వరల్డ్ కప్.. భారత్ కు అన్నీ మంచి శకునములే!
క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వన్డే వరల్డ్ కప్ కు ఇక తెర లేస్తోంది. మొదటి మ్యాచ్ గత ప్రపంచకప్ విన్నర్ ఇంగ్లండ్, రన్నర్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనుంది
క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వన్డే వరల్డ్ కప్ కు ఇక తెర లేస్తోంది. మొదటి మ్యాచ్ గత ప్రపంచకప్ విన్నర్ ఇంగ్లండ్, రన్నర్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనుంది. ఈసారి వరల్డ్ కప్ మ్యాచ్ లన్నీ భారత్ లోనే జరగనున్నాయి. ఈ నేపథ్యంలో 2011లో స్వదేశంలో జరగిన వరల్డ్ కప్ ను గెలుచుకున్న భారత్ మరో కప్ ఒడిసిపడుతుందని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు అన్ని దేశాల క్రికెట్ పండితులు సైతం భారత్ ను టైటిల్ ఫేవరెట్ గా పరిగణిస్తున్నారు.
క్రికెట్ పండితుల అంచనాలకు తగ్గట్టే భారత్ కు అన్నీ మంచి శకునములే కనిపిస్తున్నాయి. వరల్డ్ కప్ స్వదేశంలో జరుగుతుండటంతో అభిమానుల మద్దతు మనకే లభించనుంది. ఇక కొట్టిన పిండిలాంటి మైదానాలు ఒక వరం. ముఖ్యంగా కీలక ఆటగాళ్లంతా ఫామ్ లోకి వచ్చేశారు. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభమన్ గిల్, మిడిల్ ఆర్డర్ లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు. ఇక గాయాలతో జట్టుకు దూరమై చాలాకాలం తర్వాత టీమ్ లోకి వచ్చిన కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ సైతం ఆసియా కప్ లో దుమ్ములేపారు. సెంచరీలతో తమ సత్తా చాటారు. ముఖ్యంగా కేఎల్ రాహుల్ తనపై జట్టు పెట్టుకున్న ఆశలను నిలబెట్టాడు.
ఇక పేస్ దళం.. జస్పీత్ బుమ్రా, సిరాజ్, మహ్మద్ షమి, శార్దూల్ ఠాకూర్ కూడా లయ అందిపుచ్చుకున్నారు. అలాగే స్పిన్నర్లు కులదీప్ యాదవ్, రవిచంద్ర అశ్విన్ కూడా ఫామ్ ను దొరకబుచ్చుకున్నారు. ఇక బ్యాటుతో, బౌలింగుతో ఆదుకునే ఆల్ రౌండర్లు రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యాలతో భారత్ జట్టు దుర్భేధ్యంగా కనిపిస్తోంది.
సిరాజ్ వన్డే కెరీర్‌లో 24 మ్యాచ్‌ల్లో 43 వికెట్లు తీయగా.. ఉపఖండంపై 17 మ్యాచ్‌ల్లో 35 వికెట్లను కూల్చి తానెంత ప్రమాదకరమో చాటాడు. ఆసియా కప్ ఫైనల్ లో శ్రీలంక ఇన్నింగ్స్ ను పవర్ ప్లేలోనే పేకమేడలా కూల్చేశాడు.
ఇక మహ్మద్ షమీ కెరీర్‌లో తీసిన 162 వికెట్లలో 64 (39 మ్యాచ్‌ల్లో) ఆసియా పిచ్ లపై సాధించినవే. బుమ్రా కూడా కేవలం 37 మ్యాచ్ ల్లోనే 4.65 ఎకానమీతో 63 వికెట్లను తీయడం విశేషం. ముఖ్యంగా షమీ గత ప్రపంచకప్ లో భారత్ తరఫున అద్భుత బౌలింగ్ గణాంకాలను నమోదు చేశాడు. 2015, 2019 ప్రపంచకప్ ల్లో ఆడిన మొత్తం 11 మ్యాచ్‌ల్లో 31 వికెట్లు తీశాడు. ప్రపంచకప్ టోర్నీలో అతడి బెస్ట్ 5/69 ఉండటం విశేషం.
అందరికంటే ముఖ్యంగా భారత పేస్ గుర్రం.. జస్పీత్ బుమ్రా గాయంతో ఏడాది పాటు ఆటకు విరామం ప్రకటించాడు. ఇటీవల ఆసియా కప్ లో పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో మళ్లీ వన్డేలు ఆడాడు. ఈ క్రమంలో ఈ ఏడాది మొత్తం ఐదు మ్యాచ్‌లు ఆడి.. ఎనిమిది వికెట్లను పడగొట్టాడు. ప్రపంచకప్ లో అయితే బుమ్రాకు మంచి రికార్డే ఉంది. 2019 వరల్డ్ కప్ లో బుమ్రా 9 మ్యాచ్‌లు ఆడి.. 18 వికెట్లను తీయడం విశేషం. అంటే ఒక్కో మ్యాచ్ కు సగటున రెండు వికెట్లు పడగొట్టాడు.
ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభమన్ గిల్, ఆ తర్వాత కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా ఇలా భారత బ్యాటింగ్ అబేధ్యంగా కనిపిస్తోంది. శార్దూల్ ఠాకూర్, అశ్విన్ సైతం తమదైన రోజు బ్యాట్ ఝులిపించగలవారే. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్ ముంగిట భారత్ కు అన్నీ శుభ శకునాలే కనిపిస్తున్నాయి.