రచినుడు.. ప్రపంచ చాంపియన్ కు షాకిచ్చిన మనోడు

ఈ ప్రపంచ కప్ లో 500 పరుగులు కొట్టగల జట్టు ఏది..? లేదా.. టైటిల్ ఫేవరెట్ గా అందరూ ఒప్పుకొనే జట్టు ఏది..?

Update: 2023-10-05 13:30 GMT

ఈ ప్రపంచ కప్ లో 500 పరుగులు కొట్టగల జట్టు ఏది..? లేదా.. టైటిల్ ఫేవరెట్ గా అందరూ ఒప్పుకొనే జట్టు ఏది..? పోనీ.. ఆల్ రౌండ్ సత్తా ఉన్న జట్టు ఏది..? దీనికి సమాధానంగా వచ్చే పేరు ఇంగ్లండ్.. 2015 ప్రపంచ కప్ లో తొలి రౌండ్ లోనే ఓటమి ఎదుర్కొని దారుణ పరాభవంతో ఇంటికి చేరిన తర్వాత ఇంగ్లండ్ ఆటతీరే మారిపోయింది. ముఖ్యంగా 2017 నుంచి చూస్త ఆ జట్టు దూకుడు మాత్రమే తెలిసినట్లుగా ఆడుతోంది. ఆ క్రమంలోనే అనేక రికార్డులు బద్దలు కొడుతోంది. 2019లో సొంతగడ్డపై జరిగిన ప్రపంచ కప్ లో విజేతగానూ నిలిచింది. నిజానికి అప్పటికే ఇంగ్లండ్ దూకుడు చూసి ఆ జట్టును అందరూ ఫేవరెట్ గా అంచనా వేశారు. దానిని నిజం చేస్తూ ఫైనల్ చేరిన ఇంగ్లండ్.. అత్యంత ఉత్కంఠభరిత సమరంలో న్యూజిలాండ్ ను కేవలం బౌండరీల సంఖ్య ద్వారా ఓడించగలిగింది.

ఫేవరెట్ గా బరిలో దిగి

భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ లో ఇంగ్లండ్ ఫేవరెట్ గా బరిలో దిగింది. అంటే.. దీన్నిబట్టి చెప్పేదేమంటే, ఈ నాలుగేళ్లలోనూ ఇంగ్లండ్ దూకుడు, స్థాయి ఏమాత్రం తగ్గలేదు. ఇంకా చెప్పాలంటే ఇంగ్లిష్ జట్టు మరింత రాటు దేలింది. అందుకే భారత్ ను కాకుండా ఎక్కువమంది బట్లర్ సేనను ఫేవరెట్ గా చెప్పారు. అయితే, అలాంటి జట్టుకు న్యూజిలాండ్ షాకిచ్చింది. ప్రపంచ కప్ మొదటి మ్యాచ్ లో సంచలనం నమోదు చేసింది. మామూలుగా అయితే ఇది విషయం కాదు.. కానీ దీనివెనుక ఓ భారతీయుడు ఉన్నాడు. అందుకే చెప్పుకోవాల్సి వస్తోంది.

కివీస్ రవీంద్ర జడేజా.. రచిన్ రవీంద్ర

గత ప్రపంచ కప్ ఫైనల్ పరాజయానికి న్యూజిలాండ్ ఇంగ్లండ్ పై ప్రతీకారం తీర్చుకుంది. అయితే, ఆ ప్రతీకారంలో ఓ కీలక పనిముట్టుగా భారతీయ మూలాలున్న రచిన్ రవీంద్ర ఉపయోగపడ్డాడు. అచ్చం టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా లాగే న్యూజిలాండ్ జట్టుకూ సేవలందిస్తున్న రచిన్ ఇంగ్లండ్ ను ఓడించడంలో కీలక పాత్ర పోషించాడు.

మొదట బౌలింగ్ లో.. ఇంగ్లండ్ హార్డ్ హిట్టర్ హ్యారీ బ్రూక్ ను ఇంటికి పంపిన రచిన్ బ్యాటింగ్ లో చెలరేగాడు. బౌలింగ్ లో పది ఓవర్ల కోటాలో 76 పరుగులిచ్చిన రచిన్ బ్యాటింగ్ లో మాత్రం సాధికారికంగా ఆడాడు.

కాన్వేను మించి..

స్పిన్ బౌలింగ్ ఆల్ రౌండర్ అయినప్పటికీ.. జట్టు యాజమాన్యం నమ్మకంతో వన్ డౌన్ లో పంపగా దానికి రచిన్ న్యాయం చేశాడు. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమంటే.. రచిన్ ఆడిన తీరు. ఓ ఎండ్ లో డెవాన్ కాన్వే ఉండగా.. అతడిని మరిపిస్తూ.. తన షాట్లతో మురిపిస్తూ చెలరేగాడు.

రచిన్ గతంలో టీమిండియాపైనే టెస్టు ఆరంగ్రేటం చేశాడు. 18 టీ20లు, 13 వన్డేలు ఆడాడు. రచిన్ రవీంద్ర తల్లిదండ్రులు భారతీయులే. బెంగళూరుకి చెందిన రచిన్ రవీంద్ర తండ్రి రవి కృష్ణమూర్తి, 1990ల్లోనే న్యూజిలాండ్‌కి వెళ్లి అక్కడే సెటిల్ అయ్యాడు. అక్కడే పుట్టి పెరిగిన రచిన్ రవీంద్ర, క్రికెట్‌లో రాటుతేలింది మాత్రం ఇక్కడే. ప్రతీ ఏడాది ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో ఉన్న ఆర్‌డీటీ (రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్)కి వచ్చి క్రికెట్ ఆడతుండేవాడు. తండ్రి రవి కృష్ణమూర్తి స్థాపించిన హాట్ హాక్స్ క్లబ్ తరుపున రచిన్ రవీంద్రతో పాటు చాలామంది ప్లేయర్లు, న్యూజిలాండ్ నుంచి ఇక్కడికి వచ్చి క్రికెట్ టోర్నీలు ఆడుతుండేవాడు.

Tags:    

Similar News