భారత్ తో సిరీస్.. శ్రీలంక కోచ్ గా భీకర ఓపెనర్.. అన్నీ సేమ్ టు సేమ్
టి20 ప్రపంచ కప్ లో లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది మాజీ చాంపియన్ శ్రీలంక. కొన్నాళ్లుగా ఆ దేశ క్రికెట్ ప్రమాణాలు పడిపోతున్నాయి
టి20 ప్రపంచ కప్ లో లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది మాజీ చాంపియన్ శ్రీలంక. కొన్నాళ్లుగా ఆ దేశ క్రికెట్ ప్రమాణాలు పడిపోతున్నాయి. మరీ ముఖ్యంగా టి20లు, వన్డేల్లో. గత ఏడాది హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ దెబ్బకు లంక అత్యంత తక్కువ పరుగులకే ఆలౌటైంది. ఇక టి20 ప్రపంచ కప్ లోనూ పెద్దగా రాణించలేదు. అయితే, ఈ నెలాఖరులో భారత్ తో సిరీస్ ఆడనుంది. ఇందులో భాగంగా మూడు టీ20లు, మూడు వన్డేల్లో తలపడనుంది.
టి29 ప్రపంచ కప్ లో సూపర్ 8కు కూడా చేరలేని పరిస్థితుల్లో శ్రీలంక హెడ్ కోచ్ పదవికి క్రిస్ సిల్వర్‌వుడ్ రాజీనామా చేశాడు. దీంతో ఖాళీ ఏర్పడింది. కొత్త కోచ్ ను వెదికి పట్టేందుకు సమయం లేకపోవడం, ఇంతలోనే భారత్ తో సిరీస్ ఉన్న నేపథ్యంలో శ్రీలంక మాజీ ఓపెనర్ ఎడమచేతివాటం ఆటగాడు సనత్ జయసూర్యను హెడ్ కోచ్ గా ప్రకటించింది. జయసూర్య శ్రీలంక క్రికెట్ దిగ్గజం అనే సంగతి అందరికీ తెలిసిందే. దాదాపు 20 ఏళ్లు ఆ దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. 110 టెస్టులు, 445 వన్డేలు, 31 టి20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. ఓ దశలో కెప్టెన్ గా కూడా చేశాడు. 1996 వన్డే ప్రపంచ కప్ గెలవడంలో ఓపెనర్ గా జయసూర్యదే ప్రధాన పాత్ర. మొన్నటి టి20 ప్రపంచ కప్ లో జయసూర్య శ్రీలంక జట్టుకు క్రికెట్ కన్సల్టెంట్ గా ఉన్నాడు. డిసెంబరు నుంచి ఈ బాధ్యతల్లో కొనసాగుతూ హై-పెర్ఫార్మెన్స్ సెంటర్ లో ఆటగాళ్లు, కోచ్ లను కూడా పర్యవేక్షిస్తున్నాడు.
భారత్ కూ కొత్త కోచే..
శ్రీలంకతో సిరీస్ కు భారత్ కు కూడా కొత్త కోచ్ రానున్న సంగతి తెలిసిందే. మొన్నటి ప్రపంచ కప్ తోనే రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం పూర్తయింది. దీంతో కొత్త హెడ్ కోచ్ ను ఎంపిక చేస్తున్నారు. ఈ రేసులో మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ముందంజలో ఉన్నాడు. త్వరలోనే అతడి నియామకంపై ప్రకటన చేసే చాన్సుంది. ఎడమ చేతివాటం ఓపెపర్ అయిన గంభీర్ కూడా భారత్ వన్డే (2011), టి20 (2007) ప్రపంచ కప్ లను గెలవడంలొ కీలక పాత్ర పోషించాడు. ఈ లెక్కన రెండు జట్లకూ ఎడమచేతివాటం ఓపెనర్లు కోచ్ లుగా ఉండనున్నారు. ప్రపంచ కప్ లు గెలిచిన జట్లలోనూ వీరు సభ్యులు కావడం మరో విశేషం.