మోదీ స్టేడియంలో పేలవం.. మరి రాజీవ్ స్టేడియం నిండుతుందా?
ఉప్పల్ మైదానంలో ఐపీఎల్ మ్యాచ్ ల సందర్భంగా ప్రేక్షకులు పోటెత్తేవారు. టీమిండియా మ్యాచ్ ల సందర్భంగానూ బాగానే హాజరయ్యేవారు
దేశంలో ఐదో అతిపెద్ద నగరం ఏదంటే హైదరాబాద్. గత కొన్నేళ్లుగా తెలుగు నగరం సాధించిన ఘన కీర్తి ఇది. వైద్యపరంగా భాగ్యనగరం ఎప్పుడో ముందుకెళ్లింది.. చదువుల్లోనూ ముందంజలోనే ఉంది.. క్రీడాపరంగానూ దేశం గర్వించదగ్గ ఆటగాళ్లను అందించింది హైదరాబాద్. అలాంటి హైదరాబాద్ కు తురుపుముక్క ఉప్పల్ క్రికెట్ స్టేడియం. నగరం నడిబొడ్డున ఎప్పుడో నిర్మించిన లాల్ బహదూర్ శాస్త్రి (ఎల్బీ) స్టేడియం నుంచి పదిహేనేళ్ల కిందటే ఉప్పల్ కు క్రికెట్ మ్యాచ్ లు తరలిపోయాయి. నగరానికి అప్పట్లో దూరంగా అధునాతన రీతిలో నిర్మించిన ఈ స్టేడియం క్రికెట్ ప్రేమికులకు మజాను పంచుతోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సందర్భంగా ఉప్పల్ మైదానంలో కనిపించే సందడే వేరు.
మన మ్యాచ్ లు లేవు..
2011 తర్వాత భారత్ వన్డే ప్రపంచ కప్ నకు ఆతిథ్యం ఇస్తోంది. అంతేగాక పూర్తి స్థాయిలో టోర్నీని నిర్వహిస్తోంది. అంటే.. ఇతర దేశాల భాగస్వాయం లేకుండానే.. అన్ని మ్యాచ్ లకూ భారత్ లోని మైదానాలే వేదికగా నిలుస్తున్నాయి. అందులో భాగంగానే ఉప్పల్ కూ మూడు మ్యాచ్ లు దక్కాయి. శుక్రవారం మన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పసికూన నెదర్లాండ్స్ తో తలపడనుంది. అనంతరం ఈ నెల 9న, 10న వరుస తేదీల్లో ప్రపంచ కప్ మ్యాచ్ లు జరుగుతాయి. కాగా, ప్రపంచ కప్ దేశంలోని పది వేదికల్లో జరగనుంది. అందులో ఉప్పల్ ఒకటి. పాకిస్థాన్ కు రెండు మ్యాచ్ లు ఆడే అవకాశం దక్కినా.. టీమిండియా మ్యాచ్ ఒక్కటీ లేకపోవడం నిరాశ కలిగించే అంశం.
పాకిస్థాన్ కు పండుగే
నెదర్లాండ్స్ తో పాటు శ్రీలంకనూ ఉప్పల్ మైదానంలోనే పాకిస్థాన్ ఎదుర్కోనుంది. పేస్ కు కాస్త అనుకూలించే ఉప్పల్ పిచ్ పాక్ కు ఉపయోగపడుతుంది. అందులోనూ రెండు సన్నాహక మ్యాచ్ లు ఆడి పది రోజులుగా ఇక్కడే ఉన్న ఆ జట్టు పరిస్థితులకు అలవాటు పడింది. వాతావరణం కూడా అనుకూలంగా ఉన్న నేపథ్యంలో బాబర్ ఆజామ్ సేన రెండు మ్యాచ్ లలోనూ గెలిచేందుకు చాన్సుంది.
అభిమానుల స్పందన ఏమిటో?
ఉప్పల్ మైదానంలో ఐపీఎల్ మ్యాచ్ ల సందర్భంగా ప్రేక్షకులు పోటెత్తేవారు. టీమిండియా మ్యాచ్ ల సందర్భంగానూ బాగానే హాజరయ్యేవారు. అయితే, ఈసారి ప్రపంచ కప్ మ్యాచ్ లకు హాజరు ఎలా ఉంటుందో చూడాలి. అందులోనూ పాకిస్థాన్ ఆడుతున్నందు ఎంతమేరకు వస్తారో గమనించాల్సి ఉంది. కాగా, ఈ నెల 10 వ తేదీతో ఉప్పల్ లో చివరి మ్యాచ్ పూర్తవవుతుంది. ఆ తర్వాత 34 రోజులు ప్రపంచ కప్ జరిగినా.. మనకు ఆతిథ్యం లేదు. అంటే.. కప్ ప్రారంభ దశలోనే మ్యాచ్ లు ఉప్పల్ కు కేటాయించారు.
కొసమెరుపు: గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ లో గురువారం జరిగిన ప్రపంచ కప్ ఆరంభ మ్యాచ్ కు ప్రేక్షకులే లేరనే విమర్శలు వచ్చాయి. మరుసటి రోజే హైదరాబాద్ మ్యాచ్ కు ఆతిథ్యం ఇవ్వనుంది. మరి.. దీనికి హాజరు ఎలా ఉంటుందో? అందులోనూ ఓ వైపు నెదర్లాండ్స్ వంటి చిన్న జట్టు ఉన్న మ్యాచ్ కావడంతో ఆదరణ ఎలా ఉంటుందో? ఇంతకూ ప్రేక్షకులను తరలించేందుకు ఏమైనా ఏర్పాట్లు చేశారో లేదో?