కొత్తపల్లి సుబ్బారాయుడుపై వైఎస్సార్సీపీ సస్పెన్షన్ వేటు!

Update: 2022-06-02 03:30 GMT
పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి, కాపు నేత కొత్తపల్లి సుబ్బారాయుడిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ ప్రకటించింది. ‘పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నామని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం బుధవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో, పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

మే 31 మీడియాతో మాట్లాడిన సుబ్బారాయుడు.. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో నర్సాపురం నుంచి పోటీ చేస్తానని తేల్చి చెప్పారు. ఏ పార్టీ తరపున పోటీ చేస్తానన్న విషయంలో మాత్రం స్పష్టత లేదన్నారు. స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలో ఉంటానని తెలిపారు. నియోజ‌క‌వ‌ర్గంలో త‌న‌కు మంచి ప‌ట్టు ఉంద‌ని.. అన్ని కులాల్లో త‌న‌కు ప‌డే ఓట్లు ఉన్నాయ‌ని చెప్పుకొచ్చారు.. నర్సాపురంలో గెలుపు తనదేనన్నారు. గతంలో ప్ర‌భుత్వంపై వ్య‌తిరేకత ఉన్న స‌మ‌యంలోనూ నర్సాపురంంలో సొంతగా గెలిచానన్నారు. ఈ వ్యాఖ్యలపై మండిపడ్డ వైఎస్సార్ సీపీ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.

కొంతకాలంగా నర్సాపురం నియోజకవర్గంలో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజుల మధ్య వర్గపోరు నడుస్తోంది. కొత్త జిల్లాల విషయంలో నర్సాపురంను జిల్లా కేంద్రం చేయడంలో ప్రసాదరాజు విఫలమయ్యారని కొత్తపల్లి విరుచుకుపడ్డారు. నిరసన కార్యక్రమాల్లోనూ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే ముదునూరి తీరుపై ఆగ్రహంతో తన చెప్పుతో తనను తాను కొట్టుకున్నారు. అప్పుడే వైఎస్సార్‌సీపీ అధిష్టానం సీరియస్ అయ్యింది. ఇటీవల సుబ్బారాయుడికి ప్రభుత్వం గన్‌మెన్లను తొలగించింది. ఇలా వరుస పరిణామాల తర్వాత ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.

నర్సాపురం స్థానం నుంచి 1983 నుంచి 2014 వ‌ర‌కు పోటీ చేసిన విషయాన్ని సుబ్బారాయుడు గుర్తు చేశారు. ఒక్క 2019 ఎన్నికల్లో మాత్ర‌మే తాను పోటీ చేయ‌లేద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. అలాగే జిల్లా కేంద్రం కోసం జరిగిన ఉద్యమంలో తనపై ఏ1గా కేసు నమోదు చేయడంపై సుబ్బారాయుడు స్పందించారు. 41 నోటీసు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని.. ఇటీవల గన్‌మెన్లను తొలగించడంపై స్పందించేందుకు నిరాకరించారు.

కాగా కొత్తపల్లి సుబ్బారాయుడు నర్సాపురం నియోజకవర్గం నుంచి 1989 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత వరుసగా నాలుగుసార్లు 1994, 1999, 2004ల్లోనూ అక్కడ నుంచే విజయం సాధించారు. 1999లో చంద్రబాబు కేబినెట్‌లో విద్యుత్ శాఖ మంత్రిగా పని చేశారు. 2009 ఎన్నికలకు ముందు ప్రముఖ నటుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేయడంతో ఆ పార్టీలో చేరి నర్సాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అక్కడ నుంచి 2009లో గెలిచిన ముదునూరి ప్రసాదరాజు వైఎస్సార్ సీపీ లో చేరడంతో  జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీచేసిన సుబ్బారాయుడు గెలిచారు.

ఆ తర్వాత రాష్ట్ర విభజన, మారిన రాజకీయ సమీకరణలతో 2014 ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీలో చేరి నర్సాపురం నుంచి బరిలోకి దిగి ఓడిపోయారు. మళ్లీ తిరిగి టీడీపీలో చేరగా.. కాపు కార్పొరేషన్ ఛైర్మన్ పదవి దక్కింది. మళ్లీ ఆ పదవికి రాజీనామా చేసి 2019 ఎన్నికలకు ముందు జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకున్నారు. అప్పటి నుంచి ఆ పాార్టీలోనే కొనసాగుతుండగా.. ఇప్పుడు సస్పెండ్ చేశారు.
Tags:    

Similar News