17 కేజీల బరువు తగ్గి ఆస్ట్రేలియా టూర్ కు ఎంపికైన క్రికెటర్
నవంబరు 22 నుంచి మొదలుకానున్న ఆస్ట్రేలియా సిరీస్ కు మూడు రోజుల కిందట టీమ్ ఇండియాను 18 మందితో ఎంపిక చేశారు
ఆజానుబాహుడిలా 6.2 అడుగుల ఎత్తు.. నిలకడగా 140 కిలోమీటర్ల వేగం.. మధ్యలో బౌన్సర్లు.. అవసరమైతే వేగం తగ్గించి బోల్తా కొట్టించగల నైపుణ్యం.. అతడి బౌలింగ్ ను ఆడటం బ్యాటర్లకు సవాలే.
నవంబరు 22 నుంచి మొదలుకానున్న ఆస్ట్రేలియా సిరీస్ కు మూడు రోజుల కిందట టీమ్ ఇండియాను 18 మందితో ఎంపిక చేశారు. ఇందులో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డికి చోటు దక్కడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, మరో ఎంపిక కూడా అందరినీ ఆలోచింపజేసింది. ఇప్పటివరకు టీమ్ ఇండియా రిజర్వ్ ప్లేయర్ గానో, 15 మంది సభ్యులలోనో ఉన్నాడు అతడు. ఇప్పుడు అనూహ్యంగా ఆస్ట్రేలియా సిరీస్ తో అరంగేట్రం చేసేలా కనిపిస్తున్నాడు. దీనికిముందు అతడి ‘శారీరక శ్రమ’ను ఇంకా ఆసక్తికరం.
ఐపీఎల్ గెలిపించి..
పేసర్ హర్షిత్ రాణా.. కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ జట్టు సభ్యుడు. ఈ ఏడాది కోల్‌కతా నైట్ రైడర్స్ ట్రోఫీ నెగ్గడంలో ఇతడి పాత్ర కీలకం. అయితే, రాణాకు ఇప్పటివరకు టీమ్ ఇండియాకు ఆడే చాన్స్ దొరకలేదు. మొన్నటి బంగ్లాదేశ్ సిరీస్ కూ ఎంపికైనా ఒక్క టి20ల్లోనూ అవకాశం రాలేదు. ఇప్పుడు మాత్రం ఆస్ట్రేలియా పర్యటనకు తీసుకెళ్తున్నారు. ఐదు టెస్టుల సిరీస్ కావడంతో రాణాకు తుది జట్టులో చోటు ఉండొచ్చని భావిస్తున్నారు.
స్టార్ పేసర్ మొహమ్మద్ షమీ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడి కోసం వెదుకుతుండగా రాణా కనిపించాడు. బుమ్రా, సిరాజ్ తో ఇతడు భారత పేస్ బౌలింగ్ భారాన్ని పంచుకునే చాన్సుంది.
బరువు తగ్గి..
రాణా టీమ్ ఇండియాకు ఎంపిక కావడం వెనుక చాలా పెద్ద ప్రయత్నమే చేశాడు. దీంట్లోభాగంగా ఫిట్ నెస్‌పై దృష్టిపెట్టాడు. తీవ్రంగా శ్రమించి 17 కిలోల బరువు తగ్గాడు. సహజంగా పేసర్ కు ఉండే గాయాల బెడద అతడిని వేధించింది. ఓ దశలో ఒళ్లంతా గాయాలే. క్రికెట్ ఆడలేడేమో అనే పరిస్థితి నుంచి త్వరగా కోలుకున్నాడు. ఈ క్రమంలో విపరీతంగా బరువు పెరిగాడు. ఓ క్రికెటర్ గా అందులోనూ పేసర్ గా ఇంత బరువు ఉంటే అంతర్జాతీయ మ్యాచ్ లలో కష్టం. దీంతో రాణా.. తన బరువును తగ్గించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించాడు. ఏకంగా 17 కిలోల బరువు తగ్గి ఇప్పుడు సూపర్ ఫిట్ గా మారాడు. రాణా ఇప్పటికే శ్రీలంక, జింబాబ్వే, బంగ్లాదేశ్ తో సిరీస్ లకు ఎంపికయినా అరంగేట్రం చేయలేదు.
కాగా, తన ఎదుగుదల వెనుక తండ్రి తీవ్రంగా శ్రమించాడని హర్షిత్ వివరించాడు. తరచూ గాయాలయ్యే తనకు ధైర్యం చెబుతూ.. తన వెనక స్తంభంలా నిలిచాడని కొనియాడా3రు. ప్రొఫెషనల్ క్రికెటర్ కాలేకపోయినా ఫర్వాలేదని చెప్పేవాడన్నారు. కాగా, నువ్వు బంతి వేస్తే బ్యాటర్లు బెంబేలెత్తాలి అని తన తండ్రి చెప్పేవారని రాణా తెలిపాడు. అథ్లెట్, వెయిట్ లిఫ్టర్ అయిన తన తండ్రి ఎప్పుడూ స్ఫూర్తి నింపేవాడని వివరించాడు. కాగా, హర్షిత్ వయసు 22 ఏళ్లే. బ్యాటింగ్ కూడా చేయగల సత్తా ఇతడి సొంతం.
కొసమెరుపు: తాను ఇంగ్లాండ్‌లో ఆడుతుంటే చూడాలనేది హర్షిత్ తండ్రి కల. కానీ.. హర్షిత్ మాత్రం ఆస్ట్రేలియాతో ఆడాలని అనుకుంటాడట.