వైసీపీ వ్యూహంతో గుంటూరు టీడీపీకి కోలుకోలేని దెబ్బేనా?

Update: 2020-11-09 01:30 GMT
రాజ‌కీయాల్లో వ్యూహ ప్ర‌తివ్యూహాలు కామ‌న్‌. అయితే, ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ వేస్తున్న వ్యూహా లకు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ ప్ర‌తివ్యూహం వేయ‌లేని ప‌రిస్థితి నెల‌కొంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. మ‌రీ ముఖ్యంగా టీడీపీ ఎక్కువ‌గా ఆశ‌లు పెట్టుకున్న గుంటూరు జిల్లాపై వైసీపీ వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపు తోంది. గ‌త ఎన్నిక‌ల్లోనే టీడీపీ ఇక్క‌డ భారీ ఆశ‌లు పెట్టుకుంది. రాజ‌ధాని ఏర్పాటుతో ఈ జిల్లా మొత్తం త‌మ హ‌వా సాగుతుంద‌ని అంచ‌నా వేసింది. కానీ, ఇక్క‌డి ప్ర‌జ‌లు కేవ‌లం ఒక ఎంపీ, రెండు అసెంబ్లీ స్థానాల్లో మాత్ర‌మే టీడీపీకి ప‌ట్టం క‌ట్టారు. మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ వీర విహారం చేసింది.

స‌రే! అప్ప‌టికి ఇప్ప‌టికి ప‌రిస్థితులు మారాయి కాబ‌ట్టి.. టీడీపీ మ‌ళ్లీ పుంజుకుంద‌నే భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. అమ‌రావ‌తి రాజ‌ధానిని త‌ర‌లిస్తామ‌ని.. మూడు రాజ‌ధానులు ఏర్పాటు చేస్తామ‌ని.. వైసీపీ స‌ర్కారు ప్ర‌క‌ట‌న చేయ‌డంతో ఇక్క‌డి ప్ర‌జ‌లు ఆగ్ర‌హంతో ఉన్నార‌ని.. త‌మ‌వైపు మొగ్గు చూపుతున్నార‌ని టీడీపీ లెక్క‌లు క‌డుతోంది. కానీ, అధికార వైసీపీ మ‌రో వ్యూహంతో ముందుకు ప‌రుగులు పెడుతోంది. టీడీపీకి బ‌ల‌మైన ఓటు బ్యాంకుగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో పునాదులు క‌దిలించేలా రాజ‌కీయ స‌న్నాహాల‌కు తెర‌దీయ‌డంతో పాటు.. పాల‌న ప‌రంగా కూడా కీల‌క‌మైన నిర్ణ‌యాలు తీసుకుంటోంది.

రాష్ట్రంలో కొత్త జిల్లాల‌ను ఏర్పాటు చేయాల‌ని త‌ల‌పోసిన వైసీపీ స‌ర్కారు.. ఈ క్ర‌మంలోనే గుంటూరులోని ప‌ల్నాడు ప్రాంతాన్ని జిల్లాగా ఏర్పాటు చేయ‌నుంది. ఒక‌వేళ ప‌ల్నాడు జిల్లా ఏర్ప‌డితే.. ఈ జిల్లా ప‌రిధిలోకి న‌ర‌సారావుపేట పార్ల‌మెంటు ప‌రిధిలోని ఏడు నియోజ‌క‌వ‌ర్గాలు వ‌స్తాయి. చిలకలూరిపేట, నరసరావుపేట, సత్తెనపల్లి, పెదకూరపాడు, వినుకొండ, గురజాల, మాచర్ల నియోజ‌క‌వ‌ర్గాలు న‌రస‌రావుపేట పార్ల‌మెంటు స్థానంలో ఉన్నాయి. వీటిలో ఒక్క మాచ‌ర్ల మిన‌హా మిగిలిన‌వ‌న్నీ కూడా టీడీపీకి కంచుకోట‌లు. వీటిపై కన్నేసిన వైసీపీ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ టీడీపీని దెబ్బ‌కొట్టేలా.. వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతోంది.

ప‌ల్నాడు జిల్లాను ఏర్పాటు చేయ‌డంతోపాటు.. జిల్లా కేంద్రంగా న‌ర‌స‌రావుపేట‌ను ఏర్పాటు చేయ‌నుంది. పేట కేంద్రంగా జిల్లా ఏర్పాటైతే.. అంద‌రికీ అనుకూలంగా ఉంటుంద‌ని.. ఇది రాజ‌కీయంగా వైసీపీకి కలిసి వ‌స్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇప్ప‌టికే న‌ర‌స‌రావు పేట అభివృద్ధి చెంది ఉంది. దీంతో ఇక్క‌డ ఇంకొంత శ్ర‌ద్ధ పెడితే.. జిల్లా కేంద్రంగా ఉండాల్సిన అన్ని హంగులు వ‌స్తాయి. ఇది వైసీపీని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లేందుకు ఎంతో దోహ‌ద ప‌డుతుంద‌ని.. అదేస‌మయంలో టీడీపీ ఎన్నో ఏళ్లుగా ఇక్క‌డ నుంచి గెలుస్తున్నా.. తాము చేసిన అభివృద్ధి చేయ‌లేద‌ని చెప్పుకొనేందుకు కూడా వైసీపీకి అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు.

ఇక్క‌డ విశేషం ఏంటంటే.. ఈ విష‌యంలో టీడీపీ ఏమీ చేయ‌లేని ప‌రిస్థితి.  పేట‌ను అభివృద్ధి చేసింది తామే అయినా.. జిల్లా ప్ర‌క‌ట‌న విష‌యంలో ముందుకు రాలేక పోవ‌డం.. పోనీ.. ప‌ల్నాడును అభివృద్ధి చేయాల‌న్న గ‌త డిమాండ్ల‌ను సైతం అధికారంలో ఉండ‌గా ప‌ట్టించుకోక‌పోవ‌డం వంటివి టీడీపీకి పెను ఇబ్బందిగా మారాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. దీంతో గుంటూరు జిల్లాలో వైసీపీ దూకుడు పెరుగుతుంద‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు.


Tags:    

Similar News