కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్... లక్నో "సూపర్" విక్టరీ!
ప్రధానంగా లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ దూకుడు ముందు చెన్నై బౌలర్లు తేలిపోవాల్సిన పరిస్థితి ఎదురైంది
ఐపీఎల్-17లో భాగంగా జరిగిన రసవత్తరమైన మ్యాచ్ లో చెన్నైకి ఊహించని షాక్ ఇచ్చింది లక్నో. చాలామంది అంచనాలను తలకిందులు చేస్తూ చెన్నైకి ముచ్చెమటలు పట్టించింది. ప్రధానంగా లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ దూకుడు ముందు చెన్నై బౌలర్లు తేలిపోవాల్సిన పరిస్థితి ఎదురైంది. దీంతో... చెన్నై సూపర్ కింగ్స్ పై లక్నో సూపర్ విక్టరీ సాధించింది.
అవును... ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా జరిగిన ఆసక్తికర మ్యాచ్ లో చెన్నైకి లక్నో షాకిచ్చింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన చెన్నైకి సరైన ఆరంభం లభించలేదు. పవర్ ప్లేలో రహానె ధాటిగా ఆడినా.. మరో ఎండ్ లో వికెట్లు పడడంతో చెన్నైకి కష్టాలు తప్పలేదు. రహానె ఔటయ్యాక రవీంద్ర జడేజా ఇన్నింగ్స్ ను నిలబెట్టగా.. చివర్లో మొయిన్ అలీ, ధోనిల మెరుపులతో చెన్నై ఫైటింగ్ స్కోరు చేయగలిగింది.
రచిన్ రవీంద్ర (0), కెప్టెన్ రుతురాజ్ (17) లు త్వరగా పెవిలియన్ కు చేరడంతో ఊహించని కష్టాల్లో పడిన చెన్నైకి జడేజా, రహానేలు చక్కని సహకారాన్ని అందించారు. దీంతో పవర్ ప్లే ముగిసేసరికి రెండు వికెట్లు కోల్పోయిన చెన్నై 51 పరుగులు చేయగలిగింది. అయితే... కాసేపటికే రహానె, సూపర్ ఫామ్ లో ఉన్న దూబె (3), ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన రిజ్వి (1) కూడా వెంట వెంటనే ఔటవ్వడంతో చెన్నై 90 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్లో పడింది.
అయితే అప్పటికే క్రీజులో కుదురుకున్న జడేజా.. మొయిన్ అలీతో కలిసి మళ్లీ ఇన్నింగ్స్ ను గాడిన పెట్టాడు. తర్వాత వచ్చిన ధోని తనదైన శైలిలో చెలరేగిపోవడంతో చెన్నై 176 పరుగులు చేసింది. చెన్నై బ్యాటర్స్ లో రవీంద్ర జడేజా (57 నాటౌట్: 40 బంతుల్లో 5×4, 1×6)) రహానె (36: 24 బంతుల్లో 5×4, 1×6), మొయిన్ అలీ (30: 20 బంతుల్లో 3×6), ధోని (28 నాటౌట్: 9 బంతుల్లో 3×4, 2×6) కూడా కీలక ఇన్నింగ్స్ లు ఆడారు.
అనంతరం 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో తనకు భిన్నమైన శైలిలో ఆడుతూ చెన్నై బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. డికాక్ దూకుడు తగ్గించి జాగ్రత్తగా ఆడితే.. రాహుల్ మాత్రం భారీ షాట్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో దీపక్ చాహర్ ను లక్ష్యంగా చేసుకుని ఫోర్లు, సిక్సర్ల మోత మోగించాడు. ఈ క్రమంలో 32 బంతుల్లోనే రాహుల్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.
ఇదే క్రమంలో డికాక్ 41 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా.. లక్నో వికెట్లేమీ నష్టపోకుండా 134 పరుగులు చేసింది. అనంతరం 5.1 ఓవర్లలో 43 పరుగులే చేయాల్సిన స్థితిలో డికాక్ ఔటైనా.. పూరన్ (23 నాటౌట్: 12 బంతుల్లో 3×4, 1×6)తో కలిసి రాహుల్ జట్టును విజయానికి చేరువ చేశాడు. ఇక, 3 ఓవర్లలో 16 పరుగులే చేయాల్సిన స్థితిలో రాహుల్ వెనుదిరిగినా.. స్టాయినిస్ (8 నాటౌట్)తో కలిసి పూరన్ పని పూర్తి చేశాడు.
లక్నో బ్యాటర్స్ లో కేఎల్ రాహుల్ (82: 53 బంతుల్లో 9×4, 3×6) కెప్టెన్ ఇన్నింగ్స్ కు డికాక్ (54: 43 బంతుల్లో 5×4, 1×6) సహకారం అందించడంతో లక్నోకు సూపర్ విక్టరీ సాధ్యమైంది.