డబుల్ హ్యాట్రిక్.. క్రికెట్ చరిత్రలో అరుదైన ఫీట్

తాజాగా క్రికెట్ చరిత్రలోనూ అనూహ్యమని చెప్పే ఆరు బంతుల్లో ఆరు వికెట్లు పడిన వైనం ఒకటి నమోదైంది.

Update: 2023-11-14 04:16 GMT

వరుస మూడు బంతుల్లో మూడు వికెట్లు తీస్తే హ్యాట్రిక్ అనటం తెలిసిందే. అలాంటి హ్యాట్రిక్ చాలా అరుదుగా చోటు చేసుకుంటాయి. అలాంటిది వరుస ఆరు బంతుల్లో ఆరు వికెట్లు తీయటం సాధ్యమా? అంటే అసాధ్యమన్న మాట వినిపిస్తుంటుంది.అయితే.. క్రికెట్ లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చన్న నానుడి నిజమన్న విషయాన్ని తాజాగా మరోసారి నిరూపితమైంది. క్రికెట్ మేజిక్ ఏమంటే.. ఆఖరి బంతిలోనూ అనూహ్యపరిణామాలు చోటు చేసుకోవచ్చు. ఓటమి అంచుల వరకు వెళ్లిన జట్టు.. తిరిగి పుంజుకొని.. అనూహ్య విజయాన్ని సొంతం చేసుకోవచ్చు. అదే క్రికెట్ లోని మేజిక్.

తాజాగా క్రికెట్ చరిత్రలోనూ అనూహ్యమని చెప్పే ఆరు బంతుల్లో ఆరు వికెట్లు పడిన వైనం ఒకటి నమోదైంది. ఒకే ఓవర్లో ఒక బౌలర్ తాను వేసిన ఆరు బంతులకు ఆరు వికెట్లను సాధించటంద్వారా జట్టుకు మరుపురాని విజయంతో పాటు.. చరిత్రను క్రియేట్ చేసిన ఉదంతం చోటు చేసుకుంది. ఆస్ట్రేలియాలోని ఒక క్లబ్ క్రికెట్ లో చోటు చేసుకున్న ఈ మేజిక్ ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.

సర్ఫర్స్ ప్యారడైజ్ జట్టుపై ముద్గీరాబా నెరంగ్ అండ్ డిస్ట్రక్స్ టీం విజయం సాధించటం ఒక ఎత్తు అయితే.. అనూహ్యంగా విజయం సాధించిన జట్టుకు చెందిన బౌలర్ పెద్ద మేజిక్కే చేశాడని చెప్పాలి. 40 ఓవర్లలో 178 పరుగుల లక్ష్యంతో దిగిన సర్ఫర్స్ ప్యారడైజ్ జట్టు 39 ఓవర్లకు నాలుగు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. అంటే.. ఆరు బంతుల్లో ఐదు పరుగులు చేస్తే ఆ జట్టు గెలుస్తుంది. ఎవరైనా సరే.. ప్యారడైజ్ జట్టు విజయమని ఖాయంగా చెప్పేస్తారు.

కానీ.. అలాంటిది ఎంత తప్పు అన్న విషయాన్ని ముద్గీరాబా నెరంగ్ జట్టు కెప్టెన్ చేసిన మేజిక్ ఇప్పుడు క్రికెట్ చరిత్రలో అపూర్వ సంఘటనగా మిగిలింది. జట్టు కెప్టెన్ గారెత్ మోర్గాన్ చివరి ఓవర్ ను బౌల్ చేసేందుకు బంతిని తీసుకున్నారు. చివరి ఓవర్లో ఒక్క పరుగు ఇవ్వని అతడు.. వరుస ఆరు బంతుల్లో ఆరు వికెట్లు సాధించి సంచలన విజయాన్ని జట్టుకు అందించటమేకాదు.. క్రికెట్ ప్రపంచం ఒక్కసారి ఈమ్యాచ్ వైపు చూసేలా చేశాడు.

చివరి ఓవర్లో ఆరు వికెట్ల తీసిన అతడు.. మొదటి నలుగురు బ్యాటర్లు క్యాచ్ ఇచ్చి ఔట్ కాగా.. మిగిలిన ఇద్దరు బ్యాటర్లు క్లీన్ బౌల్డ్ అయ్యారు. ఒకే ఓవర్లో ఆరు వికెట్లు పడగొట్టటానికి ముందు ఏడు ఓవర్లు వేసి పదహారు పరుగులకు ఏడు వికెట్ల సాధించిన అరుదైన రికార్డును క్రియేట్ చేశాడు. ఇప్పటివరకు ప్రొఫెషనల్ క్రికెట్ లో ఒకే ఓవర్లో ఆరు వికెట్లు అన్నది లేదు. ఇప్పటివరకు ఒకే ఓవర్లో ఐదు వికెట్లు తీయటమే రికార్డుగా ఉంది. 2011లో వెల్లింగ్టన్ పై ఒటాగో తరఫున న్యూజిలాండ్ కు చెందిన నీల్ వాగ్నర్.. 2013లో అభానీ లిమిటెడ్ పై యూసీబీ - బీసీబీ తరఫున బంగ్లాదేశ్ కు చెందిన అమీన్ హోస్సేన్ ఒకే ఓవర్లు ఐదు వికెట్లు తీసే మేజిక్ ను ప్రదర్శించారు. భారత్ కు వస్తే.. కర్ణాటకకు చెందిన అభిమన్య మిథున్ 2019లో ఇదే తరహా ఘనతను సొంతం చేసుకున్నాడు. అంతే తప్పించి ఆరు బంతుల్లో ఆరు వికెట్ల మేజిక్ ను మాత్రం ఎవరూ చేయలేదు.

Tags:    

Similar News