సుప్రీంకోర్టులో మూడు రాజ‌ధానుల వ్య‌వ‌హారం.. వైసీపీ వ్యూహం ఇదేనా?

Update: 2022-09-19 08:30 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మూడు రాజ‌ధానుల‌ను ఏర్పాటు చేస్తూ జ‌గ‌న్ ప్ర‌భుత్వం తెచ్చిన చ‌ట్టాన్ని గ‌త మార్చిలో ఏపీ హైకోర్టు కొట్టేసిన సంగ‌తి తెలిసిందే. రాజ‌ధానిని మార్చే అధికారం ఏపీ శాస‌న‌స‌భ‌కు లేద‌ని హైకోర్టు విస్ప‌ష్ట తీర్పు జారీ చేసింది. అయితే అప్ప‌టి నుంచి కొన్నాళ్లు పాటు సైలెంట్‌గా ఉన్న జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఇటీవ‌ల మ‌ళ్లీ దూకుడు పెంచింది. మూడు రాజ‌ధానులే త‌మ విధాన‌మ‌ని.. అమ‌రావ‌తి ఒక కులానికి చెందిన రాజ‌ధాని అని ఆరోపిస్తోంది. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ నుంచి వైఎస్సార్సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, చోటామోటా నేత‌లంతా ఇదే పాట పాడుతున్నారు.

అంతేకాకుండా అమ‌రావ‌తి రైతులు ప్ర‌స్తుతం చేస్తున్న అమ‌రావ‌తి నుంచి అర‌స‌వ‌ల్లి వ‌ర‌కు పాద‌యాత్ర‌పై వైఎస్సార్సీపీ నేత‌లు మండిప‌డుతున్నారు. ఉత్త‌రాంధ్ర‌పై ఈ పాద‌యాత్ర‌ను దాడిగా, దండ‌యాత్ర‌గా చూపుతూ ప్రాంతీయ విద్వేషాల‌ను రెచ్చ‌గొట్ట‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రోవైపు జ‌గ‌న్ ప్ర‌భుత్వం తాజా అసెంబ్లీ స‌మావేశాల్లో మ‌ళ్లీ మూడు రాజ‌ధానుల‌కు అనుగుణంగా కొత్త బిల్లును తెస్తుంద‌ని వార్త‌లొచ్చినా అది కార్య‌రూపం దాల్చ‌లేదు.

హైకోర్టు మూడు రాజ‌ధానుల చ‌ట్టాన్ని కొట్టేస్తూ ఇచ్చిన‌ తీర్పును సవాల్ చేస్తూ ఆరు నెల‌ల తర్వాత సుప్రీంకోర్టులో కేసు వేసింది. దీనిపై విశ్లేష‌కులు ర‌క‌ర‌కాల ఊహాగానాలు చేస్తున్నారు. హైకోర్టు తీర్చు ఇచ్చిన‌ప్పుడే సుప్రీంకోర్టులో కేసు వేసి ఉంటే వ‌చ్చే ఎన్నిక‌ల లోపే తీర్పు వ‌చ్చేద‌ని అంటున్నారు. ఒక‌వేళ సుప్రీంకోర్టులోనూ జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా తీర్పు వ‌స్తే అది ఎన్నిక‌ల ముందు ఆ పార్టీకి శ‌రాఘాతంగా మారే ప్ర‌మాద‌ముంద‌ని చెబుతున్నారు. అందుకే జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఉద్దేశ‌పూర్వ‌కంగా కావాల‌నే హైకోర్టు తీర్పుపై ఆరు నెల‌లపాటు గ‌మ్మున ఉండి.. ఇప్పుడు మ‌ళ్లీ యాక్టివ్ అయ్యింద‌ని గుర్తు చేస్తున్నారు.

