టీమ్ ఇండియాకు కొత్త కెప్టెన్.. 40 ఏళ్ల తర్వాత సారథిగా పేస్ బౌలర్

గత కొన్నేళ్లలో చూస్తే సౌరభ్ గంగూలీ, మహేంద్రసింగ్ ధోనీ, విరాట్ కోహ్లి, ఇప్పుడు రోహిత్ శర్మలు భారత జట్టు సారథిగా తమదైన ముద్ర వేశారు.

Update: 2024-11-18 19:30 GMT

టీమ్ ఇండియాకు కెప్టెన్ కావడం అంటే మాటలు కాదు. టి20, వన్డే, టెస్టు అది ఏ ఫార్మాట్ అయినా సరే..? 150 కోట్ల మంది ప్రజలున్న దేశానికి సారథ్యం అంటే మామూలు మాటలు కాదు. పైగా టీమ్ ఇండియా అంటే లక్ష కోట్ల ఇండియన్ ప్రీమియర్ లీగ్.. వేల కోట్ల ఆదాయం ఉన్న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ). కోట్ల మంది క్రికెట్ దేశంలో కేవలం 11 మంది మాత్రమే దేశానికి ప్రాతినధ్యం వహించగలరు. వారికి ఒక్కడే కెప్టెన్. గత కొన్నేళ్లలో చూస్తే సౌరభ్ గంగూలీ, మహేంద్రసింగ్ ధోనీ, విరాట్ కోహ్లి, ఇప్పుడు రోహిత్ శర్మలు భారత జట్టు సారథిగా తమదైన ముద్ర వేశారు.

టి20ల్లో కొత్త కెప్టెన్..

టీమ్ ఇండియాకు ఇటీవలే టి20ల్లో కెప్టెన్ గా నియమితుడయ్యాడు సూర్యకుమార్ యాదవ్. 360 డిగ్రీ బ్యాటర్ గా విధ్వంసక ఇన్నింగ్స్ లు ఆడిన సూర్య.. దానికిగాను కెప్టెన్ గా ప్రమోషన్ పొందాడు. ఇక ఇటీవల శ్రీలంక, తాజాగా దక్షిణాఫిక్రా సిరీస్ ల్లో జట్టును గెలిపించాడు. దీంతో రెండు, మూడేళ్ల పాటు సూర్యనే టి20 కెప్టెన్ గా ఉండనున్నాడు. ఇక వన్డే జట్టుకు స్టార్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ ఎలాగూ కెప్టెన్ గా ఉన్నాడు. ప్రస్తుతానికి రోహిత్ ఒకటి, రెండేళ్లయినా వన్డేల్లో కొనసాగుతాడు. అతడు వదులుకుంటే తప్ప కెప్టెన్సీ మరొకరికి చాన్స్ రాదు.

టెస్టుల్లో కొత్త సారథి..

టీమ్ ఇండియా టెస్టు కెప్టెన్ రోహిత్ శర్మ ముందు ఇప్పుడు ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్ వంటి కఠిన సవాల్ ఉంది. వాస్తవానికి మొన్నటివరకు రోహిత్ రెండేళ్లయినా టెస్టు కెప్టెన్ గా ఉంటాడని అనిపించింది. న్యూజిలాండ్ తో సొంతగడ్డపై చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 0-3తో పరాజయం పాలవడంతో టీమ్ ఇండియాకు ఈ ఫార్మాట్ లో భవిష్యత్ కెప్టెన్ ను చూసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కాగా, ఆస్ట్రేలియాతో ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న ఐదు టెస్టుల సిరీస్ లో రోహిత్ శర్మ తొలి టెస్టుకు అందుబాటులో ఉండడం లేదు. అతడికి కొడుకు పుట్టడంతో ముంబైలోనే ఉండిపోయాడు. అతడు తొలి టెస్టులో పాల్గొనడం లేదు. ఈ నేపథ్యంలో తొలి టెస్టులో భారత జట్టును పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా నడిపించనున్నాడు.

కపిల్ దేవ్ తర్వాత..

దిగ్గజ పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ తర్వాత టీమ్ ఇండియాకు కెప్టెన్ అయిన పేస్ బౌలర్ లేడు. జవగల్ శ్రీనాథ్, జహీర్ ఖాన్, అజిత్ అగార్కర్ వంటి పేస్ బౌలర్లు వచ్చినా కెప్టెన్లు కాలేకపోయారు. అయితే, ఇప్పుడు బుమ్రా ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో టీమ్ ఇండియాను నడిపించనున్నాడు. పైగా, భవిష్యత్ లో, ఇంకా చెప్పాలంటే ఆస్ట్రేలియా సిరీస్ లో రోహిత్ గనుక విఫలం అయితే అతడి టెస్టు కెరీర్ ముగిసినట్లే. దీంతో బుమ్రానే టెస్టు సారథి అవుతాడు. ఈ లెక్కన కపిల్ దేవ్ తర్వాత టీమ్ ఇండియా కెప్టెన్ అయిన తొలి పేసర్ గా బుమ్రా రికార్డులకు ఎక్కుతాడు.

Tags:    

Similar News