ఐటీ దాడులపై ఎట్టకేలకు స్పందించిన వైసీపీ ముఖ్య నేత!

Update: 2022-12-08 04:55 GMT
తన ఇంటిలో రెండు రోజులుగా జరిగిన ఐటీ దాడులపై విజయవాడ తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్‌చార్జ్, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ కుమారుడు దేవినేని అవినాష్‌ స్పందించారు. తాను ఏ అక్రమార్జనకు పాల్పడలేదని సాధారణ తనిఖీల్లో భాగంగానే ఐటీ అధికారులు సోదాలు చేశారని తెలిపారు.

హైదరాబాద్‌కు చెందిన ఒక ల్యాండ్‌ డెవలప్‌మెంట్‌ ఒప్పందంపై ఐటీ అధికారులు ప్రశ్నించారని తెలిపారు. తనకు హైదరాబాద్‌లో ఒక స్థలం ఉందని.. దాన్ని అబివృద్ధి చేయాలని బిల్డర్‌కు ఇచ్చానన్నారు. ఇదంతా పారదర్శకంగా జరిగిందని చెప్పారు.

తమకు ఎలాంటి వ్యాపారాలు లేవని దేవినేని అవినాష్‌ వెల్లడించారు. ప్రజల అభిమానమే తాము సంపాదించిన ఆస్తి అని పేర్కొన్నారు. సాధారణ తనిఖీల్లో భాగంగా జరిగిన ఈ సోదాలను కొందరు భూతద్దంలో చూపిస్తున్నారని దేవినేని అవినాష్‌ తప్పుబట్టారు.

దాదాపు రెండు రోజులపాటు ఐటీ అధికారులు రెండు తెలుగు రాష్ట్రాల్లో పలువురు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, బిల్డర్లు ఇళ్లలో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌ల్లో స్థిరాస్తి వ్యాపారి ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. వంశీరామ్‌ బిల్డర్స్‌ సుబ్బారెడ్డి బావమరిది, డైరెక్టర్‌ జనార్ధన్‌రెడ్డి ఇల్లు, కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్, విజయవాడతోపాటు నెల్లూరులోనూ ఆ సంస్థకు చెందిన సీఈవో, డైరెక్టర్లు, పెట్టుబడిదారుల కార్యాలయాలు, ఇళ్లలో సోదాలు జరిగాయి. ఈ తనిఖీల్లో 20కిపైగా ఐటీ బృందాలు పాల్గొన్నాయి. మొత్తం రెండు రాష్ట్రాల్లో కలిపి 36 చోట్ల ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు.

బిల్డర్స్‌పై తనిఖీల్లో భాగంగానే వైసీపీ నేత దేవినేని అవినాష్‌ ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో వైసీపీ నేత దేవినేని అవినాష్‌కు చెందిన స్థలం డెవలప్‌మెంట్‌ కోసం వంశీరామ్‌ బిల్డర్స్‌ తీసుకుంది. ఒప్పందంలో భాగంగా జరిగిన లావాదేవీలపై ఐటీ అధికారులు ఆరా తీసినట్టు వార్తలు వచ్చాయి.

మాజీ మంత్రి దేవినేని నెహ్రూ వారసుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించిన దేవినేని అవినాష్‌ 2019 ఎన్నికల్లో గుడివాడ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కొద్ది రోజులకే వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం విజయవాడ తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News