బైబై పారిస్.. వచ్చే ఒలింపిక్స్ ఎక్కడో తెలుసా? అందులో క్రికెట్ వచ్చేస్తోంది

ప్రేమికుల నగరం.. ఫ్యాషన్ రాజధాని పారిస్ లో సరిగ్గా వందేళ్ల తర్వాత జరిగిన ఒలింపిక్స్ ముగిశాయి.

Update: 2024-08-12 09:24 GMT

ప్రేమికుల నగరం.. ఫ్యాషన్ రాజధాని పారిస్ లో సరిగ్గా వందేళ్ల తర్వాత జరిగిన ఒలింపిక్స్ ముగిశాయి. రెండు వారాలకు పైగా సమయంలో ప్రపంచాన్ని అలరించాయి. మరి 2024 ఒలింపిక్స్ ముగిశాయి. ఇక వచ్చేసారి.. నాలుగేళ్ల తర్వాత వేదిక ఎక్కడ...? దీనికి సమాధానం.. చలో లాస్ ఏజెంలిస్.. అమెరికాలోని పసిఫిక్ సముద్ర తీరాన ఉండే ఈ నగరం ముచ్చటగా మూడోసారి 44 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే, ఈసారి నుంచి ఒలింపిక్స్ లో క్రికెట్ కూడా ఉండనుండడం భారతీయులకు మహా ఆనందం కలిగించే విషయం.

ఏ ఫార్మాట్ లో ఆడతారో..?

ఒలింపిక్స్ అంటే రెండు వారాల పండుగ.. మరి ఈ నేపథ్యంలో క్రికెట్ ను ఏ ఫార్మాట్ లో ఆడతారో తెలియాలి. టెస్టు ఫార్మాట్ అసలు వీలు పడదు. వన్డేలకూ వీలు లేదు. కాబట్టి టి20 ఫార్మాట్ లో ఒలింపిక్స్ లో క్రికెట్ పోటీలు జరగనున్నాయి. అంతేకాదు.. 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ లో క్రికెట్ చోటు దక్కింది. ఇప్పటికే మొన్నటి టి20 ప్రపంచ కప్ లో 20 దేశాలు పోటీపడ్డాయి. మరి వచ్చే ఒలింపిక్స్ కు ఇదే సంఖ్యలో కాకున్నా.. అటుఇటుగానైనా పోటీ పడే దేశాలు ఉండొచ్చు.

పారిస్‌ ఒలింపిక్స్‌ను మించి..

పారిస్ లో వందేళ్ల తర్వాత ఒలింపిక్స్ జరిగినా.. కొన్ని విమర్శలున్నాయి. అయితే, వీటిని మించి నిర్వహించేలా లాస్‌ ఏంజెలెస్‌ ప్రణాళికలు వేస్తోంది. అమెరికా ఆ మేరకు కసరత్తులు కూడా మొదలు పెట్టింది. అంతేగాక.. ఒలింపిక్స్ కు హాలీవుడ్‌ గ్లామర్‌ జోడిస్తోంది. విశ్వ క్రీడలకు మూడోసారి ఆతిథ్యం ఇచ్చింది పారిస్. అలాగే లాస్ ఏంజెలిస్ కూడా మూడో సారి ఆతిథ్య నగరం కానుంది. లండన్‌ లో 1908, 1948, 2012లో, పారిస్ లో 1900, 1924, 2024 సంవత్సరాల్లో ఒలింపిక్స్ జరిగాయి. లాస్‌ ఏంజెలెస్‌ 1932, 1984లో నిర్వహించారు. అంటే 44 ఏళ్ల తర్వాత ఆతిథ్యం ఇవ్వనుంది. లండన్, పారిస్ లు మూడోసారి నిర్వహణకు 64, 100 ఏళ్ల సమయం తీసుకున్నాయి.

అందమైన బీచ్ లతో.

లాస్ ఏంజెలిస్ అంటే పసిఫిక్‌ మహాసముద్రం తీర నగరం. ఇక్కడ అందమైన బీచ్‌ లు అంతకుమించి అందమైన వీధులు ఉంటాయి. పారిస్ లో ఇటీవలి ఒలింపిక్స్ కోసం కొత్త నిర్మాణాలు పెద్దగా చేపట్టలేదు. లాస్ ఏంజెలిస్ లోనూ అంతే చేయనున్నారు. ఇక 2028 జూలై 14 నుంచి జూలై 30 వరకు ఒలింపిక్స్ జరుగుతాయి. పారిస్ లో జరిగిన 1900 ఒలింపిక్స్‌ లో క్రికెట్ చివరిసారిగా కనిపించింది. మళ్లీ లాస్‌ ఏంజెలెస్‌ లో దానిని చూడనున్నాం. పురాతన క్రీడ అయిన లాక్రాస్‌ పునరాగమనం చేయబోతుంది. లండన్ లో 1908లో ఈ క్రీడలు జరిగాయి. పారిస్‌ లో లేని బేస్‌ బాల్‌/సాఫ్ట్‌ బాల్‌ తిరిగి రానుండగా స్క్వాష్, ఫ్లాగ్‌ ఫుట్‌ బాల్‌ ఒలింపిక్‌ అరంగేట్రం చేయనున్నాయి. స్క్వాష్ లో మనకు పతకాలు పక్కా ఏమో? పారిస్ లో మనకు ఆరు పతకాలు మాత్రమే దక్కాయి. వీటిని మించి లాస్ ఏంజెలిస్ మురిపిస్తుందేమో చూడాలి.

Tags:    

Similar News