10 మ్యాచ్ లు.. 6 ఓటములు? ‘సిడ్నీ టెస్ట్’.. ఫెయిలైతే హెడ్ కోచ్ ఔట్?
ఆరు నెలల్లోలే అంచనా వేయడం సరికాదు కానీ.. గంభీర్ కోచ్ గా బాధ్యతలు చేపట్టాక టీమ్ ఇండియా ప్రదర్శన పడిపోయింది.
గత హెడ్ కోచ్ ల కంటే యువకుడైన అతడు హెడ్ కోచ్ గా వస్తుంటే చాలా మార్పులు వస్తాయని ఆశించారు.
స్వతహాగానే దూకుడైన వ్యక్తి కావడంతో జట్టులో కూడా దూకుడు ఆడి గెలిచే లక్షణం కనిపిస్తుందని భావించారు.
కానీ పరిస్థితులు అంతకు భిన్నంగా కనిపిస్తున్నాయి. అతడి తొలి సిరీస్ లోనే చేదు అనుభవం. 27 ఏళ్ల తర్వాత శ్రీలంక చేతిలో వన్డే సిరీస్ పరాభవం.
సొంతగడ్డపై పెద్దగా బలంలేని బంగ్లాదేశ్ పై గెలిచినా.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా న్యూజిలాండ్ చేతిలో మూడు టెస్టుల సిరీస్ లో వైట్ వాష్.
ఇప్పుడు ఆస్ట్రేలియాతో బోర్డర్-గావస్కర్ సిరీస్ ను కోల్పోయే ప్రమాదం. దీనికి ఒక్క టెస్టే దూరం.. అందులోనూ పరాజయం పాలైతే అతడి పదవికి ప్రమాదం పొంచి ఉన్నట్లే.
పైన చెప్పుకొన్నదంతా టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ గురించి. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఈ పదవికి బీసీసీఐ ఏరికోరి గంభీర్ ను తీసుకుంది. టి20, వన్డే ప్రపంచ కప్ ఫైనల్స్ హీరో అయిన గంభీర్.. ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్, మెంటార్ గా విజయవంతం కావడమే దీనికి కారణం. కేవలం 42 ఏళ్ల వయసుకే టీమ్ ఇండియా హెడ్ కోచ్ కావడం విశేషం.
అంచనాలు తలకిందులు..
ఆరు నెలల్లోలే అంచనా వేయడం సరికాదు కానీ.. గంభీర్ కోచ్ గా బాధ్యతలు చేపట్టాక టీమ్ ఇండియా ప్రదర్శన పడిపోయింది. అయితే, సీనియర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల వైఫల్యం ఇందులో ప్రధాన కారణం. సీనియర్ ఆఫ్ స్పిన్నర్, తనతో కలిసి ఆడిన రవిచంద్రన్ అశ్విన్ ఈ ఆస్ట్రేలియా పర్యటనలోనే అనూహ్యంగా తప్పుకొన్నాడు. దీంతో కోచ్ గా గంభీర్ నిర్ణయాలూ విమర్శలకు తావిస్తున్నాయి.
వీటన్నిటి రీత్యా బీసీసీఐ అలర్టైంది. వాస్తవానికి గంభీర్ కు మూడేళ్ల టెన్యూర్ ఉంది. కానీ, బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలోనూ ఓడితే మాత్రం కొనసాగించడంపై ఆలోచనలో పడొచ్చు.
జనవరి 3 నుంచి జరిగే సిడ్నీటెస్టు మ్యాచ్ ఫలితం పైనే గంభీర్ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇందులో భారత్ గెలిస్తే సిరీస్ ను 2-2తో సమం చేస్తుంది. ఓడితే ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ రేస్ నుంచి ఔట్ అవుతుంది. అదే జరిగితే గంభీర్ ను తప్పించే అవకాశం ఉందని అంటున్నారు.