సుప్రీంకోర్టులో హైకోర్టు తీర్పును స‌వాల్ చేస్తూ వేసిన పిటిష‌న్ ఇప్ప‌ట్లో విచార‌ణ‌కు రాద‌ని వైసీపీ ప్ర‌భుత్వ ఉద్దేశంగా ఉంద‌ని అంటున్నారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఇంకా ఏడాదిన్న‌ర స‌మ‌యం మాత్ర‌మే ఉంది. అప్ప‌టిదాకా మూడు రాజ‌ధానుల అంశాన్ని ప్ర‌జ‌ల్లో తీవ్రంగా న‌లిగేలా చేసి.. ప్రాంతాల మ‌ధ్య విభేదాల‌ను రాజేసి ఎన్నిక‌ల్లో ప్ర‌యోజ‌నం పొంద‌డ‌మే వైసీపీ ఉద్దేశ‌మ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. ఆ పార్టీ నేత‌ల మాట‌లు, చేష్ట‌ల‌న్నీ ప్ర‌స్తుతం ఇదే తీరులో ఉన్నాయ‌ని విశ్లేష‌కులు గుర్తు చేస్తున్నారు.

సుప్రీంకోర్టులో త‌మ‌కు అనుకూలంగా తీర్పు వ‌స్తుంద‌ని వైసీపీ పెద్ద‌లు భావిస్తున్నార‌ని అంటున్నారు. హైకోర్టులోనే దాదాపు మూడేళ్ల‌కు కానీ రాజ‌ధాని వ్య‌వ‌హారం తేల‌లేదు. ఇక సుప్రీంకోర్టులో ఇప్ప‌ట్లో తేలేలా లేదు. ఇప్ప‌టికిప్పుడు అత్య‌వ‌స‌ర విచార‌ణ కూడా సుప్రీంకోర్టు జ‌రిపే అవ‌కాశం లేద‌ని చెబుతున్నారు. అయితే హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇస్తుంద‌నే ఆశ‌తో వైసీపీ ప్ర‌భుత్వం ఉంద‌ని పేర్కొంటున్నారు. స్టే (మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు) ల‌భించినా మూడు రాజ‌ధానుల‌పై అడుగు ముందుకేయొచ్చ‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం భావిస్తోంద‌ని అంటున్నారు.

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాలు మ‌రో మూడు రోజులు అంటే సెప్టెంబ‌ర్ 19, 20, 21 తేదీల వ‌ర‌కు జ‌ర‌గ‌నున్నాయి. మూడు రాజ‌ధానుల‌కు అనుకూలంగా మ‌ళ్లీ బిల్లు పెట్టే ఉద్దేశం ప్ర‌భుత్వానికి లేద‌ని తేలిపోయింది. ఎందుకంటే ఇదే విష‌యంపై ఇప్ప‌టికే సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేసింది అని గుర్తు చేస్తున్నారు. ఒకవేళ వైసీపీ ఆశిస్తున్న‌ట్టు సుప్రీంకోర్టు స్టే ఇవ్వ‌క‌పోతే ఆ పార్టీ, ప్ర‌భుత్వం వ్యూహం ఏమిటో తేలాల్సి ఉంద‌ని అంటున్నారు.

మ‌రోవైపు టీడీపీ కూడా చాలా భ‌రోసాతో ఉంది. సుప్రీంకోర్టులోనూ జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ఎదురుదెబ్బ త‌ప్ప‌దని భావిస్తోంది. ఏకైక రాజధానిగా అమ‌రావ‌తికే సుప్రీంకోర్టు తీర్పు ఇస్తుంద‌ని టీడీపీ విశ్వసిస్తోంది. అందుకే ఆ పార్టీ చాలా విశ్వాసంతో ఉంద‌ని అంటున్నారు. ద‌మ్ముంటే జ‌గ‌న్ ప్ర‌భుత్వం అసెంబ్లీని రద్దు చేసి.. మూడు రాజ‌ధానుల‌ను కోరుతూ రిఫ‌రెండం పెట్టాల‌ని టీడీపీ నేత‌లు సవాళ్లు విస‌ర‌డం ఇందులో భాగ‌మేనంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News