91 ఏళ్ల తర్వాత భారత్‌లో టెస్టు మ్యాచ్ రద్దు.. భారత్ లేకుండానే

ఏ టోర్నీ అయినా సరే.. టీమ్ ఇండియా లేకుంటే అది ప్రసారహక్కుల డబ్బులూ రాబట్టలేని పరిస్థితి.

Update: 2024-09-13 12:11 GMT

ప్రపంచ క్రికెట్ లో ప్రస్తుతం పెద్దన్న ఎవరంటే భారత్ అనే చెప్పాలి. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల ఆధిపత్యానికి గండికొట్టి మన జట్టు, మన క్రికెట్ బోర్డు ప్రపంచ క్రికెట్ ను హస్తగతం చేసుకున్నాయి. ఏ టోర్నీ అయినా సరే.. టీమ్ ఇండియా లేకుంటే అది ప్రసారహక్కుల డబ్బులూ రాబట్టలేని పరిస్థితి. ఇక అలాంటి భారత జట్టు మూడు ఫార్మాట్లలోనూ మేటిగా ఎదిగింది. నిరుటి వన్డే ప్రపంచ కప్ ఫైనల్ చేరింది. టి20 ప్రపంచ కప్ ను గెలుచుకుంది. టెస్టు ఫార్మాట్లోనూ రెండుసార్లు చాంపియన్ షిప్ ఫైనలిస్టు.

భారత్ లో భారత్ లేకుండానే..

భారత దేశంలో అదీ రాజధానిలో టెస్టు మ్యాచ్. కానీ, ఆడుతున్నది భారత్ కాదు.. ఇది చెప్పుకోవడానికి ఎంత విచిత్రంగా ఉందో కదూ..? దీనికి కారణం.. అఫ్ఘానిస్థాన్ క్రికెట్ జట్టుకు మన దేశం రెండో పుట్టిల్లు కావడమే. కల్లోల పరిస్థితుల్లో అఫ్ఘాన్ లో మ్యాచ్ లు నిర్వహించలేని ఆ దేశ బోర్డుకు భారత్ ఈ విధంగా సాయం చేస్తోంది. గతంలో అఫ్ఘాన్ ఇలా మన దేశంలో వివిధ జట్లతో మ్యాచ్ లు ఆడింది. ఇప్పుడు పెద్ద జట్టయిన న్యూజిలాండ్ తో టెస్టు ఆడాల్సి వచ్చింది. దీనికి గ్రేటర్ నోయిడా వేదిక.

ఒక్కబంతీ పడకుండానే..

గ్రేటర్ నోయిడాలో అఫ్ఘాన్-న్యూజిలాండ్ మ్యాచ్ ఒక్క బంతికూడా పడకుండానే రద్దయింది. వర్షంతో మొత్తం ఐదు రోజుల ఆట రద్దయింది. కనీసం టాస్‌ కూడా వేయలేదు. అయితే, తొలి రోజు కాస్త తెరపినిచ్చినా.. మైదానం సిద్ధంగా లేదు. చిత్తడితో ఆటగాళ్లకు ఇబ్బందులు వస్తాయని మ్యాచ్ నిర్వహించలేదు. మరోవైపు పిచ్‌ ను త్వరగా సిద్ధం చేసే సదుపాయాలూ లేకపోవడం దెబ్బకొట్టింది. ఇక రెండో రోజు నుంచి వర్షమే. శుక్రవారం మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.

నోయిడాపై ఎన్నో విమర్శలు..

రెండు అంతర్జాతీయ జట్ల మ్యాచ్ నిర్వహణకు వేదికగా గ్రేటర్ నోయిడా మైదానం తగదనే విమర్శలు వస్తున్నాయి. భారత్ లో ఒక్క బంతీ పడకుండా టెస్టు రద్దవడం 91 ఏళ్ల తర్వాత భారత్‌ ఇదే తొలిసారి. ఆ పుణ్యం గ్రేటర్ నోయిడా మైదానానిదే అని ఎద్దేవా చేస్తున్నారు. కాగా, భారత్ లో 1933 నుంచి టెస్టులు జరుగుతున్నాయి. పాకిస్థాన్- జింబాబ్వే మధ్య 1998లో వర్షం కారణంగా టెస్టు మొత్తం రద్దయింది. ఇలా ప్రపంచ టెస్టు క్రికెట్ చరిత్రలో 8 మ్యాచ్ లకు మాత్రమే జరిగింది. మూడు సార్లు న్యూజిలాండ్ ఒక జట్టుగా ఉండడం గమనార్హం. ఇంగ్లాండ్‌-ఆస్ట్రేలియా (1890, 1938, 1970), న్యూజిలాండ్-పాకిస్థాన్ (1989), వెస్టిండీస్‌-ఇంగ్లాండ్‌ (1998), భారత్-న్యూజిలాండ్ (1998), పాకిస్థాన్-జింబాబ్వే (1998) మధ్య మ్యాచ్ లు గతంలో రద్దయ్యాయి. ఒక్క 1998లో మూడు మ్యాచ్ లు క్యాన్సిల్ కావడం ఓ విశేషం అయితే.. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు మాత్రమే టెస్టు ఆసాంతం రద్దవడం మరో విశేషం.

Tags:    

Similar News