2019లో గుంటూరు జిల్లాలో వైసీపీ పాగా!

Update: 2018-06-12 11:15 GMT
2019 సాధార‌ణ ఎన్నిక‌ల‌కు మ‌రో 8 నెల‌లు మాత్ర‌మే గ‌డువుండ‌డంతో ఏపీలో ఎన్నిక‌ల వేడి రాజుకుంది. వైసీపీ అధినేత‌ - ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ పాద యాత్ర‌కు అపూర్వ జ‌నాద‌ర‌ణ ల‌భిస్తోన్న నేప‌థ్యంలో టీడీపీ నేత‌ల గుండెల్లో రైళ్లు ప‌రిగెడుతున్నాయి. ఏపీలోని 13 జిల్లాల్లో వైసీపీకి విప‌రీత‌మైన ప్ర‌జాద‌ర‌ణ రావ‌డంతో టీడీపీ నేత‌ల‌కు ఓట‌మి భ‌యం ప‌ట్టుకుంది. ముఖ్యంగా రాజ‌ధానికి కూత వేటు దూరంలో ఉన్న గుంటూరు జిల్లాలో ఎన్నిక‌ల పోరు ర‌స‌వ‌త్త‌రంగా మారింది. జిల్లాలో ఉన్న‌ 17 అసెంబ్లీ సీట్లలో మెజారిటీ వైసీపీకే వ‌చ్చే అవ‌కాశాలున్నాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కుల అంచ‌నా. ఇక జిల్లాలోని గుంటూరు - న‌ర‌సారావుపేట‌ - బాప‌ట్ల మూడు ఎంపీ సీట్లూ కూడా వైసీపీ అభ్య‌ర్థుల‌కే ద‌క్క‌బోతున్నాయ‌ని  అంచనా వేస్తున్నారు. జ‌గ‌న్ జ‌న ప్ర‌భంజ‌నంలో టీడీపీకి అతి త‌క్కువ సీట్లు రావ‌చ్చిన  రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై అగ్రిగోల్డ వ్య‌వ‌హారంలో తీవ్ర ఆరోప‌ణ‌లు వ‌చ్చిన నేప‌థ్యంలో చిల‌క‌లూరిపేట‌లో ఆయ‌న విజ‌యం క‌ష్ట‌మేన‌ని అంచ‌నా. ఇక్క‌డి వైసీపీ అభ్య‌ర్థి మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ కు ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ఉండ‌డంతో ఆయ‌న గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. వినుకొండలో జివి ఆంజ‌నేయులుకు గ‌ట్టిపోటీ త‌ప్ప‌దు. గుర‌జాల నియోజ‌క‌వ‌ర్గంలో స్థానిక ఎమ్మెల్యే య‌ర‌ప‌తినేనిపై మాజీ మంత్రి కాసు కృష్ణా రెడ్డి త‌న‌యుడు కాసు మ‌హేష్ రెడ్డి బ‌రిలోకి దిగ‌బోతున్నారు. యువ‌నేత కాసు మ‌హేష్‌ రెడ్డి నియోజ‌వ‌ర్గ ప‌ర్య‌ట‌న‌ల్లో జ‌నాల‌తో చొచ్చుకు పోతూ వారిలో ఒక‌రిగా క‌లిసిపోతున్నారు. పొన్నూరులో ధూళిపాళ్ల న‌రేంద్రకు వైసీపీ అభ్యర్థి రావి వెంక‌ట‌ర‌మ‌ణ నుంచి గ‌ట్టి పోటీ త‌ప్పదు. తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రవ‌ణ్‌ కుమార్ పై స్థానికుల్లో తీవ్ర వ్య‌తిరేక‌త ఉండ‌డం మైన‌స్. ఇక ప్రత్తిపాడు సిట్టింగ్ ఎమ్మెల్యే - మాజీ మంత్రి రావెల కిషోర్‌ బాబు - ఆయ‌న త‌న‌యుడు వ్య‌వ‌హారంతో తీవ్ర వ్యతిరేక‌తను ఎదుర్కొంటున్నారు. పెద‌కూర‌పాడు ఎమ్మెల్యే కొమ్మాల‌పాటి శ్రీథ‌ర్ బాబు కు వైసీపీ స‌మ‌న్వయ‌క‌ర్త కావ‌టి మ‌నోహ‌ర్ నాయుడు పోటీ ఇవ్వ‌నున్నారు. వేమూరులో మంత్రి న‌క్కా ఆనంద్‌ బాబుకు ఓ సామాజిక‌వ‌ర్గం నుంచి  వ్యతిరేక‌త ఉండ‌డం ప్ర‌తికూలం. ఇక‌ తెనాలిలో మాజీ మంత్రి ఆల‌పాటి రాజాపై క‌బ్జాలు, సెటిల్‌మెంట్ల ఆరోప‌ణ‌లుండ‌డంతో వైసీపీ అభ్య‌ర్థి అన్నాబ‌త్తుని శివ‌కుమార్ కు సానుకూల‌త ఉంది. బాప‌ట్లలో కోన ర‌ఘుప‌తికి మంచి పేరుంది. గ‌త ఎన్నిక‌ల్లో స్వ‌ల్ప ఓట్ల‌తో ఓట‌మిపాలైన ర‌ఘుప‌తి ఈ సారి విజ‌య ఢంకా మోగిస్తార‌ని అంచ‌నా. రేప‌ల్లెలో సిట్టింగ్ ఎమ్మెల్యే అన‌గాని స‌త్యప్రసాద్ కు  అంబ‌టి రాంబాబు గ‌ట్టిపోటీ ఇవ్వ‌బోతున్నారు.

మంగ‌ళ‌గిరిలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డి గెలుపు న‌ల్లేరుపై న‌డ‌కే. ఇక మాచ‌ర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డికి నియోజ‌క‌వ‌ర్గంలో మంచి ప‌ట్టుంది. ఆయ‌న‌ను ఢీకొట్టే బ‌ల‌మైన టీడీపీ అభ్య‌ర్థి ఇక్క‌డ లేరు. న‌ర‌సారావుపేట‌ - స‌త్తెన‌ప‌ల్లి - గుంటూరు తూర్పు సీట్లలో కూడా వైసీపీకి తిరుగు లేదు. న‌ర‌సారావుపేట‌లో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌ రెడ్డికి మంచి పేరుంది. దీంతో, ఆ సీటు వైసీపీదే. స‌త్తెన‌ప‌ల్లిలో టీడీపీ సిట్టింగ్ స్పీక‌ర్ కోడెల‌ - ఆయ‌న కుమారుడిపై భూదందాలు - సెటిల్మెంట్లు వంటి ప‌లు ఆరోప‌ణ‌లున్నాయి. దీంతో, అక్క‌డ వైసీపీదే గెలుపని అంచ‌నా. ఇక‌, గుంటూరు తూర్పులో ముస్తఫాకు వ్యక్తిగ‌తంగా ఉన్న ఇమేజ్ ఆయ‌న‌ను మ‌రోసారి గెలిపించే అవ‌కాశ‌ముంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.
Tags:    

Similar News