ఐపీఎల్ చాంపియన్ జట్టు కు.. జిత్తులమారి సీఎస్కే స్టార్ మెంటార్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో అత్యంత విజయవంతమైన జట్లు ఏవంటే.. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ పేర్లు ముందుగా ప్రస్తావనకు వస్తాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో అత్యంత విజయవంతమైన జట్లు ఏవంటే.. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ పేర్లు ముందుగా ప్రస్తావనకు వస్తాయి. ఈ రెండు జట్లు చెరో ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ కొట్టాయి. చెన్నై ఆరుసార్లు (పుణె సూపర్ జెయింట్స్ గా ఉన్నప్పుడూ) ఫైనల్ కు చేరింది. ముంబై ఒకసారి తుది సమరానికి వచ్చింది. చెన్నై సూపర్ ప్రయాణంలో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పాత్రం ఎంత ఉందో అందరికీ తెలిసిందే. అయితే, మరో స్టార్ కూడా ఆ జట్టుకు టైటిల్స్ తెచ్చిపెట్టడంలో ప్రముఖంగా నిలిచాడు. అతడు ఐపీఎల్, సీపీఎల్, ఐఎల్‌టీ20, ఎంఎల్‌సీ టోర్నీలు ఆడిన అనుభవశాలి.
జిత్తులమారి ఆల్ రౌండర్
వెస్టిండీస్ ఆటగాళ్లు అంటేనే టి20 ప్లేయర్లు. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ టి20 లీగ్ లు ఉన్నా అందులో వెస్టిండీస్ వీరులదే ప్రధాన పాత్ర. క్రిస్ గేల్, రస్సెల్, నరైన్, హోల్డర్ వంటివారితో పాటు ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో లాంటివారు లీగ్ ల మీద లీగ్ లు ఆడుతుంటారు. వీరిలో బ్రావో చాలాకాలం పాటు చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడాడు. ఆ జట్టు టైటిల్స్ కొట్టడంలో బ్రావోదీ కీలక పాత్రనే. జిత్తులమారి బౌలింగ్ తో పాటు లోయరార్డర్ లో హిట్టింగ్ తో తనదైనా పాత్ర పోషించాడు. అయితే, కొన్నేళ్ల కిందటనే బ్రావోను చెన్నై వదిలేసింది. తాజాగా అతడు క్రికెట్ కు పూర్తిగా వీడ్కోలు పలికాడు. కొన్ని గంటల వ్యవధిలోనే మెంటార్ పదవి దక్కింది. వాస్తవానికి బ్రావో కరీబియన్ ప్రీమియర్ లీగ్ ఆడుతూ గాయపడ్డాడు. దీంతోనే కెరీర్ కు గుడ్ బై చెప్పాడు. తర్వాత వెంటనే ఐపీఎల్ డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ కు వచ్చే సీజన్ కు మెంటార్ గా నియమితుడయ్యాడు.
గంభీర్ స్థానంలో.. పెద్ద బాధ్యత
బ్రావోకు దక్కంది మామూలు అవకాశం కాదు. ఐపీఎల్ లో మూడు టైటిళ్లు కొట్టింది కోల్ కతా. ముంబై, చెన్నై తర్వాత విజయవంతమైన జట్టు ఇదే. దీనికి ప్రధాన కారకుడు ప్రస్తుతం టీమ్ ఇండియాకు హెడ్ కోచ్ గా ఉన్న గౌతమ్ గంభీర్. కోల్ కతా కు కెప్టెన్ రెండుసార్లు, మెంటార్ గా ఈ ఏడాది టైటిల్ అందించాడు గంభీర్. అలాంటివాడి స్థానంలో బ్రావో నియమితడయ్యాడు. గంభీర్ లోటును డ్వేన్ బ్రావోతో పూరిస్తామని కేకేఆర్ సీఈవో వెంకీ మైసూరు వెల్లడించారు. బ్రావో అనుభవం, నిబద్ధత ఫ్రాంచైజీకి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కాగా, బ్రావో గత సీజన్‌లో సీఎస్కే బౌలింగ్ కోచ్ గా బాధ్యతలు నిర్వర్తించాడు. కాగా, సీపీఎల్ లో ట్రినిడాడ్ నైట్ రైడర్స్ కు దాదాపు పదేళ్లు ఆడాడు బ్రావో. కేకేఆర్ పై చెన్నై తరఫున ఎన్నో మ్యాచుల్లో పోరాడాడు. ఇప్పుడదే జట్టుకు మెంటార్ పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ట్వీట్ చేశాడు.