జగన్ చేతిని నరికేయటం ఏమిటి ‘తమ్ముడు’

Update: 2016-09-11 12:29 GMT
ఇప్పుడున్న దూకుడు రాజకీయాల్లో ఎవరు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారన్నది తెలీని పరిస్థితి. అయితే.. ఒకరు ఏదైనా అంటే.. అందుకు బదులుగా నేను రెండు అంటానంటూ రియాక్ట్ అవుతున్న ధోరణి ఆశ్చర్యకరంగా మారిందని చెప్పక తప్పదు. ఇదొక అంశమైతే.. కొంతమంది నేతలు చేసిన ఆవేశపూరిత వ్యాఖ్యల్లో ఒక వ్యాఖ్యను పూర్తిగా పరిగణలోకి తీసుకోకుండా.. ముక్కలుముక్కలుగా తీసుకోవటం.. దానికి స్పందించటం ఏ మాత్రం సరికాదు. తాజాగా తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలే నిదర్శనం.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ఘాటైన విమర్శలు చేయటం తెలిసిందే. చెప్పిన మాట చెప్పినట్లు అమలు చేయకపోతే గల్లా పట్టుకుంటామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకుంటే నిలదీస్తామన్న కోణంలో ‘గల్లా (కాలర్) పట్టుకోవటం’ వ్యాఖ్యను చూడాలి. ఒకవేళ.. ఆ వ్యాఖ్య దూకుడుపాళ్లు ఎక్కువ అయ్యాయంటే.. ఆ విషయాన్ని చెప్పటం తప్పు కాదు.

కానీ.. రెట్టించిన ఆవేశంతో హింసాత్మక వ్యాఖ్యలు చేయటమే అభ్యంతరకరం. తమ అధినేత చంద్రబాబును జగన్ ఘాటు విమర్శ చేశారు కాబట్టి.. ఇష్టారాజ్యంగా మాట్లాడేయొచ్చని ఫీల్ కావటం తప్పు. రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలు ఇప్పుడు ఇలానే ఉన్నాయి. చంద్రబాబు గల్లా పట్టుకున్న చేతిని తాను నరికేస్తానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేయటంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ తన నోటిని అదుపులో పెట్టుకోవాలంటున్న రాజేంద్రప్రసాద్.. ముందు ఆ విషయాన్ని తనకు తాను పాటించాల్సిన విషయాన్ని గుర్తిస్తే మంచిదే. ఒకరిని వేలెత్తి చూపించేటప్పుడు.. మిగిలిన వేళ్లు మనవైపే చూస్తాయన్న విషయాన్ని తెలుగు తమ్ముడు ఎందుకు మిస్ అవుతున్నట్లు..?
Tags:    

Similar News