'కోలగట్లకు టికెట్ ఇవ్వొద్దు'

Update: 2023-01-21 02:30 GMT
విజయనగరం వైసీపీలో జెయింట్‌కిల్లర్ అనిపించుకున్న కోలగట్ల వీరభద్రస్వామికి అసెంబ్లీలో డిప్యూట స్పీకర్ పదవి ఇచ్చి జగన్ ప్రయారిటీ ఇచ్చారు. అయితే.. విజయనగరంలో అవనాపు సోదరులను మాత్రం వైసీపీ విస్మరిస్తోందని... అవనాపు విజయ్ మొదటి నుంచి టికెట్ కోరుతున్నా పార్టీ ఆయనకు న్యాయం చేయడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా బీసీ వర్గానికి చెందిన ఆయనకు పార్టీ పట్టించుకోకుండా ఆర్థికంగా బలవంతుడైన కోలగట్లకు ప్రాధాన్యం ఇస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పురుడు పోసుకున్న కొద్ది గంటల్లోనే ఆ పార్టీలో చేరిన అతికొద్ది రాజకీయ కుటంబాలలో అవనాపు కుటుంబం ఒకటి. విజయనగరం మున్సిపల్ చైర్మన్‌గా పనిచేసి విజయనగరం పట్టణం, చుట్టుపక్కల ప్రాంతాల్లో పట్టున్న నాయకుడు అవనాపు సూరిబాబు, ఆయన కుమారులు విజయ్, విక్రమ్‌లు జగన్ పార్టీ పెట్టిన వెంటనే అందులో చేరుతున్నట్లుప్రకటించారు.

అప్పట నుంచి వైసీపీ కోసం నిత్యం కష్టపడ్డారు. అయితే.. అవనాపు సూరిబాబు అనారోగ్యంతో చనిపోవడంతో అప్పటికి ఇంకా రాజకీయం పెద్దగా తెలియని విజయ్, విక్రమ్‌లు ఒంటరిపోరాటం సాగించారు. మొదట్లో జగన్ వీరికి మంచి ప్రాధాన్యం ఇచ్చారు. 2014లో అవనాపు విజయ్‌కు వైసీపీ టికెట్ ఖాయం అనుకున్నారు. కానీ, కాంగ్రెస్ నుంచి కోలగట్ల వైసీపీలో చేరి టికెట్ తన్నుకుపోయారు. దీంతో అవనాపు సోదరులు అసంతృప్తితో కోలగట్లకు వ్యతిరేకంగా పనిచేసినట్లూ చెప్తారు.

ఆ ఎన్నికల్లో కోలగట్ల విజయం సాధించినప్పటికీ తనకు అవనాపు సోదరులు సహకరించలేదంటూ జగన్‌కు ఫిర్యాదు చేయడంతో వారి ప్రాధాన్యం తగ్గుతూ వచ్చింది. అనంతరం అవనాపు కుటుంబానికి సన్నిహితుడైన బొత్స సత్యనారాయణ కూడా వైసీపీలోనే చేరినా వీరికి టికెట్ మాత్రం ఇప్పించుకోలేకపోయారు. దీంతో 2019లోనూ కోలగట్లే పోటీ చేసి విజయనగరంలో పాతుకుపోయారు.

దీంతో వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్ ఇవ్వాలంటూ అవనాపు విజయ్ ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంబించారు. బీసీలు అధికంగా ఉన్న విజయనగరంలో బీసీలమైన తమకు టికెట్ ఇవ్వాలని అవనాపు విజయ్ పార్టీని కోరుతున్నారు. తాజాగా విశాఖలో వైవీ సుబ్బారెడ్డిని కలిసి కూడా ఆయన టికెట్ కోరారు.

ప్రస్తుతం వైసీపీ యువజన శాఖ రాష్ట్ర కమిటీలో ఉన్న అవనాపు విజయ్ విజయనగరం పట్టణంలో నిత్యం ప్రజల్లో తిరుగుతున్నా కోలగట్లను కాదని ఆయనకు టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని వైసీపీ వర్గాల నుంచే వినిపిస్తోంది. అయితే.. అవనాపు విజయ్ మాత్రం ఈసారి ఎలాగైనా టికెట్ సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. మరి జగన్ అనుగ్రహం విజయ్‌కు ఉంటుందో.. కోలగట్లకు ఉంటుందో చూడాలి. 



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News