గెలిచాడు ఫలితం రద్దు ఒలింపిక్స్ లో భారత షట్లర్ కు వింత అనుభవం

బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ లో అతడు గ్రూప్ దశలో గెలిచిన మ్యాచ్ ఫలితం రద్దయింది.

Update: 2024-07-29 07:44 GMT

క్రికెట్ లోనో.. మరేదైనా గేమ్ లోనో.. ఎక్కడైనా మ్యాచ్ రద్దవడం చూశాం..కానీ ఒలింపిక్స్ లో అనూహ్యంగా మ్యాచ్ ఫలితమే రద్దు చేశారు.

ఒలింపిక్స్ అంటే.. ప్రపంచ క్రీడా సంగ్రామం.. అత్యున్నత ప్రమాణాల మైదానాలు.. అత్యంత ప్రతిభావంతులైన ఆటగాళ్లు పోటీ పడే వేదిక.. ఇలాంటిచోట సెకనులో ఫలితాలు మారిపోతాయి. క్షణాల్లో అంచనాలు తారుమారు అవుతాయి. అయితే.. నిర్వహణ పరంగా కట్టుదిట్టంగా సాగుతాయి ఒలింపిక్స్. కానీ, పారిస్ ఒలింపిక్స్ లో భారత స్టార్ షట్లర్ కు మాత్రం వింత అనుభవం ఎదురైంది. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ లో అతడు గ్రూప్ దశలో గెలిచిన మ్యాచ్ ఫలితం రద్దయింది.

భారత స్టార్‌ షట్లర్‌ లక్ష్య సేన్‌ కు కాస్త నిరాశ. గ్రూప్ దశలో అతడు గెలిచిన మ్యాచ్ లో.. ప్రత్యర్థి ఆటగాడు గాయపడడడంతో ఫలితాన్ని రద్దు చేశారు. లక్ష్య శనివారం తొలి మ్యాచ్‌లో గ్వాటెమాలా ఆటగాడు కెవిన్‌ కార్డన్‌ పై గెలిచాడు. 21-8, 22-20తో సులువుగా నెగ్గాడు. మ్యాచ్‌ తర్వాత కెవిన్‌ ఎడమ మోచేతి గాయం కారణంగా ఒలింపిక్స్‌ నుంచి వైదొలగాడు. ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఫెడరేషన్‌ జనరల్‌ కాంపిటీషన్‌ రూల్స్ మేరకు.. గ్రూప్‌ దశలో ఆటగాడు ఎవరైనా గాయపడి టోర్నీ నుంచి తప్పుకొంటే వాళ్లు ఆడిన లేదా ఆడాల్సిన మ్యాచ్‌ లను లెక్కలోకి తీసుకోరు. ఆ ఫలితాలను టోర్నీ నుంచి తొలగిస్తారు. అలా లక్ష్యసేన్‌ తొలి విజయం అందినట్లే అంది చేజారింది. మరోవైపు కెవిన్‌ ఇంకో రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. వాటిని రద్దు చేశారు.

ఒకటి రద్దు.. ముందు రెండు

లక్ష్య గ్రూప్ ఎల్ లో ఉన్నాడు. కెవిన్ వైదొలగడంతో ఈ గ్రూప్ లో ముగ్గురు ఆటగాళ్లే మిగిలారు. లక్ష్య సోమవారం బెల్జియంకు చెంది జులియన్‌ కరాగీని ఎదుర్కొంటాడు. బుధవారం ఇండోనేషియా షట్లర్‌ జొనాతన్‌ క్రిస్టీతో తలపడతాడు. అంటే.. మూడు మ్యాచ్ లూ ఆడనున్నట్లు. ఈ గ్రూప్ లో అతడొక్కడే మూడు మ్యాచ్ లలో ఆడుతున్నాడు. కెవిన్ వైదొలగడంతో మిగతా ఇద్దరికీ ఆ చాన్స్ లేదు. కానీ.. ర్యాంకింగ్స్‌ ను బట్టి టాప్‌ లో ఉన్నవారే తర్వాతి రౌండ్ కు వెళ్తారు.

డబుల్స్ లో రద్దు..

లక్ష్యకు ఓ విధమైన పరిస్థితి ఎదురవగా.. బ్యాడ్మింటన్‌ పురుషుల డబుల్స్‌ లో భారత షట్లర్లు సాత్విక్‌ సాయిరాజ్-చిరాగ్ శెట్టి రెండో మ్యాచ్‌ రద్దయింది. వీరు సోమవారం మార్క్‌ లమ్స్‌ఫస్‌-మార్విన్‌ సీడెల్‌ తో ఆడాల్సి ఉంది. మోకాలి గాయంతో మార్క్ టోర్నీ నుంచి వైదొలిగాడు. దీంతో మ్యాచ్‌ రద్దయింది.

Tags:    

Similar News