ఇటు యూరో.. అటు కోపా.. ప్రపంచంలో ‘మారో’ ‘మారో’.. మరో సంగ్రామం

ప్రపంచంలో అత్యంత పాపులర్ క్రీడ ఫుట్ బాల్. అయితే, 2022 చివర్లోనే ప్రపంచ కప్ ముగిసింది.

Update: 2024-06-14 11:30 GMT

అదేంటి..? క్రికెట్ లో వన్డే ప్రపంచకప్ గత ఏడాదే అయిపోయింది కదా..? ఫుట్ బాల్ లో ప్రపంచ కప్ దాదాపు రెండేళ్ల కిందట ముగిసింది కదా..? ఇప్పుడు క్రికెట్ లో టి20 ప్రపంచ కప్ జరుగుతున్నది కదా..? ఒలింపిక్స్ కు ఇంకా రెండు నెలల టైం ఉంది కదా..? మరి ఇంకెక్కడి క్రీడా మహా సంగ్రామం..? అని డౌట్ వస్తోందా..? ఇవి తప్ప ప్రపంచవ్యాప్తంగా పేరున్న క్రీడలు ఏమున్నాయ్? అనే సందేహం కలుగుతోందా..? ఎందుకు లేవు..? అలాంటిదే మరో కప్ జరుగుతోంది..

ప్రపంచంలో అత్యంత పాపులర్ క్రీడ ఫుట్ బాల్. అయితే, 2022 చివర్లోనే ప్రపంచ కప్ ముగిసింది. అందులో అర్జెంటీనా విజేతగా నిలిచింది. మళ్లీ 2026లోనే వరల్డ్ కప్. అయితే, దీనికి కాస్త అటుఇటుగా ఉండేది యూరో కప్. యూరప్ లోని దేశాలకు ప్రత్యేకించిన ఈ టోర్నీ కూడా ప్రపంచాన్నిఊపేస్తుంది. అసలు ఫిఫా ప్రపంచకప్‌ తర్వాత ఎక్కువమంది చూసేది దీనినే.

ఇదీ నాలుగేళ్లకోసారే..

ప్రపంచ కప్ లలాగానే యూరో కప్ నాలుగేళ్లకోసారి జరుగుతుంది.

భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి (శనివారం) 12.30కు ఈసారి టోర్నీ మొదలుకానుంది. ఈసారి కప్ నకు జర్మనీ ఆతిథ్యం ఇస్తోంది. మొదటి మ్యాచ్ లో ఈ జట్టు స్కాట్లాండ్ తో తలపడనుంది.

యూరప్ చాంపియన్ ఎవరో..?

యూరప్ లోని 24 దేశాల జట్లు యూరో కప్ లో తలపడతాయి. జార్జియా ఇందులో తొలిసారిగా ఆడుతోంది. ఇది 17వ యూరో కప్.

నెల రోజుల పాటు జులై 14 వరకు 10 నగరాల్లో 51 మ్యాచ్‌ లు నిర్వహిస్తారు. 24 జట్లు 6 గ్రూప్‌ లుగా విడిపోయాయి. ప్రతి గ్రూప్‌లో ఒక్కో జట్టు ఇతర దేశాలతో ఒక్కో మ్యాచ్‌ ఆడుతుంది. తొలి రెండు స్థానాల్లో నిలిచే 12 జట్లతో పాటు.. అన్ని గ్రూప్‌ లలో కలిపి మూడో స్థానంలో నిలిచిన నాలుగు అత్యుత్తమ జట్లు ప్రిక్వార్టర్స్‌ (రౌండ్‌-16)కు వెళ్తాయి.

రష్యా లేకుండా ఇప్పుడే..

24 ఏళ్ల తర్వాత రష్యా లేకుండా యూరో కప్ జరుగుతోంది. ఉక్రెయిన్ పై దండయాత్రకు దిగినందున రష్యాను అర్హత రౌండ్లో పోటీ పడకుండా వేటు వేశారు.

2021లో జరిగిన యూరో కప్ లో చాంప్ అయిన ఇటలీ.. 2022 ఫుట్ బాల్ ప్రంపచ కప్ నకు ఎంపికవలేదు. దీన్నిబట్టే ఈ టోర్నీ ఎంత సమర్థంగా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. 1960లో మొదలైన యూరో కప్‌ ను జర్మనీ, స్పెయిన్‌ అత్యధికంగా మూడేసిసార్లు నెగ్గాయి.

అటు కోపా.. ఇటు యూరో..

యూరప్ అంతటికీ యూరో కప్ ఎలాగో.. దక్షిణ, ఉత్తర అమెరికాలకు కోపా అమెరికా కప్ అలాగ.. అత్యంత ప్రతిష్ఠాత్మక టోర్నీ అయిన కోపా కప్ ఈ నెల 20న మొదలుకానుంది.

Tags:    

Similar News