500 వికెట్ల టీమ్ ఇండియా సీనియర్ ఆఫ్ స్పిన్నర్ అనూహ్య రిటైర్మెంట్

అంతర్జాతీయ క్రికెట్‌ కు టీమ్‌ ఇండియా సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్‌ రిటైర్‌ మెంట్ ప్రకటించాడు.

Update: 2024-12-18 07:02 GMT

భారత క్రికెట్ లో దిగ్గజ ఆటగాళ్ల నిష్క్రమణ పరంపర కొనసాగుతోంది.. టి20 ప్రపంచ కప్ గెలిచిన అనంతరం స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లి, కెప్టెన్ రోహిత్ శర్మ, మేటి ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాలు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. మరోవైపు రోహిత్ శర్మ ఇప్పటికే టెస్టులకు వీడ్కోలు పలుకుతాడనే ఊహాగానాలు వస్తున్నాయి. అయితే, దీనికి భిన్నంగా టీమ్ ఇండియా సీనియర్ ఆఫ్ స్పిన్నర్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగాడు.

మరో రెండేళ్లు ఆడతాడనుకుంటే?

అంతర్జాతీయ క్రికెట్‌ కు టీమ్‌ ఇండియా సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్‌ రిటైర్‌ మెంట్ ప్రకటించాడు. గబ్బాలో ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్ ముగిసిన అనంతరం వెల్లడించాడు. 38 ఏళ్ల అశ్విన్ 106 టెస్టుల్లో 537 వికెట్లు పడగొట్టాడు. 116 వన్డేల్లో 156 వికెట్లు, 65 టి20ల్లో 72 వికెట్లు తీశాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. దిగ్గజ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే (619) టాప్ లో ఉన్నాడు. వాస్తవానికి అశ్విన్ మరో దాదాపు రెండేళ్ల వరకైనా అంతర్జాతీయ క్రికెట్ లో కొనసాగుతాడని అనుకున్నారు. కానీ, అనూహ్యంగా నిర్ణయం తీసుకున్నాడు.

ఎందుకని ఈ నిర్ణయం?

అశ్విన్ అకస్మాత్తుగా నిర్ణయం తీసుకోవడానికి కారణం.. అతడు కొంతకాలంగా వికెట్లు తీయడంలో వెనుకబడ్డాడు. ఈ నెల 6 నుంచి జరిగిన గులాబీ టెస్టులో ఆడించినప్పటికీ మెరుగైన ప్రదర్శన చేయలేదు. న్యూజిలాండ్ తో మూడు టెస్టుల సిరీస్ లో 6 ఇన్నింగ్స్ లో 9 వికెట్లు మాత్రమే తీశాడు. దీంతోనే అశ్విన్ పని అయిపోయిందనే విమర్శలు వచ్చాయి. దీనికితోడు వయసు కూడా మీద పడింది. ఈ నేపథ్యంలోనే రిటైర్మెంట్ ఇచ్చినట్లు స్పష్టం అవుతోంది.

అశ్విన్ 2017 చాంపియన్స్ ట్రోఫీ తర్వాత వన్డే జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా లేడు. అడపాదడపా వన్డే జట్టులోకి వచ్చి పోతున్నాడు. 2023లో చివరి వన్డే ఆడాడు. 2022లో చివరిగా టి20ల్లో ప్రాతినిధ్య వహించాడు. అయితే, టి20ల్లో చాలా కాలం కిందటే అతడిని పక్కనపెట్టారు. టెస్టుల్లోనూ ప్రదర్శన పడిపోవడంతో రిటైర్మెంట్ ప్రకటించేశాడు.

Tags:    

Similar News