వైవీ దెబ్బ‌కు బాబు బ్యాచ్ దిగొచ్చిందిగా!

Update: 2017-08-08 06:16 GMT
టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు న‌వ్యాంధ్ర‌లో సాగిస్తున్న పాల‌న‌పై అటు ప్ర‌ధాన విప‌క్షం వైసీపీతో పాటువామ‌ప‌క్షాలు, ఆ పార్టీకి మిత్ర‌ప‌క్షంగా ఉన్న బీజేపీ కూడా ఎప్ప‌టిక‌ప్పుడు, ఎక్క‌డిక‌క్క‌డ ఆగ్ర‌హావేశాలు వ్య‌క్తం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. బాబు జ‌మానాలో రాష్ట్రంలో అభివృద్ధి బ‌దులు అవినీతి రాజ్య‌మేలుతోంద‌ని, స్వ‌యంగా సీఎం కార్యాల‌యం - చంద్ర‌బాబు కుమారుడు - మంత్రిగా ఉన్న నారా లోకేశ్ ల ప్ర‌మేయం మ‌రింత‌గా ఎక్కువైంద‌న్న విమర్శ‌లు ఇటీవ‌లి కాలంలో మ‌రింత‌గా పెరిగాయ‌నే వాద‌న వినిపిస్తోంది. అయితే విప‌క్షాల ఆందోళ‌న‌ల‌ను ఏమాత్రం ఖాత‌రు చేయ‌ని చంద్ర‌బాబు స‌ర్కారు... తన‌కు న‌చ్చిన విధంగానే ముందుకు సాగుతోంద‌న్న విమ‌ర్శ‌లు పెరుగుతున్నాయి. ఈ త‌ర‌హాలో సాగుతున్న చంద్ర‌బాబు పాల‌న‌కు నిద‌ర్శ‌నంగా ఇప్పుడు దేవ‌ర‌ప‌ల్లి ఘ‌ట‌న‌ను చెప్పుకోచ్చంటూ ప‌లు క‌థ‌నాలు వినిపిస్తున్నాయి.

అస‌లు దేవ‌ర‌ప‌ల్లి ఘ‌ట‌న ఏమిటి? అందులో చంద్రబాబు అండ్ బ్యాచ్ చేసిన నిర్వాకాలేమిటి?  దానికి వ్య‌తిరేకంగా వైసీపీ - ఇత‌ర పక్షాలు చేసిన పోరాటం ఏమిటి? ఈ పోరాటాల ఫ‌లితంగా చంద్ర‌బాబు స‌ర్కారు తీసుకున్న యూట‌ర్న్ ఏమిట‌న్న విష‌యానికి వ‌స్తే... ప్ర‌కాశం జిల్లా ప‌ర్చూరు మండ‌లం దేవ‌ర‌ప‌ల్లి గ్రామంలో మొన్నామ‌ధ్య  తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. గ్రామంలో ప్ర‌భుత్వం త‌వ్వేందుకు ఉద్దేశించిన చెరువును ద‌ళితులంతా క‌లిసి మూకుమ్మ‌డిగా అడ్డుకున్నారు. అయితే ప‌ర్చూరు ఎమ్మెల్యేగా ఉన్న టీడీపీ నేత సాంబ‌శివ‌రావు ఈ ఆందోళ‌న‌ల‌పై ఉక్కుపాదం మోపారు. పోలీసు బ‌ల‌గాల‌ను దింపి మ‌రీ పనులు ప్రారంభించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా ఎన్నాళ్లుగానో సాగు చేసుకుంటున్న భూములు ఈ చెరువు కార‌ణంగా మాయం కానున్నాయ‌న్న ఆందోళ‌న‌ల‌తో ద‌ళితులు పోలీసుల‌కు ఎదురుతిరిగారు.

