జైట్లీ... అస‌లు నోరు తెర‌చి అడ‌గ‌ని మ‌హారాష్ట్ర లాంటి రాష్ట్రాల‌కు పెద్ద ఎత్తున కేటాయింపులు జ‌రిపారు. దీనిపై వైసీపీ భ‌గ్గుమంది. ఏపీని ప‌ట్టించుకోని కేంద్రంపై ఇక పోరు సాగిస్తామ‌ని ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు జైట్లీ ప్ర‌సంగం ముగిసిన త‌ర్వాత పార్ల‌మెంటు ఆవ‌ర‌ణ‌లో మీడియా ముందుకు వ‌చ్చిన వైవీ సుబ్బారెడ్డి... బ‌డ్జెట్‌ లో ఏపీకి తీర‌ని అన్యాయం జ‌రిగింద‌ని ఆవేద‌న వ్యక్తం చేశారు. ఏపీకి న్యాయం కోసం ఇప్ప‌టికిప్పుడు తాము రాజీనామాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని ప్ర‌క‌టించారు. ఈ విష‌యాన్ని ఇప్ప‌టికే తాము పార్టీ అధినేత దృష్టికి తీసుకువెళ్లామ‌ని, త‌మ అధినేత స‌రేనంటే ఇప్ప‌టికిప్పుడు, ఇక్క‌డే రాజీనామాలు చేస్తామ‌ని ఆయ‌న ప్ర‌కటించారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీ ప‌ట్ల కేంద్రం వైఖ‌రి స‌రికాద‌ని ఆరోపించిన ఆయ‌న‌... త‌మ విశ్వ‌స‌నీయ‌త‌పై అవాకులు చెవాకులు పేలే... టీడీపీ స‌ర్కారు ఇప్పుడు ఏం స‌మాధానం చెబుతుంద‌ని కూడా ఆయ‌న ప్ర‌శ్నించారు. మొత్తానికి సింగిల్ ప్ర‌క‌ట‌న‌తో వైవీ సుబ్బారెడ్డి ఏపీ రాజకీయాల‌ను మండించేశార‌ని చెప్పాలి. అస‌లు సుబ్బారెడ్డి ప్ర‌క‌ట‌న‌పై స్పందించేందుకు టీడీపీ స‌హా ఏ ఒక్క పార్టీ కూడా స్పందించే సాహ‌సం కూడా చేసే ప‌రిస్థితి లేద‌న్న వాద‌న వినిపిస్తోంది.  

Tags:    

Similar News