ఆస్ట్రేలియాకు ‘గులాబీ’ ముల్లు.. కీలక పేస్ బౌలర్ ఔట్

దీంతో డే-నైట్ టెస్టు మ్యాచ్ ప్రతిపాదన తెచ్చారు. మరి నైట్ టైమ్ బంతి మరింత స్పష్టంగా కనింపిచాలంటే.. అందుకని ‘గులాబీ’ బంతి ప్రయోగం మొదలుపెట్టారు.

Update: 2024-11-30 09:30 GMT

టెస్టు క్రికెట్ లో కొన్నాళ్ల కిందట స్తబ్ధత నెలకొంది.. ఆరేడేళ్ల కిందట మ్యాచ్ లు పూర్తిగా ఏకపక్షంగా సాగడమో.. లేదా నిస్సారమైన డ్రా కావడమో జరిగింది.. దీంతో సంప్రదాయ ఫార్మాట్ పై ప్రజలకు ఆసక్తి సన్నగిల్లింది.. ఇలాగైతే క్రికెట్ పునాదులే దెబ్బతింటాయనే ఆందోళన వ్యక్తమైంది. దీంతో డే-నైట్ టెస్టు మ్యాచ్ ప్రతిపాదన తెచ్చారు. మరి నైట్ టైమ్ బంతి మరింత స్పష్టంగా కనింపిచాలంటే.. అందుకని ‘గులాబీ’ బంతి ప్రయోగం మొదలుపెట్టారు. అంటే టెస్టుల్లో వైట్ బాల్ కు బదులు.. పింక్ బాల్ తో తో ఆడడం అన్నమాట. ఇప్పటివరకు భారత్ 4 గులాబీ టెస్టులు ఆడింది. వీటిలో మూడు గెలిచింది.

మొదటే 36కు ఆలౌట్

నాలుగేళ్ల క్రితం ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌ లో తొలిసారిగా పింక్ బాల్ టెస్టు ఆడింది భారత్. కానీ.. అదో పీడకల. ఆ మ్యాచ్‌ లో చరిత్రలో అత్యంత తక్కువ స్కోరు 36కే ఆలౌటైంది. ఈ పతనంలో కీలక పాత్ర పోషించాడు ఆసీస్ పేస్ బౌలర్ జోష్ హేజిల్ ఉడ్. అయితే, మళ్లీ ఇప్పుడు డిసెంబరు 6 నుంచి గులాబీ టెస్టు జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కు హేజిల్ ఉడ్ అందుబాటులో ఉండడం లేదు.

పెర్త్ పరాభావం మాటున..

ప్రస్తుత సిరీస్ లో తొలి టెస్టు జరిగిన పెర్త్ లో ఆసీస్ 295 పరుగుల తేడాతో భారత్ చేతిలో ఓడింది. ఆస్ట్రేలియా గడ్డపై మన జట్టుకు ఇదే అతిపెద్ద విజయం. దీనినుంచి కోలుకోవాలంటే వారికి అడిలైడ్ టెస్టు ఓ అవకాశం. కానీ, హేజిల్‌ ఉడ్‌ గాయం పెద్ద దెబ్బే. అతడికి నడుము కింది భాగంలో నొప్పి మొదలైంది. దీంతో వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. హేజిల్ ఉడ్ ఆరోగ్యం మెరుగవకుంటే మొత్తం సిరీస్‌ కే దూరమయ్యే అవకాశం ఉంది.

ముగ్గురిలో బెస్ట్ ఇతడే..

హేజిల్ ఉడ్ పెర్త్‌ టెస్టులో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్, స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ కంటే హేజిల్ ఉడ్ ప్రభావవంతంగా బౌలింగ్ చేశాడు. ఐదు వికెట్లు తీశాడు. 6 అడుగులకు మించిన ఎత్తుతో ఉండే హేజిల్ ఉడ్ కచ్చితంగా పింక్ బాల్ టెస్టులో కీలకం. పేస్ తో పాటు లైన్ అండ్ లెంగ్త్ తో వికెట్లు తీస్తుంటాడు. ఇప్పుడు హేజిల్ ఉడ్ దూరం కావడంతో సీన్ అబాట్, డొగ్గెట్‌ లను క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసింది. ప్రైమ్‌ మినిస్టర్స్‌ ఎలెవన్ లో ఉన్న బోలాండ్‌ కూడా ఆసీస్‌ టీమ్ లో ఉన్నాడు. రెండో టెస్టు తుది జట్టులో ఇతడికే అవకాశాలు ఎక్కువ అని అంటున్నారు.

Tags:    

Similar News