ప‌వ‌న్ కామెంట్ టీడీపీ కౌంట‌ర్ ఇదే

Update: 2016-10-15 17:48 GMT
పశ్చిమ గోదావరి జిల్లా తుందుర్రు ప్రాంతంలో చిచ్చు రేపుతున్న గోదావరి మెగా ఆక్వాఫుడ్‌ పార్కు నిర్మాణాన్ని నిర‌సిస్తున్న స్థానిక రైతుల‌తో జ‌న‌సేన అధినేత‌ - ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌మావేశం అవ‌డం రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ సంద‌ర్భంగా గ‌త ఎన్నిక‌ల్లో తాను ప్రచారం చేసి గెలిపించిన టీడీపీ ప్ర‌భుత్వానికి ఝ‌ల‌క్ ఇచ్చేలా ప‌వ‌న్ స్టేట్‌ మెంట్లు ఇచ్చారు. 144 సెక్ష‌న్ విధించ‌డం - జీవ వైవిధ్యాన్ని దెబ్బ‌తీయ‌డం వంటివి స‌రికాద‌ని ప‌వ‌న్ సూచించారు. ఒక‌రకంగా బాబు స‌ర్కారుకు ప‌రోక్ష హెచ్చ‌రిక చేశారు. అయితే దీనిపై అధికార టీడీపీ ఆచితూచి స్పందించింది. మెగా ఆక్వాఫుడ్ ప్రాజెక్టు-వాస్తవాలు - రైతులకు నష్టం చేకూర్చే పని తెలుగుదేశం పార్టీ ఎప్పటకీ చేయదనే అజెండాతో ప‌వ‌న్ కు కౌంట‌ర్ గా టీడీపీ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. పార్టీ మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ పేరుతో ఈ వివ‌ర‌ణ ఇచ్చింది.

"రూ.800 కోట్ల పెట్టుబడితో 4000 మందికి పైగా యువతకు ఉపాధి కల్పించే ప్రాజెక్టును ఏర్పాటు చేస్తుంటే అడుకోవడం న్యాయమా?  పరిశ్రమలను వ్యతిరేకిస్తే యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయి?"అని ఈ లేఖ‌లో రాజేంద్ర ప్ర‌సాద్ పార్టీ త‌ర‌ఫున ప‌వ‌న్‌ ను ప్ర‌శ్నించారు. అపోహలతో పరిశ్రమలను అడుకోవడం యువత ఉద్యోగాలకు గొడ్డలిపెట్టు అవుతుంద‌ని తెలిపారు. స్వార్ణ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలు రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోరాదని సూచించారు. కులతత్వం - ప్రాంతీయతత్వం రెచ్చగొట్టడం దేశద్రోహంతో సమానమ‌ని మండిప‌డ్డారు. శాంతిభద్రతలకు విఘాతం కల్పించే పార్టీలు పెట్టుబడులు తరలిపోయేందుకు కారకులౌతారని తెలిపారు. ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని - రాష్ట్రాభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని అధికార‌ టీడీపీ త‌ర‌ఫున రాజేంద్ర‌ప్ర‌సాద్ కోరారు. మెగా ఆక్వా ఫుడ్ ప్రాజెక్టుతో ఎటువంటి పొల్యూషన్ రాదని - ఈ ప్రాజెక్టు 0% పొల్యూషన్ ప్రాజెక్టుగా పొల్యూషన్ బోర్డు కూడా నిర్ధారించింద‌ని తెలిపారు. ఈ ప్రాజెక్టుతో ఎటువంటి కాలుష్యం ఏర్పడదని - పర్యావరణానికి-ప్రజలకు హాని చేసేటటువంటి వాయువులు - రసాయనాలు వెలువడవని వివ‌రించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News