కాబోయే అమ్మ.. ఆర్చరీ అథ్లెట్ గా.. పారాలింపిక్స్ లో 7 నెలల గర్భిణి

మరీ ముఖ్యంగా కచ్చితమైన గురి కుదరాల్సిన ఆర్చరీ (విలు విద్య) వంటి వాటిలో పోటీ పడడం మహాద్భుతమే అని కొనియాడాలి.

Update: 2024-08-31 09:39 GMT

సరిగ్గా నెల కిందట జరిగిన పారిస్ ఒలింపిక్స్ లో గర్భంతో ఉన్న పలువురు అథ్లెట్లు పోటీ పడిన సంగతి అందరికీ తెలిసిందే. ఇదంతా ప్రేక్షకులను ఔరా అనిపించేలా చేసింది. అత్యంత పోటీ ఉండే ఒలింపిక్స్ లో.. సెకన్లలో ఫలితాలు తారుమారయ్యే ఒలింపిక్స్ లో.. శారీరకంగా అత్యంత ఫిట్ నెస్ కావాల్సిన ఒలింపిక్స్ లో గర్భిణులు పోటీ పడిన వైనాన్ని చూసి అందరూ శభాష్ అని మెచ్చుకున్నారు. ఇక పారాలింపిక్స్ అంటే.. వికలాంగులకు నిర్వహించేవి. వీటిలో గర్భిణులు బరిలో దిగడం అంటే అద్భుతమే అని చెప్పాలి. మరీ ముఖ్యంగా కచ్చితమైన గురి కుదరాల్సిన ఆర్చరీ (విలు విద్య) వంటి వాటిలో పోటీ పడడం మహాద్భుతమే అని కొనియాడాలి. బ్రిటన్ కు చెందిన అథ్లెట్ ను ఈ కోవలోనే చూడాలి.

ఇంట్లో ఓ బిడ్డ.. కడుపులో మరో బిడ్డ

బ్రిటన్ కు చెందిన జోడీ గ్రిన్‌హమ్‌.. ప్రస్తుతం ఏడు నెలల గర్భంతో పారాలింపిక్స్ లో పోటీ పడుతోంది. ఆర్చరీ అథ్లెట్ అయిన ఈమె పతకంపై గురిపెట్టింది. ఇప్పటికే రెండేళ్ల బాలుడికి తల్లయిన ఈమె.. అతడిని ఇంట్లో వదిలేసి వచ్చింది. పారిస్ పారాలింపిక్స్ లో శుక్రవారం మహిళల వ్యక్తిగత కాంపౌండ్‌ ఓపెన్‌ ఈవెంట్‌ ర్యాంకింగ్‌ రౌండ్‌ లో 693 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. ఇక బ్రిటన్‌ కే చెందిన నాథన్‌ మాక్‌క్విన్‌ తో కలిసి మిక్స్‌డ్‌ టీం కాంపౌండ్‌ ఓపెన్‌ ఈవెంట్లో రెండో స్థానం సాధించింది. అంటే.. వైకల్యాన్ని చిన్నబోయేలా చేసింది. ఒకే రోజు రెండు ఈవెంట్లలో.. అదీ శరీర వైకల్యాన్ని అధిగమిస్తూ.. కడుపులో ఓ ప్రాణిని మోస్తూ..

ఇంట్లో అమ్మను.. రింగ్ లో ఆర్చర్ ను

పోటీల అనంతరం గ్రిన్ హమ్ మీడియాతో మాట్లాడుతూ, అమ్మదనం, ఆర్చరీ రెండూ తన కళ్లు అని చెప్పింది. దేనినీ తాను వదులుకోనని ప్రకటించింది. అయితే, ఆర్చరీ రింగ్ లో దిగితే ఎంతటి ప్రొఫెషనల్ నో.. ఇంటికి వెళ్తే అమ్మ పాత్రలో అంతగా లీనమవుతానని పేర్కొంది. తన సత్తా మేరకు రాణించలేపోయినట్లు చెప్పిన గ్రిన్ హమ్.. మెరుగైన ప్రదర్శన చేయగలననే ఆశాభావం వ్యక్తం చేసింది. నాలుగో స్థానంలో నిలవడం ఏమీ తక్కువ కాదని ఆత్మవిశ్వాసాన్ని కనబర్చింది. ఇతర ఈవెంట్లపై మరింత దృష్టిపెడతానని చెప్పింది.

8 ఏళ్ల కిందటే..

జోడీ గ్రిన్‌హమ్‌ గతంలోనూ పారాలింపిక్స్ లో పాల్గొంది. అయితే, అది 8 ఏళ్ల కింద కావడం గమనార్హ. 2016లో జరిగిన రియో పారాలింపిక్స్‌ (2016)లో మిక్స్‌డ్‌ టీం కాంపౌండ్‌ విభాగంలో రజతం గెలుచుకుందీ బ్రిటన్ భామ. పారిస్ పారాలింపిక్స్‌ లో శని, సోమవారాల్లో 2 ఈవెంట్లలో పాల్గొననుంది. కాగా, పుట్టుకతోనే రెండు చేతులు లేని భారత ఆర్చర్ శీతల్ దేవి పారిస్ పారాలింపిక్స్ లో ప్రాతినిధ్యం వహిస్తోంది. కాలు, భుజంతోనే విల్లును కదిలిస్తూ ఔరా అనిపిస్తోంది.

Tags:    

Similar News