5 వికెట్లతో కివీస్ బౌలర్ రికార్డ్... ఒక్క బంతికి 13 పరుగులు కూడా..!
ప్రపంచం కప్ లో భాగంగా నెథర్లాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ ఒక్క బంతిలో 13 పరుగులు రాబట్టాడు.
స్లోగా స్టారయినప్పటికీ... ప్రపంచకప్ లో రసవత్తర గట్టాలకు తెరలేచింది. ఇప్పటికే సఫారీలు రికార్డులు నెలకొల్పితే, ఆస్ట్రేలియా - ఇండియా మ్యాచ్ రసవత్తరంగా సాగింది. ఇదే సమయంలో న్యూజిలాండ్ వరుసగా రెండో విక్టరీనీ సాధించింది. ఇందులో భాగంగా మొదటి మ్యాచ్ లో ఇంగ్లాండ్ ను ఓడించిన కివీస్ జట్టు... రెండో మ్యాచ్ లో నెదర్లాండ్ పై గెలిచింది.
అవును... న్యూజిలాండ్ - నెథర్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్.. విల్ యంగ్ (70), రచిన్ రవీంద్ర (51), టాం లాథం (53) అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన నెదార్లండ్స్ ఆదిలోనే చేతులెత్తేసింది.. ఫలితంగా.. 46.3 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌటైంది.
నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ లో కొలిన్ ఆకెర్మన్ (69) ఒక్కడే అర్ధసెంచరీతో రాణించాడు. తెలుగబ్బాయి తేజ నిడమనూరు 26 బంతుల్లో 21 పరుగులు చేసి రనౌటయ్యాడు. అంతకముందు కివీస్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్ చరిత్ర సృష్టించాడు. ప్రపంచకప్ లో ఐదు వికెట్ల ఘనత సాధించిన తొలి న్యూజిలాండ్ స్పిన్నర్ గా రికార్డ్ సృష్టించాడు.
హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో 59 పరుగులకు 5 వికెట్లు పడగొట్టిన సాంట్నర్.. బ్యాట్ తోనూ రాణించాడు. ఇందులో భాగంగా 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 17 బంతుల్లో 36 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు. ఫలితంగా... ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.
ఒక్క బంతికి 13 పరుగులు:
ప్రపంచం కప్ లో భాగంగా నెథర్లాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ ఒక్క బంతిలో 13 పరుగులు రాబట్టాడు. అదెలా అంటే... న్యూజిలాండ్ కు చెందిన మిచెల్ సాంట్నర్ ఇన్నింగ్స్ చివరి బంతికి బాస్ డి లీడ్ వేసిన ఫుల్ టాస్ ను సిక్సర్ బాదాడు. దీంతో పాటు ఆ బంతి నడుము ఎత్తు కంటే ఎక్కువగా ఉండడంతో అంపైర్ నో బాల్ గా ప్రకటించారు.
అనంతరం ఫ్రీ డెలవరీ కూడా వచ్చింది. అప్పటికే కొట్టిన 6 + 1 ఎక్స్ ట్రా పరుగుతో పాటు... ఆ ఫ్రీ డెలివరీని కూడా సిక్స్ గా మలిచాడు. దీంతో న్యూజిలాండ్ చివరి బంతికి మొత్తం 13 పరుగులు చేసినట్లయ్యింది.
రెండు టీం లలోనూ నలుగురు మనోళ్లే:
ప్రపంచ కప్ లో భాగంగా జరిగిన న్యూజిలాండ్ - నెదర్లాండ్ మ్యాచ్ లో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... ఇరువైపులా భారత్ సంతతికి చెందిన నలుగురు ప్లేయర్లు బరిలోకి దిగారు. వీరిలో ఒకరు న్యూజిలాండ్ తరుపున ఆడగా.. ముగ్గురు ప్లేయర్ లు నెదర్లాండ్ కు ఆడారు.
అవును... సోమవారం ఉప్పల్ లో జరిగిన మ్యాచ్ లో భారత సంతతికి చెందిన రచిన్ రవీంద్ర న్యూజిలాండ్ తరుపున ఆడగా... నెదర్లాండ్ తరుపున ఆడిన తేజ నిడమనూరు, విక్రం జిత్ సింగ్, ఆర్యన్ దత్ లు భారత సంతతికి చెందిన వ్యక్తులు కావడం గమనార్హం.
వీరిలో రచిన్ రవీంద్ర ది బెంగళూరు కాగా... విక్రం జిత్, ఆర్యన్ లు ఇద్దరూ పంజాబ్ రాష్ట్రానికి చెందినవారు. ఇక తేజ నిడమనూరు ది విజయవాడ!