వైఎస్సార్సీపీ వర్సెస్ టీడీపీ.. రచ్చ మొదలైనట్టే!

Update: 2019-06-12 10:54 GMT
ఫలితాలు వచ్చి సరిగ్గా నెల కూడా గడవలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడి పక్షం రోజులు అవుతున్నట్టుగా ఉంది. ఇంతలోనే ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్యన మాటల యుద్ధం మొదలైంది. తాము ఆరు నెలల వరకూ ప్రభుత్వాన్ని విమర్శించేది ఉండదని ఇటీవలే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అయితే ఆ వెంటనే ఆయన గొంతు సవరించుకున్నారు. ఏపీలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల  మీద దాడులు జరుగుతున్నాయని, ఈ ప్రభుత్వం విషయంలో ఉపేక్షించేది లేదని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.

అలాగే తాము గతంలో ఇచ్చిన హామీలను జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేయాలని చంద్రబాబు నాయుడు ఒక ఉచిత సలహా ఇచ్చారు. రుణమాఫీ చేయాలని, పసుపు కుంకుమ డబ్బులు  ఇవ్వాలని చంద్రబాబు సలహాలు ఇచ్చారు.

ఈ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  రియాక్ట్ అయ్యింది. ఆ పార్టీ నేత, మండలిలో అధికార పక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చంద్రబాబు తీరును విమర్శించారు. చంద్రబాబు నాయుడు ఒక మాజీ సీఎంగా విజ్ఞతతో వ్యవహరించాలని ఉమ్మారెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు అలా హితబోధ చేయడం, ఆయన విషయంలో వ్యంగ్యంగా మాట్లాడటంతో తెలుగుదేశం పార్టీ రియాక్ట్ అయ్యింది.

ఆ పార్టీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ప్రెస్ నోట్ తో స్పందించారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మీద డొక్కా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన తీరును విమర్శించారు. చంద్రబాబు విషయంలో మాట్లాడిన తీరు సరిగా లేదన్నారు. తాము ఇచ్చిన హామీలను అమలు చేయమని సూచించడంలో తప్పేమిటని ప్రశ్నించారు. తమ పార్టీ కార్యకర్తల మీద దాడులు జరుగుతూ ఉన్నాయన్నారు. తమ పార్టీ నేతల విగ్రహాలను కూల్చేస్తున్నారని వాపోయారు.

మొత్తానికి ఎన్నికల ఫలితాలు వచ్చి సరిగ్గా నెల అయినా  గడవకముందే.. అప్పుడే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ల మధ్యన మాటల యుద్దం మొదలైందని, ఇది క్రమక్రమంగా రాజుకునే అవకాశం ఉందని స్పష్టం అవుతూ ఉందని పరిశీలకులు అంటున్నారు.
Tags:    

Similar News