ఈ క్ర‌మంలో వారు పోలీసు లాఠీ దెబ్బ‌లు కూడా తినాల్సి వ‌చ్చింది. అయినా గ్రామంలో ఇప్ప‌టికే రెండు చెరువులు ఉండ‌గా, మూడో చెరువు ఎందుక‌ని కూడా వారు ప్ర‌శ్నించారు. కేవ‌లం టీడీపీ నేత‌ల జేబులు నింపేందుకే మూడో చెరువును త‌వ్వుతున్నార‌ని, ఈ చెరువు కార‌ణంగా త‌మ జీవ‌నాధార‌మే పోతుంద‌ని కూడా ద‌ళితులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అయితే అధికార పార్టీ నేత‌ల ముందు ద‌ళితుల వాద‌న చెవిటోడి ముందు శంఖ‌మే అయ్యింద‌ని చెప్పాలి. అయితే జీవ‌నాధారం కోసం ద‌ళితులు కూడా పెద్ద ఉద్య‌మానికే తెర తీశారు. ఈ క్ర‌మంలో అదే జిల్లాకు చెందిన వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఈ విష‌యంపై ప్ర‌త్యేకంగా దృష్టి సారించారు. వివాదానికి అస‌లు కార‌ణం ప్ర‌భుత్వ ద‌మ‌న నీతేన‌ని గ్ర‌హించిన ఆయ‌న ఏకంగా విష‌యాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. మ‌రోవైపు గ్రామంలో ద‌ళితులు కొన‌సాగిస్తున్న ఆందోళ‌న‌ల‌కు వైసీపీ నేత‌లు మ‌ద్దతుగా నిలిచారు. వామ‌ప‌క్షాలు కూడా త‌మ వంతుగా ద‌ళితుల‌కు బాస‌ట‌గా నిలిచాయి. ప్ర‌జా సంఘాలు కూడా బ‌రిలోకి దిగాయి.

నెల రోజుల పాటు ఆందోళ‌న‌లు జ‌రిగిన త‌ర్వాత‌, జాతీయ ఎస్సీ - ఎస్టీ క‌మిష‌న్ నుంచి వాక‌బు వ‌చ్చిన త‌ర్వాత గానీ చంద్ర‌బాబు స‌ర్కారులో చ‌ల‌నం వ‌చ్చింద‌ని చెప్పాలి. అప్ప‌టికి గానీ మేల్కోని సీఎం హుటాహుటిన గ్రామంలో నెల‌కొన్న వివాదంపై మంత్రి న‌క్కా ఆనంద‌బాబు ఆధ్వ‌ర్యంలో క‌మిటీ వేశారు. ఈ కమిటీ గ్రామంలో ప‌ర్య‌టించి అస‌లు స‌మ‌స్య‌కు స్థానిక ఎమ్మెల్యే వైఖ‌రే కార‌ణ‌మ‌ని తేల్చారు. దీంతో ఎటూ తేల్చేకోలేని చంద్ర‌బాబు మ‌ళ్లీ న‌క్కా ఆనంద‌బాబునే దేవ‌ర‌ప‌ల్లికి పంపి... చెరువు కోసం స్వాధీనం చేసుకుంటున్న భూముల‌ను తిరిగి ద‌ళితుల‌కే ఇచ్చేస్తున్న‌ట్లుగా ప్ర‌క‌ట‌న ఇప్పించారు. అంటే వైవీ సుబ్బారెడ్డి దెబ్బ‌కు చంద్ర‌బాబు స‌ర్కారు దిగిరాక త‌ప్ప‌లేద‌న్న మాట. ఇక నిన్న దేవ‌ర‌ప‌ల్లిలో మాట్లాడిన న‌క్కా... త‌మ పార్టీ అధినేత చంద్ర‌బాబును ఆకాశానికెత్తేశారు. ద‌ళితుల అభివృద్ధి ప‌ట్ల చంద్ర‌బాబుకు చిత్త‌శుద్ధి ఉంద‌ని చెప్ప‌డానికి ఇదొక్క‌టే కార‌ణ‌మ‌ని కూడా న‌క్కా... అక్క‌డ చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఇదిలా ఉంటే... దేవ‌ర‌ప‌ల్లి చెరువు కోసం ప్ర‌భుత్వం కేటాయించిన నిధుల‌ను ఇప్ప‌టికే టీడీపీ నేత‌లు బొక్కేసిన‌ట్లుగా కూడా వార్త‌లు వ‌స్తున్నాయి.
Tags:    

Similar News