రాజీనామాలంటూనే..ఎన్డీఏలో ఉండ‌టం ఏంటి బాబు?

Update: 2018-03-08 05:08 GMT
టీడీపీ - బీజేపీ నాలుగేళ్ల మిత్రబంధానికి బ్రేక్‌లు పడ్డాయి. ఏపీకి సాయంపై కేంద్రం వైఖరిని తేటతెల్లం చేసిన వెంటనే.. అమరావతిలో పరిణమాలు శరవేగంగా మారిపోయాయి. జైట్లీ స్పందనపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు.  అప్పటికప్పుడు అందుబాటులో ఉన్న మంత్రులను పిలిచి మాట్లాడారు.  ఢిల్లీలో ఉన్న ఎంపీలతోనూ టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా అభిప్రాయాలు తెలుసుకున్నారు. ప్రత్యేకహోదా ఇవ్వబోమని ఖరాఖండీగా చెప్పిన తర్వాత కేంద్రంలో కొనసాగడం అనవసరమన్న అభిప్రాయాన్ని ఎంపీలు వ్యక్తం చేశారు. నిర్ణయం తీసుకోవాడానికి ఇదే సరైన సమయమని సూచించారు.  ఇద్దరు కేంద్రమంత్రులతోనూ చంద్రబాబు మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత మీడియా సమావేశంలో కేంద్ర కేబినెట్‌ నుంచి తమ పార్టీకి చెందిన ఇద్దరు మంత్రులు వైదొలుగుతారని చంద్రబాబు ప్రకటించారు. ఇవాళ రాజీనామాలు సమర్పించనున్నట్టు తెలిపారు.

అయితే ఈ ప‌రిణామంపై విప‌క్షాలు భిన్న‌మైన రీతిలో స్పందించారు. ప్రజావ్యతిరేకతను గమనించే బీజేపీ - టీడీపీలు కొత్త డ్రామాకు తెరలేపాయని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తీవ్రంగా విమర్శించారు. కేంద్ర కేబినెట్ నుంచి టీడీపీ మంత్రులు రాజీనామా చేయడం ఓ డ్రామా అని మండిప‌డ్డారు. రాజీనామాలంటూనే... ఎన్డీయేలో కొనసాగడం చంద్రబాబు ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమన్నారు. వారి పదవులకోసం నాలుగేళ్ళుగా రాష్ర్ట ప్రయోజనాలను తాకట్టుపెట్టారని వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. ఇప్ప‌టికైనా చంద్ర‌బాబు రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం ప‌నిచేయాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు.

కాగా, చంద్ర‌బాబు నిర్ణ‌యాన్ని వామ‌ప‌క్ష నేత‌లు స్వాగ‌తించారు. కేంద్ర కేబినెట్‌ మంత్రి పదవులకు రాజీనామా చేయాలన్న టీడీపీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని సీపీఐ నేత నారాయణ అన్నారు. బీజేపీ మోసాన్ని చంద్రబాబు ఇప్పటికైనా గుర్తించినందుకు సంతోషంగా ఉందన్నారు..  చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో బీజేపీ ఆయనపై కక్షపూరితంగా.. వేధింపులకు పాల్పడే అవకాశం ఉందని.. అయినా భయపడకుండా పోరాడలని నారాయణ చెప్పారు.
Tags:    

Similar News