బాబు నాగ‌పూర్ టూర్ వెనుక భ‌లే స్కెచ్చుందే

Update: 2017-10-18 17:04 GMT
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు నిజాయ‌తీపై మ‌రో మ‌ర‌క ప‌డింది. అందులోనూ ఆయ‌న ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న పోల‌వ‌రం ప్రాజెక్టు సాక్షిగా ఆరోప‌ణ‌లు ముసురుతున్నాయి. పోల‌వ‌రం విష‌యంలో కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ ప‌లు వ్యాఖ్య‌లు చేయ‌డం...దీంతో సీఎం చంద్ర‌బాబు నాయుడు ప్ర‌త్యేకంగా నాగపూర్ వెళ్లి గ‌డ్క‌రీని క‌లిసిన సంగతి తెలిసిందే. ఈ ప‌రిణామం వెనుక ప‌లు అనుమానాలు ఉన్నాయ‌ని విప‌క్ష వైసీపీ ఆరోపిస్తోంది. పోలవరం ప్రాజెక్ట్ ను అడ్డుపెట్టుకొని టీడీపీ సర్కార్ అవినీతికి పాల్పడుతోందని వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో వైవీ సుబ్బారెడ్డి మాట్లాడారు. కాంట్రాక్టర్ ను మార్చడం కోసం ఓ ముఖ్యమంత్రి కేంద్రమంత్రి దగ్గరికి స్పెషల్ ఫ్లైట్ లో వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని వైవీ ప్రశ్నించారు.

కాంట్రాక్టర్ ను తొలగించే అధికారం మీకు ఉన్నప్పుడు ఆ పని ఎందుకు చేయడం లేదని బాబును ఎంపీ వైవీ నిలదీశారు. అలా చేస్తే తన ఎంపీ అయిన  కాంట్రాక్టర్ బ్లాక్ లిస్ట్ అవుతాడనే, బాబు ఆయన్ను కాపాడేందుకు డ్రామా ఆడుతున్నారని వైవీ ఆరోపించారు. ప్రాజెక్ట్ అంచనాలు పెంచితే ఇంకా ముడుపులు కొట్టేయోచ్చన్న ఆలోచనలో బాబు ఉన్నారన్నారు. కేంద్రం చేతే కాంట్రాక్టర్ ను తొలగించి మళ్లీ తన మనుషులకు కాంట్రాక్ట్ ఇప్పించుకోవాలని బాబు డ్రామా ఆడుతున్నారన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ను చంద్రబాబు తన అవినీతికి పాడి ఆవుగా వాడుకుంటున్నారని విమర్శించారు. కాంట్రాక్టర్ ఒకరైతే అక్కడ పనులు చేసేవాళ్లు మరొకరని ప్రభుత్వ పనితీరును తప్పుబట్టారు. పోలవరం నేషనల్ ప్రాజెక్టా లేక నేషనల్ స్కామా..? అని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని, పోలవరాన్ని కేంద్రమే నిర్మించాలని డిమాండ్ చేశారు.

పోలవరం ప్రాజెక్ట్ ను అడ్డుపెట్టుకొని బాబు దోపిడీ కార్యక్రమం చేస్తున్నారు కాబట్టే ఇంకా పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదని ఎంపీ వైవీ అనుమానం వ్య‌క్తం చేశారు.  2018కి పోలవరం పూర్తి చేస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పాయని,  కానీ దాని కనుగుణంగా అక్కడ పనులు జరగడం లేదన్నారు. పోలవరాన్ని కేంద్రం నిర్మిస్తే ఈ గొడవే ఉండదన్నారు. పోలవరం వ్యయం ఎంతో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంటరీ కమిటీ పోలవరం సందర్శన అని అన్నిపేపర్లో వేయించి మళ్లీ కాంట్రాక్టర్ ను ఎందుకు మార్చాలనుకుంటున్నారని బాబును ప్రశ్నించారు. ``20 రోజుల కింద గడ్కరీ రివ్యూ చేశారు. కాంట్రాక్టర్లను మారిస్తే పోలవరం వ్యయం పెరిగే అవకాశం ఉందని, పోలవరాన్ని కరప్షన్ ఫ్రీ ప్రాజెక్ట్ గానిర్మించాలని గడ్కరీ చెప్పారు. ఆయన అలా అన్నారంటే....రాష్ట్ర ప్రభుత్వంపై పోలవరం పట్ల కేంద్రానికి ఎలాంటి అవగాహన ఉందో అర్థమవుతోంది`` అని ఎంపీ వైవీ అన్నారు. ఇప్పటికైనా పోలవరం ప్రాజెక్ట్ ను కేంద్రమే నిర్మించే కార్యక్రమం చేస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నారు.  కేంద్రం దీనిపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలని, సమగ్ర దర్యాప్తు జరిపించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ ను అవినీతి సొమ్ముగా చేసుకునేందుకు వాడుకోవాలని చూస్తోందని,  దీనికి కేంద్రప్రభుత్వం అడ్డుకట్ట వేయాలన్నారు. 2018కి పోలవరం పూర్తయ్యేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని, ఈ ప్రాజెక్టుపై ఆధార‌ప‌డికి నీటిని అందించాల‌ని కోరారు.
Tags:    

Similar News