మరో వివాదంలో యువీ...కేసు నమోదు

Update: 2020-06-05 02:30 GMT
టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ వైఖరి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర లేదు. మైదానం లోపల, వెలుపల దూకుడుగా ఉండే యువీ...తన వైఖరితో పలు వివాదాల్లో చిక్కుకున్నాడు. ధోనీతో వివాదం మొదలు....రిటైర్మెంట్ సమయంలో బీసీసీఐపై చేసిన వ్యాఖ్యల వరకు యువీ తన దూకుడు వైఖరితో వార్తల్లో నిలిచాడు. ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన యువీ.... తాజాగా, ఓ కులాన్ని కించపరిచిన వివాదంలో చిక్కుకున్నాడు. బాంగి కులాన్ని ఉద్దేశించి యువీ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాంగి కులాన్ని అవమానించేలా యువీ వ్యాఖ్యానించాడంటూ కేసు నమోదైంది. టీమిండియా క్రికెటర్లు యజ్వేంద్ర చాహల్, కుల్‌దీప్ యాదవ్‌ ల కులాలను ఉద్దేశించి యువీ చేసిన వ్యాఖ్యలు వివాదానికి కేంద్ర బిందువయ్యాయి.

2 రోజుల క్రితం టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మతో యువరాజ్ లైవ్‌లో మాట్లాడాడు. చాహల్‌పై బాంగి (కులాన్ని ఉద్దేశిస్తూ) అనే పదాన్ని యువీ ప్రయోగించాడు. యువీ చేసిన సరదా కామెంట్ రోహిత్ కు నవ్వు తెప్పించింది. అయితే, ఈ సరదా సంభాషణ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యువీపై బాంగి కులానికి సంబంధించిన వ్యక్తులతో పాటు పలువురు విమర్శలు గుప్పించారు. తన వ్యాఖ్యలకు యువీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆ కులస్థులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే న్యాయవాది, దళిత హక్కుల కార్యకర్త రజత్ కల్సాన్ హన్సీలో యువరాజ్‌పై ఫిర్యాదు చేశారు. యువరాజ్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. యువీ మాట్లాడే సమయంలో రోహిత్ కనీసం అసంతృప్తిని వ్యక్తం చేయలేదని కల్సాన్ అన్నారు. ఈ కేసు విచారణను డీఎస్‌పీకి అప్పగించామని హన్సి ఎస్‌పీ అన్నారు. యువీ తప్పు చేశాడని తెలిస్తే తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. యువీ సరదాగా చేసిన వ్యాఖ్యలు అతడిని ఇరకాటంలోకి నెట్టాయని, సెలబ్రిటీలు మాట్లాడేటపుడు జాగ్రత్తగా ఉండాలని నెటిజన్లు హితవు పలకుతున్నారు.
Tags:    

Similar News