బంగ్లాదేశ్ కంట్లో దుమ్ముకొట్టేలా భారత్ వ్యూహం

బంగ్లాదేశ్ జట్టులో ముగ్గురు, నలుగురు మంచి బ్యాట్స్ మెన్ ఉన్నారు.

Update: 2024-09-15 22:30 GMT

ప్రత్యర్థి చెలరేగుతుంటే ఏంచేయాలి..? అతడి లోటుపాట్లు తెలుసుకోవాలి.. అవతలి పక్షం దూకుడుగా ఉంటే ఏం చేయాలి..? వారికి అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నించాలి.. ఇప్పుడు టీమ్ ఇండియా టెస్టు మ్యాచ్ లలో ఇదే అస్త్రం బయటకు తీయనుంది. బంగ్లాదేశ్ తో ఈ నెల 19 నుంచి తొలి టెస్టు మొదలుకానుంది. సంప్రదాయంగా స్పిన్ కు అనుకూలించే చెన్నైలో టెస్టు మ్యాచ్. ఈ లెక్కన భారత్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలో దిగాలి. గతంలో ఆస్ట్రేలియా నుంచి అఫ్ఘానిస్థాన్ వరకు ఇదే ఆనవాయితీని పాటించింది. కానీ... ఇప్పుడు బంగ్లాదేశ్ ను ‘మట్టి’ కరిపించేందుకు వ్యూహాలు పన్నుతోంది.

ఆరు నెలల తర్వాత రిస్క్ లేకుండా..

బంగ్లాదేశ్ ఇటీవల పాకిస్థాన్ లో పర్యటించి ఆ దేశ జట్టును 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. బంగ్లా స్పిన్నర్లు, పేసర్లు మంచి ప్రదర్శన కనబర్చడంతో తమ కంటే మెరుగైన పాక్ ను వారి గడ్డపైనే ఓడించింది. ఇప్పుడు భారత్ కు సవాల్ విసిరేందుకు వచ్చింది. ఆదివారం చెన్నై చేరుకున్న బంగ్లా జట్టును తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. పైగా ఆరు నెలల విరామం తర్వాత టెస్టులు ఆడుతున్న టీమ్ ఇండియా ఎందుకైనా మంచిదని రిస్క్ లేకుండా ఆలోచన చేస్తోంది.

ఇప్పుడు ప్రయోగం.. మున్ముందు ఉపయోగం

బంగ్లాదేశ్ జట్టులో ముగ్గురు, నలుగురు మంచి బ్యాట్స్ మెన్ ఉన్నారు. వీరిని అడ్డుకోవడం భారత స్పిన్నర్లకు తేలికే. కానీ, వారిప్పుడు ఫామ్ లో ఉండడంతో కొత్త ఆలోచన చేస్తోంది. సహజంగా భారత్ లో టెస్టులంటే పిచ్ లు స్పిన్ కు అనుకూలంగా ఉంటాయి. అయితే, బంగ్లా స్పిన్నర్లూ మెరుగైన వారే. షకిబుల్ హసన్, మెహదీ హసన్ మిరాజ్ పాకిస్థాన్ ను ప్రపంచస్థాయి స్పిన్నర్లు. పిచ్ లు ఎప్పటిలాగానే ఉంటే వీరు భారత బ్యాట్స్ మెన్ కు సవాల్ విసురుతారు. దీంతో టీమ్ ఇండియా కొత్త వ్యూహం పన్నింది. బంగ్లాదేశ్‌ బ్యాటర్లకు అడ్డుకట్ట వేసేందుకు సూపర్‌ ప్లాన్‌ వేసింది.

ఎర్రమట్టితో కొట్టేందుకు..

19 నుంచి జరిగే తొలి టెస్టుకు ఆతిథ్యం ఇచ్చే ఎంఏ చిదంబరం స్టేడియంలోని పిచ్ ను ఎర్రమట్టితో తయారు చేయిస్తున్నట్ల సమాచారం. ఇక్కడ

నల్లమట్టితో చేసిన పిచ్‌ ను వాడుతుంటారు. ఇవి మందకొడిగా ఉంటాయి. స్పిన్‌ కు అనుకూలిస్తాయి. ఇదే జరిగితే బంగ్లా బ్యాటర్లు మన స్పిన్నర్లను తేలిగ్గా ఆడేస్తారు. వారి నాణ్యమైన స్పిన్‌ బౌలింగ్ మనను దెబ్బకొట్టొచ్చు. దీంతోనే ఎర్రమట్టి పిచ్‌ ను రూపొందిస్తున్నారు. ఇలాంటి పిచ్‌ లు ఆట సాగుతున్న కొద్దీ పేసర్లు, స్పిన్నర్లకూ అనుకూలిస్తాయి. ఫాస్ట్ బౌలర్ల కు చక్కటి బౌన్స్‌ లభిస్తుంది. బుమ్రా, సిరాజ్‌, ఆకాశ్‌ దీప్‌ వంటి బౌలర్లతో బంగ్లా బ్యాట్స్ మెన్ పని పట్టొచ్చని చూస్తోంది. నవంబరు నుంచి ఆస్ట్రేలియాలో జరిగే ఐదు టెస్టుల బోర్డర్-గావస్కర్‌ ట్రోఫీకి కూడా ఇది సన్నాహకంగా ఉంటుందని టీమ్‌ ఇండియా భావిస్తోంది. అయితే, బంగ్లా జట్టులో నహీద్ రాణా అనే 21 ఏళ్ల కుర్రాడు అద్భుతంగా బంతులేస్తున్నాడు. 150 కిలోమీటర్లను టచ్ చేస్తూ వికెట్లు తీస్తున్నాడు. ఎర్ర మట్టి పిచ్ పై ఇతడిని కోహ్లి, రోహిత్, జైశ్వాల్, రాహుల్, పంత్ వంటి భారత బ్యాట్స్ మెన్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

Tags:    

Similar News