తొలి సెంచరీల సెంటిమెంటు.. ఆ జట్టేనా ప్రపంచ కప్ విజేత?

ఈ నెల 5న మొదలైన ప్రపంచ కప్ లో తొలి మ్యాచ్ లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ తలపడ్డాయి. అందులో న్యూజిలాండ్ అద్భుత విజయం సాధించింది

Update: 2023-10-10 11:25 GMT

భారత్ ఏకైక వేదికగా ఈ నెల 6న మొదలైన వన్డే ప్రపంచ కప్ సాఫీగా సాగుతోంది. స్టేడియంలలో ప్రజలు తక్కువగా ఉన్నప్పటికీ నిర్వహణ పరంగా సమస్యలు ఏమీ రావడం లేదు. ఆస్ట్రేలియాతో మ్యాచ్ ద్వారా భారత్ ప్రపంచ కప్ ప్రస్థానం మొదలవడంతో టోర్నీపై ఆసక్తి పెరిగింది. అందులోనూ భారత్ చక్కటి విజయం సాధించడంతో అభిమానుల్లో ఈసారి కప్ మనదే అన్న నమ్మకం కలిగింది. మరోవైపు టీమిండియా బుధవారం అఫ్ఘానిస్థాన్ తో తమ రెండో మ్యాచ్ ఆడనుంది. దీంతో అన్ని జట్లూ తలా రెండు మ్యాచ్ లు ఆడినట్లు అవుతుంది.

బోణీ ఘనం

ఈ నెల 5న మొదలైన ప్రపంచ కప్ లో తొలి మ్యాచ్ లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ తలపడ్డాయి. అందులో న్యూజిలాండ్ అద్భుత విజయం సాధించింది. ఇంగ్లండ్ ను 280 పరుగులకే కట్టడి చేసింది. ఆపై ఓపెనర్ డెవాన్ కాన్వే, వన్ డౌన్ లో వచ్చిన భారత సంతతి ఆటగాడు రచిన్ రవీంద్ర అద్భుత సెంచరీలతో ఇంగ్లండ్ ను మట్టికరిపించారు. దీంతో డిఫెండింగ్ చాంపియన్, హట్ ఫేవరెట్ అయిన ఇంగ్లండ్ కు పెద్ద షాక్ తగిలింది. ఈ నేపథ్యంలోనే ఓ సెంటిమెంట్ ను క్రీడా విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు.

సెంచరీ కొట్టి.. కప్ కొట్టి

ప్రపంచ కప్ లో ఓ సెంటిమెంట్ ఉందట. అదేమంటే.. టోర్నీ తొలి మ్యాచ్ లో సెంచరీ చేసిన జట్టునే కప్ వరిస్తుందని చెబుతారు. చివరి నాలుగు కప్ లలో ఇలాగే జరిగింది. 2007లో ఆసీస్ నాటి కెప్టెన్ రికీ పాంటింగ్ స్కాట్లాండ్ పై చెలరేగి ఆడి మూడంకెల స్కోరు చేశాడు. 2011లో బంగ్లాదేశ్ పై భారత డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, 2015లో ఆసీస్ ఓపెనర్ ఫించ్, 2019లో ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ రూట్ సెంచరుల కొట్టాడు. ఈ మూడుసార్లూ ఆయా జట్లే ప్రపంచ కప్ నెగ్గాయి. మరి ఈ లెక్కన ఈసారి న్యూజిలాండ్ విజేతగా ఆవిర్భవిస్తుందని విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు.

కొసమెరుపు: ప్రధాన జట్లలో ఇప్పటివరకు ప్రపంచ కప్ నెగ్గనిది న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా మాత్రమే. గత కప్ ముందు వరకు ఇంగ్లండ్ కూడా ఈ జాబితాలో ఉండేది. కాగా, న్యూజిలాండ్ 2015, 2019లో ప్రపంచ కప్ ఫైనల్స్ కు చేరింది. రన్నరప్ గానే మిగిలిపోయింది. పలుసార్లు సెమీస్ వరకు వచ్చినా.. ముందుకెళ్లలేకపోయింది. గత ప్రపంచ కప్ ఫైనల్లో అయితే.. మరీ బ్యాడ్ లక్. స్కోర్లు టై అయి.. సూపర్ ఓవర్ లోనూ టై అయి.. కేవలం బౌండరీల సంఖ్య పరంగా ఇంగ్లండ్ కు కప్ కోల్పోయింది. మరి ఈసారి అలాంటిదేమీ లేకుండా నేరుగా ప్రపంచ కప్ విజేతగా నిలుస్తుందా..? చూద్దాం.. ఏం రుగుతుందో?

Tags:    

Similar News