మంత్రం కాదు.. స్వీయ తంత్రం.. టీమిండియా ఆల్ రౌండర్
లైన్ అండ్ లెంగ్త్ కోసమట.. పాక్ తో మ్యాచ్ లో హార్దిక్ 13వ ఓవర్లో ఇమాముల్ వికెట్ పడగొట్టాడు. మూడో పేసర్ గా బౌలింగ్ చేస్తున్న అతడు.. జట్టుకు ఉపయోగపడేలా వికెట్లు తీస్తున్నాడు.
ప్రపంచ కప్ లో మిగతా మ్యాచ్ లు అన్నీ ఒక ఎత్తు. భారత్ పాకిస్థాన్ మ్యాచ్ ఒక ఎత్తు. ప్రస్తుత కప్ లో ఇప్పటివరకు ఏ మ్యాచ్ కూ స్టేడియం నిండలేదు. కానీ, భారత్-పాక్ మ్యాచ్ కు మాత్రం సీట్లు ఖాళీ లేవు. దీన్నిబట్టే చెప్పొచ్చు.. రెండు జట్ల మధ్య పోటీకి ఎంత ప్రాధాన్యం ఉందో...? కాగా, దాయాదుల మధ్య ఈ నెల 14న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో టీమిండియా సునాయాసంగా గెలుపొందిన సంగతి తెలిసిందే.
కోహ్లి వాచీ సీన్.. హార్దిక్ ప్రార్థన చిరకాల ప్రత్యర్థితో సమరంలో భారత్ చెలరేగి ఆడింది. ఆల్ రౌండ్ ప్రతిభతో పాక్ ను మట్టికరిపించింది. ప్రస్తుత కప్ లో ఏ జట్టు మిడిలార్డర్ కూడా ఆడనంత పేలవంగా పాక్ మిడిలార్డర్ ఆడింది. మన స్పిన్నర్లకు తలొంచింది. 200 పరుగులు కూడా చేయలేకపోయింది. ఈ తేలికైన లక్ష్యాన్ని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భీకర ఇన్నింగ్స్ తో భారత్ అతి తేలిగ్గా ఛేదించింది. అయితే, పాకిస్థాన్ ఇన్నింగ్స్ సమయంలో కొన్ని ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. వాటిలో ప్రధానమైనది పేస్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రార్థన.
రనప్ కోసం సిద్ధమైన అతడు.. బంతిని రెండుచేతుల్లోకి తీసుకుని ఏదో ప్రార్థన చేస్తున్న సీన్ అందరినీ ఆకట్టుకుంది. ఇదే సమయంలో పాక్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ మొహమ్మద్ రిజ్వాన్ గార్డ్ తీసుకోవడానికి అధిక సమయం తీసుకోవడంతో.. కోహ్లి వాచ్ చూస్తున్న సీన్ కూడా హైలైట్ గా నిలిచింది.
అది ప్రార్థన కాదట..బంతిని రెండు చేతుల్లోకి తీసుకుని ప్రార్థిస్తూ హార్దిక్ ఏం మంత్రం వేశాడో కానీ.. ఆ బంతికే పాకిస్థాన్ ఓపెనర్ ఇమాముల్ హక్ వికెట్ కీపర్ రాహుల్ కు అతి తేలికైన క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో హార్దిక్ ఏదో మంత్రం వేశాడని అందరూ అనుకున్నారు. నిన్నటివరకు ఇదే అభిప్రాయంతో ఉన్నారు. అయితే, మంత్రం లేదు తంత్రం లేదు అంటూ హార్దిక్ అసలు విషయం చెప్పాడు.
లైన్ అండ్ లెంగ్త్ కోసమట.. పాక్ తో మ్యాచ్ లో హార్దిక్ 13వ ఓవర్లో ఇమాముల్ వికెట్ పడగొట్టాడు. మూడో పేసర్ గా బౌలింగ్ చేస్తున్న అతడు.. జట్టుకు ఉపయోగపడేలా వికెట్లు తీస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇమాముల్ వికెట్ పడగొట్టాడు. అయితే, అంతకుముందు అతడు పరుగులు ఇచ్చాడు. బౌలింగ్ గాడి తప్పాడు. దీంతో తనను తాను అదుపు చేసుకుంటూ లైన్ అండ్ లెంగ్త్ పాటించేలా "మనసులో ప్రార్థన" చేసుకున్నట్లు హార్దిక్ తెలిపాడు. తాను ఏ మంత్రమూ పఠించలేదని.. వికెట్ పడకపోవడంతో తనపై తనకు కోపం వచ్చిందని, తనను తాను తిట్టుకున్నట్లు చెప్పాడు. అలా.. తన ప్రార్థన వెనుక ఉన్న అసలు విషయాన్ని బయటపెట్టాడు.