వైఎస్సార్ ఈబీసీ నేస్తం.. 589 కోట్లు విడుద‌ల చేసిన జ‌గ‌న్‌!

Update: 2022-01-25 11:30 GMT
ఏపీలో మ‌ర ప‌థ‌కానికి సీఎం జ‌గ‌న్ నిధులు పంచారు. వైఎస్సార్ ఈబీసీ నేస్తం పేరిట‌.. ఈ ప‌థ‌కానికి నిదులు విడుద‌ల చేశారు. తాడేపల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాయలంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి తాజాగా వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రారంభించారు. అగ్రవర్ణాలకు చెందిన పేద మహిళలకు ఈబీసీ నేస్తం పేరుతో ఆర్థిక సాయం అందిస్తారు. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు ఉన్న వారికి ఈ పథకం వర్తిస్తుంది.

మొత్తం 3 లక్షల 92 వేల 674 మంది పేద మహిళలకు రూ.589 కోట్లను అందజేశారు. ఒక్కో మహిళకు ఏటా రూ.15,000 చొప్పున మూడేళ్లలో మొత్తం 45,000 ఆర్థికసాయం అందిస్తారు. ఎన్నికల సమయంలో వాగ్ధానం ఇవ్వకపోయినా.. ఈ పథకాన్ని తీసుకొచ్చామని సీఎం జగన్ తెలిపారు. అగ్రవర్ణ పేదలకు మంచి జరగాలని పథకానికి శ్రీకారం చుట్టామని చెప్పారు.

3.93 లక్షల మంది మహిళల ఖాతాల్లో రూ.589 కోట్లు జమ అవనున్నాయని ఆయన వెల్లడించారు. ఈబీసీ నేస్తం పథకం మేనిఫెస్టోలో పెట్టకపోయినా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. అగ్రవర్ణ పేద మహిళల కు మెరుగైన జీవనోపాధి, ఆర్థిక సాధికారతే లక్ష్యంగా అమలు చేస్తున్నామని చెప్పారు. రాజ్యాంగ స్ఫూర్తిని అనుసరిస్తూ అడుగులు వేస్తున్నామని ఆయన తెలిపారు.

అగ్రవర్ణాల్లో కూడా పేదలు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఈబీసీ నేస్తం ద్వారా అగ్రవర్ణ పేద మహిళలకు ఆర్థిక సాయం అందిస్తామని వెల్లడించారు. వైఎస్ఆర్ జగనన్న కాలనీల పేరుతో 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామని తెలిపారు. ఈబీసీ నేస్తంతో మహిళలకు ఆర్థిక భరోసా లభించనుంది. స్వయం శక్తితో వారు ముందడుగు వేయనున్నారని ముఖ్య‌మంత్రి ఈ సంద‌ర్భంగా వివ‌రించారు.

అయితే.. ప్ర‌స్తుతం ఉద్యోగులు స‌మ్మె చేస్తున్న నేప‌థ్యంలో వారిని సంతృప్తి ప‌రిస్తే బాగుంటుంద‌నే వాద‌న వినిపించ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News