మరో స్టార్‌ క్రికెటర్ బొమ్మ పడబోతుంది

Update: 2021-10-07 05:37 GMT
ఈమద్య కాలంలో ఇండియన్ వెండి తెరపై బయోపిక్ లకు మంచి గిరాకీ ఉంది. వివిధ రంగాలకు సంబంధించిన ప్రముఖుల గురించి సినిమాలు తీసి సక్సెస్ లు దక్కించుకున్న వారు చాలా మంది ఉన్నారు. నిజ జీవిత చరిత్రకు కాస్త మసాలా దట్టించి.. కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ఒక పక్కా కమర్షియల్‌ మూవీగా అంటే ఎంఎస్ ధోనీ తరహాలో రూపొందిస్తే ఖచ్చితంగా కాసుల వర్షం కురుస్తుంది. అందుకే ఆ దారిలో చాలా బయోపిక్ లు వచ్చాయి.. వస్తున్నాయి. కపిల్‌ దేవ్‌ బయోపిక్ 83 ని విడుదలకు సిద్దం చేశారు. మరి కొంత మంది క్రీడాకుల బయోపిక్స్ కూడా రెడీ అవుతున్నాయి. లేడీ క్రికెటర్స్ ను కూడా ఫిల్మ్‌ మేకర్స్ వదిలి పెటట్డం లేదు. అన్ని రంగాలకు సంబంధించిన బయోపిక్ లు వస్తున్న ఈ సమయంలో మరో క్రికెటర్‌ బయోపిక్ ను రూపొందించేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మాజీ స్టార్‌ క్రికెటర్‌ యువరాజ్ సింగ్‌ బయోపిక్‌ ను రూపొందించేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్‌ కరణ్‌ జోహార్ ఈ సినిమాను స్వయంగా స్వీయ దర్శకత్వంలో నిర్మించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. యూవీ ఆటలో పులిలా గాండ్రించిన సందర్బాలు చాలా ఉన్నాయి. ఇక ఆయన జీవితంలో చాలా పోరాటాలు చేశాడు. క్యాన్సర్‌ తో ఆయన పోరాడి గెలిచిన తీరు ఎంతో మందికి ఆదర్శం. అద్బుతమైన ఆయన ప్రతిభ అన్నట్లుగా ఆయన ఆటతో మళ్లీ పుంజుకున్నాడు. వ్యక్తిగత జీవితంలో మరియు క్రీడా జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలను ఎదుర్కొన్న యూవీ ఖచ్చితంగా కొన్ని కోట్ల మందికి ఆదర్శప్రాయుడు అనడంలో సందేహం లేదు.

కొంత మంది క్రీడాకారుల జీవితాల్లో ఎత్తు పల్లాలు ఉండవు. వారి సినిమా తీస్తే డాక్యుమెంటరీ తీసినట్లుగా అనిపిస్తుంది. కాని యూవీ వంటి స్టార్‌ క్రికెటర్  జీవితాన్ని తీస్తే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా తరహాలో వస్తుందనే నమ్మకంను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది.. ఇప్పటికి అయినా యూవీ సినిమాను తీసేందుకు ముందుకు వచ్చినందుకు కృతజ్ఞతలు అంటూ యూవీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో యూవీ అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని చెబుతున్నారు. యూవీ పాత్రను ఎవరు చేస్తారు అనే ఆసక్తి అందరిలో కలుగుతోంది. ఈ సమయంలో సిద్దార్థ్‌ చతుర్వేది అనే కొత్త కుర్రాడిని పరిశీలిస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి. యూవీ పోలికలు దగ్గరగా ఉండటంతో పాటు అతడు చాలా మంచి క్రీడాకారుడు అని కూడా అంటున్నారు. పూర్తి వివరాలు త్వరలో వెళ్లడయ్యే అవకాశం ఉంది.
Tags:    

Similar News