ప్రపంచ క్రికెట్ లో మరో వెస్టిండీస్ ఆ దేశం.. 3 ఫార్మాట్లలోనూ పతనం

రెండేళ్లలోపే నలుగురు కెప్టెన్లు.. మరో ఆటగాడు అద్భుతంగా ఆడుతున్నా అతడికి కెప్టెన్సీ ఇవ్వదు.. ఇదీ ప్రస్తుతం పాకిస్థాన్ క్రికెట్ దుస్థితి

Update: 2024-09-04 12:08 GMT

చరిత్రలో తొలిసారిగా సొంతగడ్డపై 10 వికెట్ల తేడాతో ఓటమి.. బలహీన జట్టు చేతిలో క్లీన్ స్వీప్.. సరైన నిర్ణయాలు తీసుకోలేని అసలు కెప్టెన్ ఎందుకు పనికొస్తాడో తెలియదు.. స్టార్ బ్యాట్స్ మన్ ఫామ్ లో లేడు.. ప్రతిభావంతులైన పేసర్లను పక్కనపెట్టి కొత్తవాళ్లతో మ్యాచ్ బరిలో దిగడం ఎందుకో? అర్థం కాదు. రెండేళ్లలోపే నలుగురు కెప్టెన్లు.. మరో ఆటగాడు అద్భుతంగా ఆడుతున్నా అతడికి కెప్టెన్సీ ఇవ్వదు.. ఇదీ ప్రస్తుతం పాకిస్థాన్ క్రికెట్ దుస్థితి. రోజురోజుకీ పతనంలో కొత్త రికార్డులు దాని సొంతం చేసుకుంటోంది.

అమెరికా అయినా బంగ్లా అయినా ఓటమే

వన్డేల ప్రపంచ కప్ లో అఫ్ఘానిస్థాన్ చేతిలో పరాజయం.. టి20 ప్రపంచ కప్ లో అనామక అమెరికా చేతిలో ఓటమి.. ఇప్పుడు టెస్టుల్లో బలహీన బంగ్లాదేశ్ చేతిలో చిత్తు.. ఇలా మూడు ఫార్మాట్లలోనూ పాకిస్థాన్‌ క్రికెట్ జట్టుకు షాక్‌ మీద షాకులే. స్వదేశంలో తొలిసారి బంగ్లాదేశ్‌ చేతిలో టెస్టు సిరీస్‌ ఓడిన ఆ జట్టు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ పాయింట్ల పట్టికలో 8వ స్థానానికి పడిపోయింది. దీంతోపాటు బోనస్ గా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టెస్టు ర్యాంకింగ్స్‌ లోనూ 8వ ప్లేస్ కు జారిపోయింది.

గెలిచి ఉంటే..

స్వదేశంలో గెలవకున్నా పర్వాలేదు.. ఓడకుంటే (డ్రా) పాకిస్థాన్ కు బాగుండేదేమో? అంతకుముందు 6వ ర్యాంకులో ఉన్న పాక్.. బంగ్లా దెబ్బతో రెండు స్థానాలను కోల్పోయింది. అందులోనూ వరుసగా రెండు మ్యాచ్ లలో ఓటమి పాకిస్థాన్ కు దెబ్బకొట్టింది. కాగా, టెస్టు ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా (124), భారత్ (120), ఇంగ్లండ్ (108) మొదటి మూడుస్థానాల్లో ఉన్నాయి. వచ్చే ఏడాది జూన్ లో ఈ చాంపియన్ షిప్ ఫైనల్ జరుగుతుంది. పాయింట్లలో టాప్ -2 జట్లు ఫైనల్స్ ఆడతాయి. భారత్ (68.52 శాతం), ఆస్ట్రేలియా (62.50 శాతం) ఇప్పటికి టాప్ లో ఉన్నాయి. న్యూజిలాండ్‌ (50) జట్టు మూడో స్థానంలో నిలిచింది. ఇక పాకిస్థాన్ పై సంచలన విజయం సాధించిన బంగ్లాదేశ్‌ (45.83) నాలుగో స్థానానికి ఎగబాకింది. స్వదేశంలో శ్రీలంకపై వరుసగా రెండు టెస్టులు గెలిచిన ఇంగ్లండ్ (45) ఐదో స్థానానికి చేరింది.

కొసమెరుపు: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో 8వ స్థానానికి పడిపోయిన పాకిస్థాన్ కు.. టెస్టు చాంపియన్ షిప్ పాయింట్ల (19.05)లోనూ 8వ స్థానమే దక్కింది. చూస్తూ ఉంటే.. పాకిస్థాన్ కూడా.. అపారమైన ప్రతిభ ఉండి సరైన మేనేజ్ మెంట్ లేక సాధారణ జట్టుగా మిగిలిపోయిన వెస్టిండీస్ లాగా మారుతుందా? అనే సందేహం కలుగుతోంది.

Tags:    

Similar News