చదరంగ చాంపియన్ కు 'పన్ను' పోటు.. 11 కోట్లలో 4 కోట్లు ట్యాక్స్ కే..
అత్యంత చిన్న వయసులో చాంపియన్ అయిన రికార్డును మూట గట్టుకున్నాడు.
విశ్వనాథన్ ఆనంద్ తర్వాత మరే భారత చదరంగ క్రీడాకారుడికీ సాధ్యం కాని ఘనతను సొంతం చేసుకున్నాడు తమిళనాడులో స్థిరపడిన తెలుగు మూలాలున్న 18 ఏళ్ల కుర్రాడు గుకేశ్ దొమ్మరాజు. అదే.. ప్రపంచ చాంపియన్ గా నిలవడం.. కోనేరు హంపి, పెంట్యేల హరిక్రిష్ణ, ద్రోణవల్లి హారిక వంటివారు ఎంతో పేరు ప్రఖ్యాతులు సాధించినా చెస్ ప్రపంచ చాంపియన్ లుగా మాత్రం నిలవలేకపోయారు. అయితే, గుకేశ్ 18 ఏళ్లకే దానిని సొంతం చేసుకున్నాడు. అత్యంత చిన్న వయసులో చాంపియన్ అయిన రికార్డును మూట గట్టుకున్నాడు.
తమిళ సర్కారు రూ.5 కోట్ల నజరానా
గుకేశ్ పూర్వీకులది ఏపీలోని చిత్తూరు జిల్లా. అయితే, వారు చెన్నైలో స్థిరపడ్డారు. ఇపుడు గుకేశ్ తమిళుడే అనుకోవాలి. తమ రాష్ట్రానికి చెందిన కుర్రాడు ప్రపంచ చాంపియన్ గా నిలవడంతో గుకేశ్ కు తమిళనాడు సర్కారు రూ.5 కోట్ల నజరానా ప్రకటించింది.
ప్రపంచ చాంపియన్ కు రూ.11.34 కోట్లే..
చదరంగం మేధో క్రీడ. అంటే మైండ్ తో ఆడేది. సాధారణ క్రీడల కంటే భిన్నం. దీంతోనే దీనిని చాలా తక్కువ మంది కెరీర్ గా ఎంచుకుంటారు. భారత్ లో మాత్రం విశ్వనాథన్ ఆనంద్ ప్రభావంతో గత 30 ఏళ్లలో ఎంతో ప్రాచుర్యం పొందింది. ఇక మరే ఇతర క్రీడలో అయినా ప్రపంచ చాంపియన్లు గా నిలిచేవారికి రూ.వందల కోట్లలో ప్రైజ్ మనీ ఉంటుంది. లేదా కనీసం రూ.50 కోట్ల వరకైనా దక్కుతాయి. అయితే, చెస్ విజేత గుకేశ్ కు రూ.11.54 కోట్లు మాత్రమే దక్కనున్నాయి.
పన్ను కిందనే రూ.4.67 కోట్లు
గుకేశ్ కు వచ్చిన రూ.11.54 కోట్లలో పన్ను కిందనే అతడు రూ.4.67 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. వాస్తవ పన్ను రూ.3 కోట్లు కాగా.. ఇతర సర్ చార్జీలు రూ.1.67 కోట్లు అట. దీంతో ప్రైజ్ మనీలో రూ.4.67 కోట్లు పోనున్నాయి. అయితే, ఇక్కడే ఒక మెలిక ఉంది. గుకేశ్ నికర ఆస్తి రూ.21 కోట్లకు పెరగడంతో అతడు చెల్లించాల్సిన పన్నును 30 శాతం శ్లాబ్ లో లెక్కేశారు. అందుకే పెద్దమొత్తంలో చెల్లించాల్సి వస్తోంది. మరి.. ప్రభుత్వాలు నజరానాలే కాదు.. ఇంకేమైనా పన్ను మినహాయింపులు ఇస్తాయేమో? చూడాలి.