రోహిత్ శర్మ మాటల్లోనూ హిట్ మ్యానే.. రిటైర్మెంట్ చర్చపై సెటైర్లు!
మెల్ బోర్న్ టెస్ట్ అనంతరం రోహిత్ శర్మ అభిమానులకు, భారత క్రికెట్ ఫ్యాన్స్ లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే.
బోర్డర్-గవస్కర్ ట్రోఫీ అయిదో మ్యాచ్ లో తనకు తాను విశ్రాంతి తీసుకున్న నేపథ్యంలో బాక్సింగ్ డే టెస్టు రోహిత్ శర్మకు చివరి ప్రదర్శనగా భావిస్తున్నట్లు దిగ్గజ ఆటగాళ్లు సునీల్ గవస్కర్, రవిశాస్త్రీ అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. డబ్ల్యూటీసీ ఫైనల్ కు భారత్ అర్హత సాధించకపోతే మాత్రం మెల్ బోర్న్ టెస్టే రోహిత్ కు చివరిదయ్యే అవకాశాలున్నాయని వారు అభిప్రాయపడ్డారు.
మరోపక్క... చివరి టెస్టులో కెప్టెన్ రోహిత్ శర్మను ఆడించకపోవడం ఘోర తప్పిదమని.. సిరీస్ మధ్యలో కెప్టెన్ ను తప్పిస్తే అది తప్పుడు సంకేతాలు పంపుతోందని నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ అభిప్రాయపడ్డారు. ఈ పరిణామాల నేపథ్యంలో రోహిత్ శర్మ రిటైర్మెంట్ పై తీవ్ర ఉత్కంఠ నెలకొందని అంటున్నారు. ఈ సమయంలో ఈ వ్యవహారంపై క్లారిటీ వచ్చేసింది.
అవును... మెల్ బోర్న్ టెస్ట్ అనంతరం రోహిత్ శర్మ అభిమానులకు, భారత క్రికెట్ ఫ్యాన్స్ లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. హిట్ మ్యాన్ ఇకపై టెస్టు క్రికెట్ కు గుడ్ బై చెప్పబోతున్నాడా అనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ సమయంలో తన ఫ్యూచర్ పై రోహిత్ శర్మ ఓ క్లారిటీ ఇచ్చాడు. తనకు జట్టు అవసరాలే ముఖ్యమని వెల్లడించాడు.
ఆసిస్ తో ఐదో టెస్ట్ మ్యాచ్ రెండో రోజు లంచ్ బ్రేక్ సమయంలో ఇర్ఫాన్ పఠాన్ తో కలిసి మాట్లాడిన రోహిత్ శర్మ.. తాను రిటైర్మెంట్ తీసుకోవడం లేదని.. తనకు జట్టు అవసరాలే ముఖ్యమని.. అందుకోసమే తాను సిడ్నీ టెస్టు నుంచి తాను తప్పుకున్నానని.. ఇది కేవలం విశ్రాంతి మాత్రమే అని.. తాను రిటైర్మెంట్ తీసుకొవడం లేదని స్పష్టం చేశాడు!.
ఈ సందర్భంగా... పెర్త్ టెస్టులో కేఎల్ రాహుల్ – జైశ్వాల్ లు డబుల్ సెంచరీ భాగస్వామ్యంతో మ్యాచ్ గెలవడంలో కీలక భూమిక పోషించారని.. ఈ పరిస్థితుల్లో అలాంటి జోడీని మార్చకూడదనే ఉద్దేశ్యంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని.. పైగా ఫాం పరంగా కేఎల్ మెరుగ్గా ఉన్నాడని.. తాను తీసుకున్నది చాలా సున్నితమైన నిర్ణయమని రోహిత్ తెలిపాడు.
ఇక... తన వ్యక్తిగత ఫాం గురించి స్పందించిన రోహిత్.. కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇందులో భాగంగా... తాను ఇప్పుడు పరుగులు చేయలేకపోయానని.. అయితే, రాబోయే రోజుల్లో పరుగులు చేయనని ఎవరూ గ్యారెంటీ ఇవ్వలేరని.. ఫాం కోసం నిరంతరం శ్రమిస్తున్నానని రోహిత్ శర్మ వెల్లడించాడు.
ఈ సమయంలో తన రిటైర్మెంట్ గురించి జరుగుతున్న చర్చలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... ల్యాప్ ట్యాప్ లు, పెన్నులు, పేపర్లు ముందేసుకుని తను ఎప్పుడు రిటైర్మెంట్ తీసుకోవాలి, ఎప్పుడు ఏమి చేయాలి అనేది ఎవరూ నిర్ణయించలేరని రోహిత్ ఘాటుగా స్పందించారు. దీంతో... రోహిత్ శర్మ మైదానంలోనే కాదు, మాటల్లోనూ హిట్ మ్యానే అంటూ కామెంట్లు చేస్తున్నారు అభిమానులు!