టీమిండియా కు జర్వం..? జట్టులో 13 మందే.. అవసరమైతే రంజీ వాళ్లూ?

టీమిండియా అంటే ఇప్పుడు ఒక జట్టు కాదు.. కనీసం మూడు జట్లు. ఆసియా కప్ నకు ఒక జట్టు.. ఆసియా క్రీడలకు ఒక జట్టు.. ప్రపంచ కప్ నకు ఒక జట్టు

Update: 2023-09-27 07:05 GMT

టీమిండియా అంటే ఇప్పుడు ఒక జట్టు కాదు.. కనీసం మూడు జట్లు. ఆసియా కప్ నకు ఒక జట్టు.. ఆసియా క్రీడలకు ఒక జట్టు.. ప్రపంచ కప్ నకు ఒక జట్టు.. అంతర్జాతీయ స్థాయిలో ఒకేసారి రెండు మూడు జట్లను ఎంపిక చేయగల సత్తా భారత్ సొంతం. దీనికి నిదర్శమనే.. ఆసియా క్రీడల్లో ఒక జట్టు తలపడుతుండగా.. ప్రపంచ కప్ లో ప్రధాన జట్టు బరిలో దిగుతోంది.

టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ చివరి మ్యాచ్ ఆడుతోంది. ప్రపంచ కప్ ముంగిట ఈ సిరీస్ మంచి సన్నాహకం అనడంలో సందేహం లేదు. అయితే, మూడో, చివరి వన్డే ముంగిట టీమిండియాకు వింతైన అనుభవం ఎదురవుతోంది.

17 కాదు.. 13

ఆసీస్ తో మూడు వన్డేల సిరీస్ కు 17 మంది సభ్యులతో టీమిండియాను ఎంపిక చేశారు. వీరిలో రుతురాజ్ గైక్వాడ్ ఆసియా క్రీడల జట్టు కెప్టెన్ గా వెళ్లనున్నాడు. హైదరాబాదీ తిలక్ వర్మ కూడా అదే జట్టులో ఉన్నాడు. దీంతో వీరిద్దరినీ మూడో వన్డేకు తప్పించారు. కాగా, తొలి రెండు వన్డేలకు కెప్టెన్ రోహిత్‌ శర్మ, స్టార్ బ్యాట్స్ మన్ కోహ్లి, చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కు విశ్రాంతి ఇచ్చిన సంగతి తెలిసిందే. వీరంతా మూడో వన్డేకు తిరిగొచ్చారు. కాగా, జట్టు సభ్యులను వైరల్ జ్వరాలు వణికిస్తున్నట్లుగా తెలిసింది. దీంతో రాజ్ కోట్ లో మూడో వన్డేకు 13 మంది ఆటగాళ్లు మాత్రమే సెలక్షన్ కు అందుబాలో ఉన్నారు.

ఎంతమందికో జ్వరం?

యువ ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్‌ ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో ఆడాడు. ప్రపంచ కప్ ముంగిట అతడికి కాస్త విశ్రాంతి ఇచ్చే ఉద్దేశంలో మూడో వన్డే నుంచి తప్పించారు. కాగా, జ్వరంతో చాలా మంది ఆటగాళ్లు అందుబాటులో లేనట్లు తెలుస్తోంది. ఎంతమంది అనేది తెలియడం లేదు. పేసర్లు షమి, శార్దూల్‌, హార్దిక్‌ పాండ్య ఇళ్లకు వెళ్లిపోయారు. దీనికి వ్యక్తిగత కారణాలను చెబుతున్నారు. మరికొందరికి రెస్ట్ ఇచ్చినట్లు సమాచారం.

సౌరాష్ట్ర ఆటగాళ్లతో..

ఒకే సమయంలో మూడు నాలుగు జట్లను తయారు చేయగల టీమిండియా ఇప్పుడు బొటాబొటిగా 13 మందితో ఉండడం కాస్త ఆశ్చర్యకరమే. తుది 11 మందిగా అనుకుంటున్న వారిలో ఎవరికైనా గాయమో, అస్వస్థతో కలిగితే.. కూర్పును పక్కనపెట్టి మిగతా ఇద్దరిలో ఒకరిని ఆడించాలి. అందుకని రాజ్ కోట్ వన్డేకు ఎందుకైనా మంచదని సౌరాష్ట్ర ఆటగాళ్లను అందుబాటులో ఉంచినట్లు తెలుస్తోంది. దీని ఉద్దేశం అసలు మ్యాచ్ కు కాకపోయినా.. నెట్ ప్రాక్టీస్ కు అయినా ఉపయోగపడతారని.

Tags:    

Similar News