టీటీడీ బోర్డు రద్దుకు రంగం సిద్ధం.. చైర్మన్ పదవి ఆయనకా?

Update: 2019-06-02 08:02 GMT
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డును రద్దు చేయడానికి  ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. బోర్డు చైర్మన్ పదవికి  రాజీనామా చేయడానికి సుధాకర్ యాదవ్ సుముఖత చూపకపోవడంతో మొత్తంగా పాలకమండలిని రద్దు చేయడానికి ఏపీ ప్రభుత్వం రెడీ అవుతోందని  వార్తలు వస్తున్నాయి. కేవలం టీటీడీ బోర్డునే కాకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏర్పడిన ఆలయాల పాలక మండళ్లన్నింటినీ రద్దు చేయడానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టనుందట త్వరలోనే.

ఈ నేపథ్యంలో టీటీడీకి కొత్త చైర్మన్ పదవి కోసం కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. టీటీడీ బోర్డు పదవి విషయంలో ముందుగా భూమన కరుణాకర్ రెడ్డి పేరు వినిపించింది. గతంలో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భూమన చైర్మన్ గా వ్యవహరించారు. ఇప్పుడు మళ్లీ ఆయనకు ఆ పదవి దక్కవచ్చనే  ఊహాగానాలున్నాయి.

అయితే ఇప్పుడు సీఎం జగన్ బంధువు  వైవీ సుబ్బారెడ్డి కూడా రేసులోకి వచ్చారనే  మాట వినిపిస్తూ ఉంది. టీటీడీ చైర్మన్ పదవి కోసం వైవీ సుబ్బారెడ్డి గట్టిగానే  పట్టుపట్టారని - పార్టీ తరఫున ఇన్నేళ్లు క్రియాశీలకంగా పని చేసినందుకు వెంకటేశ్వరుడి సేవకు తనకు అవకాశం ఇవ్వాలని సుబ్బారెడ్డి కోరుతున్నట్టుగా తెలుస్తోంది.

ఇక మరి కొందరి పేర్లు కూడా టీటీడీ బోర్డు చైర్మన్ పదవి విషయంలో వినిపిస్తూ ఉన్నాయి. మోహన్ బాబు కూడా ఈ పదవిని ఆశిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఆసక్తిదాయకంగా మారింది.
Tags:    

Similar News