వైసీపీకి ఓట్లేస్తేనే మంచి నీళ్లు ఇస్తాం: వైసీపీ సర్పంచ్‌ బెదిరింపులు!

Update: 2022-10-26 09:59 GMT
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. వచ్చే ఎన్నికల్లో గెలిచి మరోమారు అధికారం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. 175కి 175 సీట్లు సాధించాలని వైసీపీ లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు కొన్ని ప్రాంతాల్లో తమ పార్టీకి ఓట్లేయకపోతే పథకాలు ఆపేస్తామని హెచ్చరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు గడప గడపకు మన ప్రభుత్వం పేరిట ప్రజల వద్దకు వెళ్తున్నారు.

మీకు సంక్షేమ పథకాలు కావాలంటే వైసీపీకి ఓటేయాల్సిందేనని.. ఓటేయకపోతే పథకాలు రావని హెచ్చరిస్తున్నట్టు పలు పత్రికల్లో కథనాలు వచ్చాయి.

తాజాగా ఇలాగే ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం కొలభీముపాడు గ్రామంలో వైసీపీ సర్పంచ్‌ బెదిరిస్తున్నారని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు.  మంచినీటి ట్యాంకర్లు తీసుకురావాలంటే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో చేరాల్సిందేనని పంచాయతీ బోరు వద్ద ఉన్న స్విచ్‌ ప్యానెల్‌ బోర్డును గ్రామ సర్పంచ్‌ తీసేశాడని స్థానికులు విమర్శిస్తున్నారు.

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం కొలభీముపాడు గ్రామంలో 800 మంది జనాభా ఉన్నారు. ఇందులో భాగంగా ఉన్న ఎస్సీ పాలెంలో 200 మంది నివసిస్తున్నారు. వీరి కోసం రెండు బోర్లు వేశారు. బోరు వద్ద చిన్న ట్యాంకు నిర్మించారు. స్థానికులు ఈ ట్యాంక్‌లోకి నీటిని తీసుకోకుండా నేరుగా పైపుతో బోరు వద్ద నీటిని తీసుకెళ్తున్నారు.

ఈ విషయాన్ని గమనించిన సర్పంచి చిట్టిరెడ్డి సుబ్బారెడ్డి.. నీటిని నేరుగా వాడకూడదని, ట్యాంకు నుంచే నిల్వ చేసి వాడుకోవాలని ఇటీవల హెచ్చరించారు. తాజాగా అక్టోబర్‌ 21న బోరు స్విచ్‌ బోర్డును తొలగించి ఇంటికి తీసుకెళ్లాడు.

దీంతో తాగునీటి కోసం ఐదు రోజులుగా ఇబ్బందులు పడుతున్న ఎస్సీ పాలెం వాసులు సర్పంచ్‌ ఇంటికి వెళ్లి ప్రశ్నించారు. "కాలనీలోని టీడీపీ వాళ్లంతా నా ఇంటికి వచ్చి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో చేరితేనే నీళ్లిస్తాం. అప్పుడే స్విచ్‌ ప్యానెల్‌ బోర్డ్‌ ఇస్తాను. లేకుంటే ట్యాంకర్లలో నీళ్లు తెప్పించండి" అని సర్పంచ్‌ చెప్పడంతో బాధితులు వాపోయారు. ఉన్నతాధికారులు స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.

ఈ అంశంపై ప్రముఖ దినపత్రికల్లో కథనాలు వచ్చాయి. దీంతో వైసీపీ సర్పంచ్‌ వ్యవహారం వైరల్‌గా మారింది. సర్పంచ్‌పై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. తాగునీరు ఇవ్వడానికి కూడా వైసీపీలో చేరాలని ఒత్తిడి పెట్టడం ఏమిటని నిలదీస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News