9 బంతుల్లో 50.. 34 బంతుల్లో సెంచరీ.. టి20లో రికార్డులు బద్దలు..

ఓ వైపు ప్రపంచ కప్ సన్నాహాలు జరుగతుండగా.. మరోవైపు ఆసియా క్రీడలు.. అందులోనూ క్రికెట్ కు చోటు.. ఎవరికీ ఆసక్తి లేదు.. అందుకే చాలా దేశాలు ద్వితీయ, థర్డ్ గ్రేడ్ టీమ్ లను పంపాయి

Update: 2023-09-27 06:21 GMT

ఓ వైపు ప్రపంచ కప్ సన్నాహాలు జరుగతుండగా.. మరోవైపు ఆసియా క్రీడలు.. అందులోనూ క్రికెట్ కు చోటు.. ఎవరికీ ఆసక్తి లేదు.. అందుకే చాలా దేశాలు ద్వితీయ, థర్డ్ గ్రేడ్ టీమ్ లను పంపాయి. పెద్ద జట్లకు నేరుగా సెమీస్ కు అర్హత కల్పించారు. భారత మహిళల జట్టు ఇలానే సెమీస్ కు వెళ్లి కప్ కూడా కొట్టేసింది. ఇక భారత పురుషుల జట్టు ప్రయాణమే మొదలుకావాల్సి ఉంది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో భారత్ పోటీ పడనుంది. హైదరాబాదీ తిలక్ వర్మ, ఓపెనర్ యశస్వి జైశ్వాల్, రింకూ సింగ్ వంటి కుర్రాళ్లు ఈ జట్టులో ఉన్నారు. కాగా, ఈలోపే రికార్డులు బద్దలయ్యాయి.

రికార్డుల బద్దలుతో షురూ

ఆసియా క్రీడలు పురుషుల క్రికెట్ మ్యాచ్ లు బుధవారం రికార్డుల మోతతో మొదలయ్యాయి. అది కూడా ఏ భారత్ నుంచో, పాకిస్థాన్ నుంచో, శ్రీలంక తరఫునో కాదు.. ఊరూపేరు లేని నేపాల్ తరఫున. ఆ జట్టు ధాటికి బలైంది మంగోలియా. బుధవారం మంగోలియాతో మ్యాచ్ లో నేపాల్ బ్యాట్స్ మెన్ చెలరేగారు. నాలుగు ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టారు. ఫాస్టెస్ట్ అర్ధశతకం, ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టారు. టీ20ల్లో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా, భారీ తేడాతో విజయం సాధించిన జట్టుగానూ నేపాల్ రికార్డు సృష్టించింది.

యువరాజ్, మిల్లర్ రికార్డులు హుష్..

టి20ల్లో 12 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేసిన రికార్డు భారత డాషింగ్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ది. 2007లో టి20 ప్రపంచ కప్ లో ఇంగ్లండ్ పై ఈ ఘనత సాధించాడు అతడు. ఇప్పుడు దీనిని నేపాల్ బ్యాటర్ దీపేంద్ర సింగ్‌ ఐరీ (52 నాటౌట్: 10 బంతుల్లో 8 సిక్స్‌లు) చెరిపేశాడు. దీపేంద్ర 9 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. విశేషం ఏమంటే.. దీపేంద్ర కూడా యువరాజ్ లాగానే ఒకే ఓవర్‌లో ఆరు సిక్స్‌లు బాదేశాడు. ఇక టి20ల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ దక్షిణాఫ్రికా బ్యాట్స్ మన్ డేవిడ్ మిల్లర్ (35 బంతుల్లో, 2017లో బంగ్లాదేశ్ పై) పేరిట ఉంది. నేపాల్ బ్యాట్స్ మన్ కుశాల్ మల్లా దీనిని బద్దలుకొట్టాడు. 34 బంతుల్లోనే సెంచరీ చేశాడు. 8 ఫోర్లు, 12 సిక్స్ లతో 50 బంతుల్లో 137 పరుగులు పిండుకున్నాడు.

20 ఓవర్లలో 314

2019లో టి20ల్లో ఐర్లాండ్ పై అఫ్గానిస్థాన్ చేసిన 278/3నే ఇప్పటివరకు టాప్ స్కోర్. దీనిని నేపాల్ అధిగమించింది. మంగోలియాపై 20 ఓవర్లలో 314/3 చేసింది. అంతేకాదు.. టీ20ల్లో 300కిపైగా పరుగులు చేసిన తొలి జట్టుగా నేపాల్‌ నిలిచింది. ఇక 315 పరుగుల లక్ష్యంతో దిగిన మంగోలియా 41 పరుగులకే ఆలౌటైంది. దీంతో నేపాల్ 273 పరుగుల తేడాతో గెలిచింది. గతంలో తుర్కియేపై చెక్‌ రిపబ్లిక్‌ 257 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ రికార్డును నేపాల్ కొట్టేసింది.

Tags:    

Similar News