ఉక్రెయిన్ యుద్ధవేళ.. అత్యధికంగా లాభ పడింది మోడీ మాత్రమేనా?

Update: 2022-02-25 03:32 GMT
యుద్ధంతో వినాశనం తప్పించి.. మరింకేమీ ఉండదన్న మాట ఎవరి నోటి నుంచైనా వస్తుంది. యుద్ధంతో శాంతి మాయం కావటమే కాదు.. అమాయకులు ఉత్త పుణ్యానికి బలైపోతుంటారు. మొత్తంగా ఎటు చూసినా నష్టమే తప్పించి.. లాభం అన్నదేమీ ఉండదు. కాకుంటే.. యుద్ధంలో ఆధిక్యతను ప్రదర్శించేవాడు ఇంట్లో ఏడిస్తే.. యుద్ధంలో ఓడినోడు బయటే ఏడ్చే అవకాశం లభిస్తుంది. ఏ యాంగిల్ లో చూసినా యుద్ధంతో ప్రాణ నష్టం.. ఆస్తినష్టం తో పాటు.. విలువైన వనరులకు జరిగే అపార నష్టాన్ని పూడ్చటం అంత తేలికైన విషయం కాదు.

యుద్ధంతో ఇప్పటి వరకు సాధించిన డెవలప్ మెంట్ మొత్తం సర్వనాశనమై.. మళ్లీ పది నుంచి పాతికేళ్ల వరకు వెనక్కి వెళ్లాల్సి రావటం ఖాయం. అందుకే.. యుద్ధమన్నది ఆధునిక ప్రపంచంలో అసలేమాత్రం అవసరం లేని ప్రక్రియ. కానీ.. దరిద్రపుగొట్టు అధిక్యతను ప్రదర్శించుకోవటానికి యుద్ధానికి మించింది మరొకటి ఉండదు. యుద్ధం వల్ల ఇన్ని నష్టాలు ఉండటమే కాదు.. ఎవరికి ఎలాంటి లాభాన్ని కలిగించదన్న సూత్రానికి మినహాయింపుగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని చెప్పాలి.

తాజాగా జరుగుతున్న ఉక్రెయిన్ యుద్ధ వేళ.. ఆయన ఇమేజ్ అనూహ్య రీతిలో పెరిగిపోవటమే కాదు.. తదనంతరం చోటు చేసుకున్న పరిణామాలు ఆయన ఇమేజ్ ను.. రీల్ మీద సైతం మరే దర్శకుడు సైతం పెంచలేని పీక్స్ కు వెళ్లేలా చేసుకోవటంలో మోడీకి మించినోడు మరొకరు ఉండరనే చెప్పాలి. ఈ కారణంతోనే గురువారం సాయంత్రం తర్వాత నుంచి కమలనాథులకు ఒంటి మీద బట్టలు నిలవని పరిస్థితి. తమ ఆరాధ్య దైవం నరేంద్ర మోడీని ఆకాశానికి ఎత్తేసే పొగడ్త రావటం.. అది కూడా అనూహ్యమైన వ్యక్తి నుంచి రావటంతో దీని విలువ మరింత పెరిగిందని చెప్పాలి.

ఉక్రెయిన్ పై సైనిక చర్యను ప్రయోగిస్తున్న వేళ.. మరే దేశం జోక్యం చేసుకోకుండా ఉండటం మంచిదని.. ఒకవేళ జోక్యం చసుకుంటే.. ప్రపంచ చరిత్ర ఇప్పటివరకు చూడని నష్టానని కలిగిస్తానంటూ ప్రపంచ దేశాలకు వార్నింగ్ ఇచ్చిన పుతిన్ కు.. ఫోన్ చేసి నేరుగా ఆయనకే.. యుద్ధం వద్దని చెప్పటం అంత తేలికైన విషయం కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నమో రేంజ్ ఏమిటో ఎలివేట్ అయ్యే తరుణం వచ్చింది. ఉక్రెయిన్ మీద మిలటరీ చర్య అని చెబుతూనే.. ఉక్రెయిన్ ను కమ్మేసి.. ఆ చిట్టి దేశానికి దిమ్మ తిరిగేలా చేస్తున్న రష్యా తీరును అనూహ్య రీతిలో కట్ చేసే అవకాశాన్ని ఇచ్చారని చెప్పాలి.

అదెలానంటే.. భారత్ లో పని చేస్తున్న ఉక్రెయిన్ రాయబారి ఒకరు తాజాగా మాట్లాడుతూ.. భారత ప్రధాని నరేంద్ర మోడీ అత్యంత శక్తివంతమైన నాయకుడని.. ఆయన కానీ పుతిన్ తో మాట్లాడితే యుద్ధం ఆగే అవకాశం ఉందన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన నాయకుడు నరేంద్ర మోడీని అభివర్ణిస్తూ.. రష్యా అధ్యక్షుడు పుతిన్ సైతం మోడీ మాట వింటారని పేర్కొన్నారు.

తాజా పరిణామాల నేపథ్యంలో మోడీ ఇమేజ్ భారీగా పెరిగేలా ఉక్రెయిన్ రాయబారి చేసిన వ్యాఖ్యలతో నమో అభిమానులకు ఇదంతా పండుగగా మారింది. ఉక్రెయిన్ కు చెందిన భారత  రాయబారి చేసిన ప్రకటన పెద్ద సంచలనంగా మారాయి. నమో ఇమేజ్ ను అమాంతం పెంచేశాయి. ఇప్పుడు చెప్పండి.. యుద్ధంతో దారుణమైన నష్టాలే కాదు.. మోడీ మాదిరి అధినేతలకు అనూహ్యమైన లాభాలు వస్తాయన్న మాటను ఇప్పటికైనా ఒప్పుకుంటారా?


Tags:    

Similar News