ఆయన అబద్ధం చెప్పినా..గడ్డం నిజం చెబుతోంది

Update: 2016-11-07 08:55 GMT
రాయలసీమకు నీరిచ్చిన అపర భగీరథుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు అని ఏపీ శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ సతీశ్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. అదే సమయంలో ఆయన విపక్ష వైసీపీపై మండిపడ్డారు.  లోక కల్యాణం కోసం దేవతలు యజ్ఞాలు చేస్తే రాక్షసులు అడ్డుపడినట్లుగా  జగన్‌ కూడా రాక్షసుడిలాగా చంద్రబాబు చేస్తున్న అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. జగన్‌ కలియుగ రాక్షసుడని వ్యాఖ్యానించారు. 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతిహామీని చంద్రబాబు నెరవేరుస్తున్నారని సతీష్ రెడ్డి చెప్పారు.
    
అయితే.. సకాలంలో పట్టిసీమ పూర్తి చేసి రాయలసీమకు నీరందించిన అపర భగీరథుడు చంద్రబాబు అన్న సతీశ్ రెడ్డి మాటలు అబద్ధాలని ఆయన గడ్డమే చెబుతోందని వైసీపీ నేతలు అంటున్నారు. చంద్రబాబు నిజంగానే అపర భగీరథుడిగా రాయలసీమకు నీరు అందించి ఉంటే సతీష్ రెడ్డి తన గడ్డం ఇంకా ఎందుకు తీయలేదని ప్రశ్నిస్తున్నారు.
    
నిజానికి సతీశ్ రెడ్డి గడ్డం పెంచుకోవడం వెనుక పెద్ద కథే ఉంది. రాయలసీమలోని గండికోట రిజర్వాయర్‌ కు నీరు తెచ్చేవరకూ గడ్డం తీయబోనని రెండున్నరేళ్ల క్రితం ఆయన శపథం చేశారు. కానీ ఇప్పటికీ అది పూర్తికాలేదు. దీంతో ఆయన ఇంకా గడ్డం తీయలేదు. రాయలసీమకు నీరు ఎంతవరకు వచ్చిందన్న విషయాన్ని తన గడ్డమే చెబుతున్నా సతీశ్ రెడ్డి ఎందుకిలా చంద్రబాబు చెప్పే అవాస్తవాలనే తానూ ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబుతో పాటు సతీశ్ రెడ్డి కూడా రాయలసీమ ప్రజలను మోసం చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News