ముంబై కెప్టెన్సీపై రోహిత్ ఫస్ట్ రియాక్షన్ ఇదే!
ఈ సమయంలో తాజాగా ముంబై కెప్టెన్సీపై తొలిసారి రోహిత్ శర్మ స్పందించారు.
ఐపీఎల్ సీజన్ 17 స్టార్ట్ అయినప్పటి నుంచీ రోహిత్ శర్మను ముంబై కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడం పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో కొంతమంది ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్, రోహిత్ ఫ్యాన్స్.. హార్దిక్ పాండ్యాని నెట్టింట ట్రోల్ చేయడం, మైదానంలో ర్యాగింగ్ చేయడం వంటివి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో తాజాగా ముంబై కెప్టెన్సీపై తొలిసారి రోహిత్ శర్మ స్పందించారు.
అవును... త్వరలో జరగనున్న టీ20 ప్రపంచకప్ మెగా టోర్నీ కోసం ఇటీవల బీసీసీఐ భారత జట్టును ప్రకటించిన అంశంపై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన టీంఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. జట్టు కూర్పుపై వస్తున్న విమర్శలు, సందేహాలపై వివరణ ఇచ్చారు. ఈ సమయంలోనే ముంబై కెప్టెన్సీపై స్పందించారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇందులో భాగంగా... తాను ఇప్పుడు టీంఇండియా కెప్టెన్ గా ఉన్నా.. రేపు ఉండకపోవచ్చని.. ఇదంతా జీవితంలో ఒక భాగం అని.. అన్నీ మనం అనుకున్నట్లు జరగవని రోహిత్ వ్యాఖ్యానించారు. ఇదే క్రమంలో... గతంలోనూ తాను ఇతరుల నాయకత్వంలో ఆడినట్లు గుర్తుచేసుకున్న రోహిత్.. ఒక ప్లేయర్ గా రాణించేందుకు ఎల్లప్పుడూ ప్రయత్నిస్తానని తెలిపారు. గత నెల రోజులుగా అదే చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఇదే క్రమంలో... జట్టులో నలుగురు స్పిన్నర్లకు అవకాశం కల్పించడంపైనా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఇందులో భాగంగా... నలుగురిని ఎందుకు ఎంపిక చేశామనేది ఇప్పుడు కాదు.. వెస్టిండీస్ లో వెల్లడిస్తామని స్పష్టం చేశారు. ఈ సమయంలో వ్యక్తిగతంగా తన జట్టులో నలుగురు స్పిన్నర్లు ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపిన ఆయన... హార్దిక్ సీమ్ ఆల్ రౌండర్ గా వ్యవహరిస్తున్నాడని తెలిపాడు.
ఈ సందర్భంగా అజిత్ కూడా పలు కీలక విషయాలు వెల్లడించారు. ఇందులో భాగంగా... మిడిల్ ఆర్డర్ లో స్వేచ్ఛగా ఆడగలిగే క్రికెటర్ ఉండాలనే శివమ్ దూబెను ఎంచుకున్నామని చెప్పారు. ఇదే క్రమంలో... హార్దిక్ పాండ్య ఫిట్ గా, అందుబాటులో ఉన్నంతకాలం జట్టులో ఉండాలని తాము భావిస్తున్నామని.. ఆ విషయంలో ఎలాంటి సందేహం లేదని అజిత్ అగార్కర్ స్పష్టం చేశారు.