ఒమన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) నమీబియా.. టి20 వరల్డ్ కప్ లో రికార్డు

పసికూనల మధ్య పోటీనే కదా.. మజా ఏముంటుంది? చిన్న జట్లను పెద్ద జట్లు అలవోకగా ఓడించేస్తాయి..

Update: 2024-06-03 09:24 GMT

పసికూనల మధ్య పోటీనే కదా.. మజా ఏముంటుంది? చిన్న జట్లను పెద్ద జట్లు అలవోకగా ఓడించేస్తాయి.. 20 జట్లు పోటీ పడుతున్న టి20 ప్రపంచ కప్ గురించి ప్రస్తుతం ఉన్న అభిప్రాయం ఇది. ఆదివారం పపువా న్యూ గినియా (పీఎన్జీ)తో మ్యాచ్ ను చాలా కష్టపడి గెలిచింది రెండుసార్లు చాంపియన్ అయిన వెస్టిండీస్. ఇక మొదటి రోజు ఆతిథ్య అమెరికా, దాని పొరుగున ఉండే కెనడా మధ్య జరిగిన మ్యాచ్ కూడా రసవత్తరంగానే సాగింది. కెనడా ఓ రికార్డు సృష్టించగా, మరో రికార్డును అమెరికా లిఖించింది. ఇది టి20 ప్రపంచ కప్ లో అరంగేట్రం చేస్తున్న రెండు జట్ల మధ్య అత్యధిక స్కోరింగ్ మ్యాచ్ కావడం విశేషం. మొదట కెనడా 20 ఓవర్లలో 194 పరుగులు చేసి.. అత్యధిక స్కోరు సాధించిన అసోసియేట్ దేశంగా అవతరించింది. ఇక అంతర్జాతీయ టీ20లో అమెరికా తొలిసారిగా రికార్డు లక్ష్యాన్ని ఛేదించింది. గతంలో ఆ జట్టు అంతర్జాతీయ టి20లో 195 పరుగుల కంటే పెద్ద స్కోరును ఎప్పుడూ ఛేజ్ చేయలేదు.

ఇక సోమవారం పసికూనలైన నమీబియా-ఒమన్ దేశాల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారితీయడం ఒక ఎత్తయితే.. ఇందులో ఇంకో విశేషం కూడా ఉంది. అయితే, ఓవరాల్ గా చూస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో ఒమన్ కంటే నమీబియానే కాస్త అనుభవం ఉన్న జట్టు. అయిన్పటికీ ఒమన్ పోరాడింది. ఓ దశలో గెలిచేలానూ కనిపించింది. అయితే, సూపర్ ఓవర్‌ లో తడబడి ఓడిపోయింది. ఈ ప్రపంచ కప్‌లో తొలిసారి ‘సూపర్‌ ఓవర్‌’ తో ఫలితం తేలిన మ్యాచ్‌ ఇదే.

లో స్కోర్లతో టై.. ఆపై సూపర్ ఓవర్

నమీబియాపై తొలుత బ్యాటింగ్‌ చేసిన ఒమన్‌ 19.4 ఓవర్లలో 109 పరుగులకే ఆలౌటైంది. ఖలీద్ కైల్ (34) మాత్రమే రాణించాడు. నమీబియా బౌలర్లు ట్రంపెల్మాన్ (4/21), డేవిడ్ వీజ్‌ (3/28), ఎరాస్మస్ (2/20) వెంటవెంటనే వికెట్లు పడగొట్టారు. కాగా, జాన్‌ ఫ్రైలింక్ (45), నికోలాస్‌ డేవిన్ (24) రాణించినప్పటికీ నమీబియా కూడా 20 ఓవర్లలో 109/6 స్కోరు మాత్రమే చేయగలిగింది. ఒమన్‌ బౌలర్లు సమష్ఠిగా రాణించారు. మెహ్రాన్ ఖాన్ (3/7) ప్రత్యర్థిని కట్టడి చేశాడు. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారితీసింది.

ఈ క్రమంలో తొలుత నమీబియా 21 పరుగులు చేసింది. డేవిడ్ వీజ్, ఎరాస్మస్ బరిలోకి దిగగా.. బిలాల్ ఖాన్ బౌలింగ్ చేశాడు. అయితే, సూపర్ ఓవర్‌ లో ఒమన్ బ్యాటర్లు 10 పరుగులు మాత్రమే చేయగలిగారు. ఒక వికెట్ కోల్పోయారు. డేవిడ్‌ వీజ్‌ కట్టుదిట్టంగా బంతులేసి నమీబియాను గెలిపించాడు.

ఆరుగురు వికెట్ల ముందు ఔట్

నమీబియా-ఒమన్ మ్యాచ్ లో ఆరుగురు ఒమన్ బ్యాటర్లు ఎల్బీడబ్ల్యూ అయ్యారు. ఒక మ్యాచ్ లో ఆరుగురు బ్యాటర్లు ఇలా ఔట్ కావడం ఇదే తొలిసారి. గతంలో నెదర్లాండ్స్-శ్రీలంక, స్కాట్లాండ్-ఆఫ్గాన్ మ్యాచ్ లలో ఐదుగురు నెదర్లాండ్స్, అఫ్ఘాన్ బ్యాటర్లు ఎల్బీ అయ్యారు. తాజాగా నమీబియాతో మ్యాచ్ లో భారత సంతతికి చెందిన కశ్యప్ ప్రజాపతి, అకిబ్ ఇలియాస్, జీషన్ మక్సూద్, మొహమ్మద్ నదీమ్, మెహ్రాన్ ఖాన్, కలీముల్లాలు ఎల్బీడబ్ల్యూ అయ్యారు.

Tags:    

Similar News